Take a fresh look at your lifestyle.

ప్రజా పాదయాత్ర మూడేళ్ళ పండుగ

“పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలకు క్రియారూపం ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి  శాయ శక్తులా ప్రయత్నిస్తున్నమాట కాదనలేని నిజం. అయితే అనుభవ లేమికారణంగా సంక్షేమ పథకాల అమలు బాటలో అనాలోచితంగా వేస్తున్న అడుగులవల్ల జగన్ కు అనుకోని దెబ్బలు ఎదురవుతూ, ఆయనను ప్రజల ఎదుట దోషిగా, ప్రత్యర్ధుల ఎదుట విఫలునిగా నిలబెడుతున్నాయి. 17 నెలలో తీసుకున్న నిర్ణయాలు, అమలు విధానాలు ఆయనకు అగ్నిపరీక్షగా తయారయ్యాయి.”

‘సుప్రీమ్’  లో కోర్టు ధిక్కార  పిటిష న్లు  –  విచారణ డోలాయమానం లో జగన్ 

“మీ ఆశలు తీరాయి, కష్టానికి ఫలితం దక్కింది. అధికార పీఠం ఎక్కారు. 17 నెలలు పూర్తయ్యాయి. సరే, మీ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడునా ఎదురౌతున్న ప్రశ్నలివి.

సరిగ్గా మూడేళ్ళకిందట, 2017 నవంబరు 6వతేదీ ముఖ్యమంత్రి గద్దెపై కన్నేసి, దీక్షపూని యువనేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ వై ఎస్ ఆర్ ఘాట్ నుంచీ వేసిన తొలి అడుగు అద్వితీయ పాదయాత్రగా మారి, నిరాఘాటంగా 3,648 కిలోమీటర్ల దూరం 341 రోజులపాటు అసంఖ్యాకంగా ప్రజలు నీరాజనాలు పట్టి వెంటరాగా 134 అసెంబ్లీ నియోజక వర్గాలగుండా సాగి, ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికల్లో 151 స్థానాలు హస్తగతం చేసుకుని అక్షండ విజయం సాధించి పెట్టి అపర రాజకీయ చాణుక్యునిగా పేరొందిన చంద్రబాబునాయుడు పార్టీని ఘోర పరాజయం పాల్జేసింది.

జగన్ మహా సంకల్పయాత్ర గతంలో వై ఎస్ ఆర్ మహాప్రస్థానాన్ని గుర్తు చేసిందనడం లో అతిశయోక్తి లేదు. పాదయాత్ర ఫలితంగానే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో వై ఎస్ఆర్సీపీ విజయభేరి మోగించింది, జగన్ వ్యక్తిత్వం శిఖరాగ్రాన నిలవగా, ఎత్తులు, పై ఎత్తులలో నలభై ఏళ్ళ అనుభవంతో జాతీయ స్థాయిలో రాజకీయచక్రం తిప్పిన చంద్రబాబునాయుడు అడ్రసు గల్లంతైంది. ప్రజల అండదందలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాను నిర్దేసించుకున్న లక్ష్యాలను సాధించారా, ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు ఫలించాయా.. అని ఆత్మావలోకనం చేసుకుంటే.. జవాబు నిరాశా జనకంగా ఉందనడంలో సందేహం లేదు.

పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలకు క్రియారూపం ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి శాయ శక్తులా ప్రయత్నిస్తున్నమాట కాదనలేని నిజం. అయితే అనుభవ లేమికారణంగా సంక్షేమ పథకాల అమలు బాటలో అనాలోచితంగా వేస్తున్న అడుగులవల్ల జగన్ కు అనుకోని దెబ్బలు ఎదురవుతూ, ఆయనను ప్రజల ఎదుట దోషిగా, ప్రత్యర్ధుల ఎదుట విఫలునిగా నిలబెడుతున్నాయి. 17 నెలలో తీసుకున్న నిర్ణయాలు, అమలు విధానాలు ఆయనకు అగ్నిపరీక్షగా తయారయ్యాయి.

దొరికివచ్చిన అవకాశాన్ని రాజకీయ ప్రత్యర్ధులు ఆయుధాలుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎన్నికల్లో అఖండ ప్రజా మద్దదుతో అత్యధిక స్థానాలు దక్కించుకుని 2019 మే 30 న ముఖ్యమంత్రి పదవిలో ఆశీనులయిన జగన్మోహన్ రెడ్డి 17 నెలలు గా అనుసరిస్తున్న వివాదాస్పద నిర్ణయాలు, ప్రజాదరణ పథకాలు, అమలు జేస్తున్న రాజకీయ కక్ష సాధింపులు, విప్లవాత్మక నిర్ణయాలు ఆయన్ను ఇరకాటంలో నెట్టాయనడంలో అనుమానం లేదు. అదనుకోసం ఎదురు చూస్తున్న విశేష రాజకీయ అనుభవ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన మిత్ర బృందానికి ఇవన్ని కలసివచ్చిన అంశాలే..

చంద్రబాబు నాయుడు కలలుకన్న ప్రపంచస్థాయి నగరం రాష్ట్ర నూతన రాజధాని – అమరావతి -ని పురిట్లోనే పూడ్చిపెట్టే లక్ష్యంతో, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడు నగరాల రాజధాని ప్రతిపాదన తెరపైకి తేవడంతోపాటు, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగతోడడం, ప్రతిసారీ ఊతపదంగా వాడుతున్న రివర్స్ – రివర్స్ టెండరింగ్.. తదితరాలు ప్రభుత్వాన్ని వివాదాల్లోకి నెట్టాయి.

గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను తిరిగితోడి, వాటి స్థానంలో ప్రజా సంక్షేమానికి, రాజకీయ లబ్దికోసం తమకనుకూల నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రభుత్వం అనుసరించే సాధారణ మార్గమైనప్పటికీ.. కొత్త ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వివాదాలను రేకెత్తించడంతోపాటు, న్యాయస్థానాల సమీక్షపరిధిలోకి వెళ్ళడం జగన్ ను ఇరకాటంలో నెట్టాయనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వ అమలుచేసిన కార్యక్రమాలు,తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధమైన రీతిలో మార్పులు చేస్తూ చంద్రబాబు రాజకీయ పరిపక్వతను తక్కువ అంచానా వేసి అడుసులో కాలేసారు జగన్మోహన్ రెడ్డి. కొత్త ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు, అర్ధరహిత నిర్ణయాలకు న్యాయస్థానం అభ్యంతరాలతో అడ్దుకట్టవేసి జగన్ వేగానికి స్పీడ్ బ్రేకర్ లా కట్టడిచేయడం చంద్రబాబు చాణక్య నీతివల్లనే అని, జగన్ కు ముందస్తు ఆలోచనలేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డితో నేరుగా తలపడకుండా ఆయన తీసుకునే ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యక్రమంలో లొసుగులు ఎత్తి చూపుతూ తన వారిద్వారా చంద్రబాబు న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రోత్సహిస్తూ న్యాయ పోరాటానికి తెరతీ తీసారని ఒక వాదన. కోర్టుల్లో కేసులవలన న్యాయ వ్యవస్థకు జగన్ కు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినా ముఖ్యమంత్రి ఆ కోణంలో చూడకుండా పట్టుదల వీడకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల ముందు చంద్రబాబును పదవీచ్యుతుని చేయడానికి న్యాయ పొరాటాలను ప్రోత్సహించిన జగన్ ఇప్పుడు అదే ఇరకాట పరిస్థితులు ఎదుర్కొంటూ మల్లగుల్లాలు పడుతున్నారట. స్వీయరక్షణ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తూ సుప్రీమ్ న్యాయమూర్తి కె వి రమణ పై అభియోగాలు చేస్తూ, లేఖ రాయడం. చంద్రబాబు నాయుడు జస్టిస్ రమణ మధ్య సంయుక్త ప్రయోజనాలున్నాయని ఆ లేఖలో పేర్కొనడం రాజ్యాంగ అనుచితమని విమర్శలకు గురై.. చివరకు జగన్ న్యాయవ్యవస్థతో ఘర్షణపడే వాతావరణం కల్పించుకున్న పరిస్థితులేర్పడ్డాయి.

సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, రాజ్యాంగ సంక్షోభం ఎదుర్కొంటూ క్రిమినల్ పరంగా కోర్టుధిక్కారానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిపై చర్య తీసుకోవాలంటూ దాఖలైన మూడు పిటిషన్లు నవంబర్ 16న విచారణకు రానుండం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రధాన న్యాయ మూర్తికి జగన్ లేఖ రాసి చంద్రబాబు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వపు నిర్ణయాలు, అమలు చేసిన పథకాలకు వ్యక్తిగత ఈర్ష్యా ద్వేషాలతో గండికోట్టడమే జగన్మోహన్ రెడ్డిని న్యాయవ్యవస్థతో ఘర్షణకు దింపి ఈ ఊపిరాడని స్థితి కల్పించిందంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి హద్దుల్లో వారుండాలనే పాఠం నేటి ఈ పరిస్థితి జగన్ కు నేర్పించినట్లయిందంటున్నారు. అనవసర వివాదాల్లో కూరుకుపోయి జగన్ తన లక్ష్యాలను విస్మరించి 17 నెలల కాలం వృధా చేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబును, ఆయన పథకాలు, కార్యక్రమాలను చరిత్ర నుంచీ చెరిపివేసే తొందరపాటులో తన భవిష్యత్తును న్యాయవ్యవస్థకు స్వహస్తాలతో అప్పగించారని అభిప్రాయ పడుతున్నారు.

కోర్టు ధిక్కార నేరారోపణ పిటిషన్లపై సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఉత్కంఠ రేపుతున్నప్పటికీ మూడేళ్ళ కిందట ప్రజలతో మమేకమై పాదయాత్ర చేసి ఒక శక్తిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశలు తీరుస్తారా లేదా అనే సందేహాం కలుగుతున్నది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న రాజకీయనాయకులపై న్యాయ విచారణలను న్యాయస్థానం వేగవంతం చేయడం, బిజెపి కూడా అవకాశం ఉపయోగించుకుని జగన్ పై అస్త్రాలుసంధించడం తో ఆయన ఒంటరిగా తయారయ్యారు. ఒక వైపు వైసిపి కార్యకర్తలు సంకల్ప పాదయాత్ర మూడేళ్ళ వార్షికోత్సవం ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ జగన్మోహన్ రెడ్డి సవాళ్లను ఎదుర్కోనవలసిరావడం చిరాకైన విషయమే..

-శ్యామ్ 

Leave a Reply