Take a fresh look at your lifestyle.

ప్రభుత్వాలపైనే నమ్మకం సన్నగిల్లుతున్నదా ?

ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎంపిక కాబడి పాలన సాగిస్తున్న ప్రభుత్వాల పైనే క్రమేణ విశ్వాసం సన్నగిల్లు పోతున్నదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గత కొద్ది రోజులుగా, ఆ మాటకు వొస్తే కొద్ది సంవత్సరాలుగా ఈ అనుమానాన్ని రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మనకు తెలియకుండానే మన దేశానికి చెందిన సమాచారం ఇతర దేశాలకు చేరుతోందా? అందుకు మనం, మన ప్రభుత్వాలే కారణమవుతున్నాయా అన్నదిప్పుడు దేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై చర్చన్నది ఇవ్వాళే కొత్తగా మొదలైందేమీ కాదు. గత యుపిఏ ప్రభుత్వ హయాంలో డా.మన్‌మోహన్‌సింగ్‌ ‌ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే తమ ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయంటూ పలువురు గగ్గోలు పెట్టిన విషయం తెలియందికాదు. ఈ విషయమై ఆనాడు పార్లమెంట్‌లో కూడా విస్తృత చర్చ జరిగింది. ఒక విధంగా ఆనాడు ఉభయ సభల్లో ఈ చర్చ నేపథ్యంలో సభ స్థంబించిన పరిస్థితి. ఇప్పుడు మళ్లీ అదే సీను పునరావృతమైంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ నేతలు గగ్గోలు పెడితే, ఈ నాడు అదే పార్టీ అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపైన ఇతర రాజకీయ పక్షాలిప్పుడు విరుచుకుపడుతున్నాయి. ప్రధానంగా బిజెపి మిత్రపక్షాలేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ట్యాపింగ్‌ ‌ప్రక్రియ జరుగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ ‌దేశానికి చెందిన పెగాసెస్‌ అనే స్పైవేర్‌ ‌టెక్నాలజీని వినియోగించి కేంద్రం వివిధ వర్గాల వారిపైన నిఘా పెట్టిందన్నదానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నది.

రాజకీయంగా నిలదొక్కుకోవడానికి అధికార పక్షాలు ఇలాంటి చీప్‌ ‌పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై తాజాగా శుక్రవారం ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు సభలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం అంతర్గత శత్రువు రహస్యాలను తెలుసుకోవడానికి వినియోగించుకున్నా, ఈ టెక్నాలజీ వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నది ఆందోళనాంశం. దీని ద్వారా దేశంలోని ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, మావోయిస్టులు, ఐపిఎస్‌, ఐఏఎస్‌ అధికారులతో సహా పలువురి ఫోన్లను ట్యాప్‌ ‌చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. విచిత్రమేమంటే ఈ విషయాన్ని విదేశీ మీడియా సంస్థలు కూడా వెలుగులోకి తీసుకురావడం, అవసరమైతే అందుకు సంబంధించిన రుజువులను కూడా చూపుతామనడం…! తాజా పార్లమెంట్‌ ‌సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీ తన ఫోన్లన్ని ట్యాప్‌ అవుతున్నాయని ఆరోపించడం కూడా గమనార్హం. అంతేకాకుండా ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టి పట్టింది. ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు, అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే ఆరోపణ చేయగా, టిఎంసి ఎంపీ అవునని ట్వీట్‌ ‌చేశాడు. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నది.

దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సుమోటో గా తీసుకోవాలని కోరింది. ఎడిటర్స్ ‌గిల్డ్ ‌కూడా అ విషయంపై ఆందోళన వ్యక్తు చేసింది. పాత్రికేయులపై నిఘా అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని కోరింది. ఇదిలా ఉంటే ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఏపిలో అక్కడి ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌రెడ్డి ఇదే టెక్నాలజీతో ప్రతిపక్షాలు, జడ్జీలు, న్యాయవాదులు, హక్కుల నేతలపై నిఘా పెట్టాడని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కి ఒక సుదీర్ఘ లేఖ కూడా రాసారు. కాగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై ఏపి హైకోర్టులో ఇప్పటికే ఒక కేసు విచారణలో ఉందికూడా. అలాగే తెలంగాణ సర్కార్‌పైన కూడా ఆరోపణలున్నాయి. తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌తెలంగాణ సర్కార్‌ ‌కూడా ఫోన్‌ ‌ట్యాపింగ్‌కు పాల్పడుతున్నదంటూ ఆరోపిస్తున్నారు.

మానవహక్కులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారని, ఇది గోప్యతా హక్కులను హరించడమేనంటూ దీనిపై సంఘటిత పోరాటానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. తామేదైనా ఆందోళన చేపట్టాలని అనుకుని ఆచరణలో పెట్టకముందే తమ ఇండ్ల ముందు పోలీసులు ప్రత్యక్ష మవుతుంటే ఇలాంటి సాంకేతికతను ప్రభుత్వం వాడుతున్నదన్న నమ్మకం తమకు కలుగుతున్నదంటారాయన. ఈ విషయమై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికి వారి మాటలను దొంగతనంగా వినడం హేయమైన చర్యగా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గద్దెలు ఎక్కడ కదులుతాయోనన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై నిగ్గుతేల్చేందుకు కాంగ్రెస్‌ ఎం‌పి శశిధరూర్‌ ‌నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ నెల 28న విచారణ జరుపనున్నట్లు తెలిసింది.

Leave a Reply