Take a fresh look at your lifestyle.

‌ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి

ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం

– సౌమ్యకాంతి ఘోష్‌
‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు
ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త రుణ పరపతి కార్యక్రమం నేటిదాకా అనేక సానుకూల మార్పులు తెచ్చింది. అయితే, అంతకుముందు పరిస్థితులపై సింహావలోకనం ఈ సందర్భంగా సముచితం. మన సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను 2014-15 నాటికి మొండి బకాయిల చీకటి రోజులు కమ్ముకోవడంతో ముఖ్యంగా దేశ సామాజిక-సాంస్కృతిక సమ్మేళనం మీద దుష్ప్రభావం పడింది. ఆ దుస్థితి నుంచి బయటపడే దిశగా స్వయం ఉపాధికి ఊతమిస్తూ  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ‘పిఎంఎంవై’ కూడా ఒకటి. భారతదేశంలోని శక్తిమంతమైన వ్యాపార పర్యావరణంలో భాగమైన సూక్ష్మ-వ్యక్తిగత వ్యాపార వ్యవస్థకు చేయూత లక్ష్యంగా ఈ పథకం మొదలైంది. సూక్ష్మ వ్యాపార సంస్థలు ప్రధానంగా తయారీ, శుద్ధి, వాణిజ్యం, సేవల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో అధికశాతం వ్యక్తిగతంగా నడపబడుతున్నవే కావడం గమనార్హం.
ఈ వ్యాపారాలు ఎక్కువగా సొంత పెట్టుబడి లేదా వ్యక్తిగత రుణదాతలు/వడ్డీ వ్యాపారులపై ఆధారపడి సాగుతుంటాయి. దేశంలోని సంప్రదాయ లేదా సంస్థాగత రుణ పరపతి సంస్థలు వాటికి చేరువై ఆర్థిక అవసరాలను తీర్చలేకపోయాయి. ఈ అగాథాన్ని పూడ్చే దిశగా బ్యాంకింగ్‌ ‌వ్యవస్థకు వెలుపలగల రంగానికి, సంప్రదాయ వడ్డీ వ్యాపారాలకు నడుమ రుణ పరపతి కల్పించే వారధిగా ‘పిఎంఎంవై’ని ప్రబుత్వం ప్రవేశపెట్టింది. తదనుగుణంగా 2015లో ప్రారంభమైన ఈ పథకంలో షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు(ఎస్‌సిబి), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బి), బ్యాంకింగేతర ఆర్థికసహాయ సంస్థలు (ఎన్‌ఎన్‌బిఎఫ్‌సి), సూక్ష్మరుణ సంస్థలు(ఎంఎఫ్‌ఐ) ‌సభ్య రుణదాతలుగా ఉంటాయి. వీటిద్వారా సూక్ష్మ, వ్యక్తిగత వ్యాపారాలకు రూ. 10 లక్షల దాకా పూచీకత్తులేని సంస్థాగత రుణాలను ‘పిఎంఎంవై’ సమకూరుస్తుంది.
ఈ పథకం నేతృత్వాన పనిచేసే ‘సూక్ష్మ సంస్థల అభివృద్ధి-పునఃరుణ కల్పన సంస్థ(ముద్ర) విభిన్న రుణ మొత్తాల ప్రాతిపదికన- ‘శిశు’ (రూ. 50,000దాకా), ‘కిశోర’ (రూ. 50,001 నుంచి 5 లక్షలు), ‘తరుణ్‌’ (‌రూ. 500,001 నుంచి 10 లక్షలు) పేరిట మూడు ఉప-పథకాలను రూపొందించింది. ఈ మూడు పేర్లూ లబ్ధిదారుల సూక్ష్మ సంస్థల ఎదుగుదల లేదా అభివృద్ధి దశతోపాటు వాటి నిధుల అవసరాలను సూచిస్తాయి. సముచిత వ్యాపార ప్రణాళికగల వ్యక్తులెవరైనా రుణార్హతగల చిన్న వ్యాపార సంస్థల ఏర్పాటుకు ఈ పథకం కింద రుణం పొందవచ్చు. అయితే, ఈ పథకం ప్రారంభమైన నాటినుంచీ సానుకూల ఆర్థిక ప్రభావాన్ని గరిష్ఠం చేసేలా పరిధిని విస్తరించడం సహా అనేక కాలానుగుణ మార్పులకు లోనైంది. తొలినాళ్లలో తయారీ, వాణిజ్యం, సేవల రంగాల్లో ఆదాయ సృష్టి కార్యకలాపాలను మాత్రమే ‘పిఎంఎంవై’ అనుమతించింది. కానీ, 2016-17 నుంచి వ్యవసాయ అనుబంధ రంగాల కార్యకలాపాలు, జీవనోపాధికి దోహదం చేసే వాటి మద్దతు సేవలు కూడా పథకం పరిధిలో చేర్చబడ్డాయి. అటుపైన 2017-18 నుంచి ట్రాక్టర్లు, పవర్‌ ‌టిల్లర్ల కొనుగోలుకూ రుణాలు మంజూరు చేయబడ్డాయి. అలాగే 2018-19 నుంచి వ్యాపార అవసరాల కోసం ద్విచక్ర వాహనాలకూ రుణాలివ్వడం ప్రారంభమైంది.
ఈ పథకం కింద రుణ పంపిణీ తొలి మూడేళ్లలో సగటున 33 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆ మేరకు దీని విశిష్ట లక్ష్యం ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్లింది. ముఖ్యంగా కోవిడ్‌ ‌మహమ్మారి వ్యాప్తి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో ఈ రుణాలకుగల  డిమాండ్‌ ‌ప్రభావితమైంది. అయితే, భారత రిజర్వ్ ‌బ్యాంక్‌ (ఆర్‌బిఐ) నిర్దేశించిన ప్రత్యేక ఉపశమన నిబంధనతో ఈ పథకం కింద పొందిన అన్నిరకాల రుణ కంతుల వసూళ్లపై ఆరు నెలల తాత్కాలిక నిషేధం విధించబడింది. ఆర్థిక వ్యవస్థ కొంత కుదుటపడిన తర్వాత ‘పిఎంఎంవై’ మళ్లీ వేగం పుంజుకోవడంతో అన్ని విభాగాల్లోనూ రుణ పంపిణీ కోవిడ్‌ ‌మునుపటి స్థాయిని దాటిపోయింది. ఈ మేరకు 2023 మార్చి 24నాటి గణాంకాల ప్రకారం ఈ పథకం కింద సంచిత రుణ పంపిణీ మొత్తం రూ. 226.5 లక్షల కోట్లకు చేరింది. ఇందులో 40 శాతం రుణాలతో ‘శిశు’ విభాగం అగ్రస్థానంలో నిలిచింది. దీన్నిబట్టి వ్యాపార రంగంలో తొలిసారి పాదం మోపినవారికి ‘పిఎంఎంవై’ ఎంతగానో మద్దతిచ్చిందని స్పష్టమవుతోంది.
ప్రధానమంత్రి ముద్ర పథకంతో సానుకూల ఆర్థిక ప్రభావం ఇప్పుడు సుస్పష్టమైంది. కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం- 2015-18 మధ్య కాలంలో ఈ పథకం 1.12 కోట్ల అదనపు ఉద్యోగాల సృష్టికి తోడ్పడింది. మరోవైపు ఈ పథకంతో సామాజిక ప్రభావం ప్రధానంగా మూడు స్థాయులలో- (1) విస్తృత సామాజిక సమూహాలు (2) మహిళలు (3) మైనారిటీ వర్గాల మధ్య మరింత లోతుగా కనిపించింది. మొదటి స్థాయిలో భారత సమాజంలోని సాధారణ, షెడ్యూల్డు కులాలు/తెగలు), ఇతర వెనుకబడిన తరగతులు వంటి అన్నివర్గాలూ ‘పిఎఎంవై’ ద్వారా లబ్ధిపొందాయి. ఇటీవలి కాలంలో ఓబీసీలు, ఎస్సీలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి ఈ పథకం విస్తృతిని అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులకు ఎనలేని ప్రోత్సాహం లభించడం ఈ పథకం సాధించిన అత్యంత ప్రశంసనీయ విజయాల్లో ఒకటి. ఆరంభం నుంచీ దీనికి సంబంధించిన గణాంకాల మేరకు రుణాల్లో మహిళా ఖాతాల వాటా 69 శాతం కాగా, రుణాలు పొందినవారు 45 శాతంగా ఉన్నారు. పథకం మొదలయ్యాక తొలి నాలుగేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు చెల్లింపుల్లో వృద్ధి వార్షిక సగటు 23 శాతం కాగా, 2022లో కోవిడ్‌ ‌మునుపటి స్థాయిని అధిగమించి 28 శాతం వృద్ధితో మరింత బలంగా నమోదైంది. అలాగే సార్వజనీనత సంబంధిత చర్యల్లోనూ ‘పిఎంఎంవై’ చక్కని పనితీరు చూపింది. ముఖ్యంగా మైనారిటీల అవసరాలను తీర్చడంలో సఫలమైంది. ఆ మేరకు 2022లో ఆ వర్గాలకు అందిన రుణాలు రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 10 శాతానికి చేరాయి. ఇందులో ‘శిశు, కిశోర’ విభాగాల్లో రుణాలు 85 శాతం కావడం విశేషం. ఇది జాతీయ పథకం కాబట్టి సమతుల ఆర్థికాభివృద్ధి దృష్ట్యా దీని ప్రాదేశిక విస్తరణకు ప్రాముఖ్యం ఉంది. దేశంలోని ప్రగతిశీల పశ్చిమ, వెనుకబడిన తూర్పు ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరాన్ని తొలగించాలనేది భారత వృద్ధి విధానాల్లోని ఒక లక్ష్యం. రుణఖాతాల సంఖ్య, పంపిణీ అయిన మొత్తాలను బట్టి ‘హెర్ఫిండాల్‌ ‌సాంద్రత సూచీ’ అంచనాల మేరకు  రాష్ట్రాలవారీ, ఉత్పత్తులవారీ విస్తరణ ప్రస్ఫుటమవుతుండగా, భౌగోళికంగా పథకం విస్తరణను ఇది సూచిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌, ఒడిషా, బీహార్‌ ‌వంటి రాష్ట్రాలు ‘పిఎంఎంవై’ నుంచి అన్నివిధాలా లబ్ధి పొందాయి. అలాగే పశ్చిమ బెంగాల్‌, ‌త్రిపుర రాష్ట్రాలు కూడా (కిశోర,  తరుణ కేటగిరీలుసహా) తమ మొత్తం రుణ వాటాలో పెరుగుదలను నమోదు చేశాయి. తూర్పు ప్రాంతాల్లోని లబ్ధిదారులవైపు పథకం పయనాన్ని ఇది సూచిస్తోంది. జాతీయ రాజధాని ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఈ పథకం పరిధిలో సంపూర్ణ ఆధిపత్యం చలాయించినా రుణవాటా తగ్గడం విశేషం. మొత్తంమీద తన తొమ్మిదో ఏడాదిలో సామాజిక సమూహాల స్వయం ఉపాధి పెంపు, వాణిజ్య-బ్యాంకు రుణాలలో మహిళల భాగస్వామ్యం రెట్టింపు కావడం, మైనారిటీల వాటా పెంపును నమోదు చేసింది. తద్వారా వివిధ సమూహాలకు ప్రయోజనాలు అందించడంలో సమాన, సముచిత ప్రాదేశిక పంపిణీ లక్ష్యాలను సాధించింది.
భవిష్యత్తులో ముద్ర కార్డులు మరింత ప్రాచుర్యం పొందేసరికి ‘పిఎంఎంవై’ 5జి సాంకేతికత, ఇ-కామర్స్ ‌ప్రయోజనాలు పొందడం తథ్యం. సొంత వ్యాపారాల నమోదు, అధికారిక గుర్తింపు మంజూరుకు ప్రోత్సాహం ఈ పథకాన్ని సరికొత్త గరిష్ట స్థాయికి చేర్చే మరొక మార్గం కాగలదు. ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఆస్కార్‌ ‌లూయిస్‌ ‌తన ప్రసిద్ధ రచన ‘ది చిల్డ్రన్‌ ఆఫ్‌ ‌శాంచెజ్‌’‌లో- ‘‘పేదరిక సంస్కృతి’’ కాలక్రమంలో శాశ్వతంగా కొనసాగేలా కనిపించినా, అది తరచూ సరిహద్దులను అధిగమించగలదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘పిఎంఎంవై’ తక్కువ వ్యవధిలోనే ఈ పేదరిక సంస్కృతిని ఎదుర్కొని, దాని బాటను మార్చడమేగాక భారతీయ సూక్ష్మ-రుణ పర్యావరణ వ్యవస్థలో చైతన్యం, సమర్థ్యత స్ఫూర్తి నింపింది. ఆ విధంగా ‘సాధారణ సమస్యలకు అసాధారణ పరిష్కారం’గా ఈ పథకం అవతరించిందనడంలో సందేహం లేదు.
(ఈ వ్యాసంలోని అంశాలన్నీ పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు..)

Leave a Reply