అత్యంత ఆధునిక అభివృద్ధి కేంద్రంగా యూపి
గంగా ఎక్స్‌ప్రెస్ హైవేకు ప్రధాని మోడీ శంకుస్థాపన
600 కిలోమిటర్ల పొడవైన నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు
విమానాల కోసం 3.5 కిలోమిటర్ల ఎయిర్ స్ట్రిప్ సౌకర్యం
లక్నో, డిసెంబర్ 18 : అత్యంత ఆధునిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా యూపి రూపుదిద్దుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాల వల్ల ఉత్తర ప్రదేశ్ త్వరలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని చేతుల మిదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. సుమారు 600 కిలోమిటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. తదుపరి తరం మౌలిక సదుపాయాలతో అత్యాధునిక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ గుర్తింపు పొందడం ఎంతో దూరంలో లేదని మోదీ చెప్పారు. రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్‌వేల నెట్వర్క్, నిర్మితమవుతున్న నూతన విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అనేక వరాలను తీసుకొస్తున్నాయని తెలిపారు.
మిరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభల్, బడౌన్, షాజహాన్‌పూర్, హర్దోయి, ఉణవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ ప్రజలను అభినందించారు. 600 కిలోమిటర్ల నిడివిగల ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం రూ.36,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని తెలిపారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. వేలాది మంది యువతీయువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. అంతేకాకుండా సరికొత్త అవకాశాలు కూడా చేరువవుతాయని చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని, గొప్ప సదుపాయంగా ఉంటుందని తెలిపారు. వీటన్నిటి ఫలితంగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర వనరులు సద్వినియోగమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో నేడు ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతుందని, వనరులు ఏవిధంగా సద్వినియోగమవుతున్నాయో ప్రజలు చూస్తున్నారని, గతంలో వనరులను ఎలా ఉపయోగించేవారో కూడా చూశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితమవుతుంది. దీనిని 8 లేన్లకు విస్తరించవచ్చు. దీనిలో 3.5 కిలోమిటర్ల ఎయిర్ స్ట్రిప్ కూడా ఉంది. అత్యవసర సమయంలో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి బయల్దేరడానికి అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఓ పారిశ్రామిక నడవను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్ తరం మౌలిక సదుపాయాలతో ఉత్తరప్రదేశ్ అత్యాధునిక రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి ఇంకా ఎంతో కాలం పట్టదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యూపీలోని ఎక్స్‌ప్రెస్ వేస్ నెట్‌వర్క్‌తో కొత్త ఎయిర్‌పోర్టులు, కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వొస్తాయన్నారు. ప్రజాధనం గతంలో ఎలా దుర్వినియోగమయ్యేదో అందరూ చూశారని, పాలకులు భారీ ప్రాజెక్టులను పేపర్లకు పరిమితం చేసి సొంత ఖజానా నింపుకునే వారని ప్రధాని ఆరోపించారు.