Take a fresh look at your lifestyle.

అధికార దుర్వినియోగం..

సోషల్‌ ‌మీడియాలో మొన్నోవార్త కనిపించింది. అందరికీ తెలిసిన విషయమే అయినా ఓ వ్యక్తి తన జర్నలిస్టు మిత్రునికి అర్థరాత్రి ఫోన్‌చేసి తానో ప్రశ్న అడుగాలనుకుంటున్నానని, సరైన సమాధానం చెప్పాలని అడిగిండట .. ఆ ప్రశ్న తనను చాలా రోజులుగా తొలుస్తున్నదని, దాని వివరణ లభించేవరకు తనకు నిద్రపట్టడం లేదన్నది అందులోని సారాంశం. ఇంతకూ ఏందా ప్రశ్న అంటే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పెట్టే మీడియా సమావేశాలకు మీఅంతట మీరే వెళ్తారా… ఎవరైనాసమాచారమిస్తే వెళ్తారా అన్నది. ఇందులో ఆశ్చర్యమేముంది సిఎంఓ ఆఫీసు నుండి తమకు మెసేజ్ వొస్తనే వెళ్తామని సమాధానమిచ్చిన ఆ జర్నలిస్టుకు ఆయన మిత్రుడు ఒక విధంగా షాకిచ్చాడట. సాధారణంగా సిఎం ప్రెస్‌మీట్‌ అం‌టే దాదాపు గంటకు తక్కువుండదు. అంతసేపు బుద్దిమంతుల్లా సోదాహరణంగా విని, చివర్లో మీరడిగే ప్రశ్నలు రివర్స్‌లో మిమ్మల్నే ఇరుకున పెట్టేవిగా ఉంటున్నాయి కదా, అందుకోసమే మీరక్కడికి వెళ్తారా అన్న తన అనుమానాన్ని వ్యక్తం చేసిన మిత్రుని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో పాపమా జర్నలిస్టుకు తెలియని పరిస్థితేర్పడిందట. నిజంగానే సిఎం మీడియా సమావేశాన్ని ప్రత్యక్షంగా టీవీల్లో చూసేవారికి ఇటువంటి అనుమానాలు వొ స్తుండవచ్చు. ఆమధ్య సోషల్‌ ‌మీడియాలో మరో వ్యక్తి తాను అబ్జర్వ్ ‌చేసిన అంశాన్ని ఊటంకింస్తూ… మీడియా సమావేశానికి హాజరైన ఓ సీనియర్‌ ‌జర్నలిస్టును, సిఎం పేరుతో పలకరిస్తూ… ‘నువ్వుకూడా ఇట్లనే అడిగితే ఎట్లా..’ అనగానే, మరేదో అడగాలనుకున్న ఇతర విలేఖరులు కూడా చప్పబడిపోతున్నారట. గత మీడియా సమావేశాలకు నేటి సమావేశాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నదన్నదన్న భావన చాలామందిలో ఉన్నది ..వాస్తవం కూడా .!. తెలంగాణ ఏర్పడడానికి పూర్వం పట్టించుకున్నట్లుగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతగా పట్టించుకోవడంలేదన్నది జర్నలిస్టు సంఘాలు కూడా తరుచూ ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తమ సమస్యలను పరిష్కరిస్తానన్న ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వొచ్చిన తర్వాత కూడా మాటనిలుపుకోలేదంటూ రోజూ ఎక్కడో ఒక దగ్గర ఆందోళన కార్యక్రమాలు, అధికారులకు, నాయకులకు విజ్ఞాపన పత్రాలనివ్వడం నిత్యకృత్యంగామారింది..కానీ , వారి సమస్యలకు ఒక పరిష్కారమార్గం ఇంతవరకు కనిపించడంలేదు. ఇదిలాఉంటే అధికార పార్టీ నాయకులు తమకు ఏమాత్రం వ్యతిరేకంగా వార్తలు వొచ్చినా భ రించలేకుండా ఉన్నారన్నది తాజాగా జరిగిన ఓ సంఘటన అద్దం పడుతున్నది. సంగారెడ్డి జిల్లా నారయణఖేడ్‌ ఎంఎల్‌ఏ ఉదంతంపై జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎంఎల్‌ఏ ‌సంబంధిత జర్నలిస్ట్ కు క్షమాపణ చెప్పాల్సిందేనని, ఆర్థికంగా నష్టపర్చిన ఆ జర్నలిస్టుకు పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుపడుతున్నాయి., కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్న వేళ ఖేడ్‌ ఎంఎల్‌ఏ ‌తన ఆరవైయవ పుట్టిన రోజు వేడుకను వందలమంది సమక్షంలో ఘనంగా జరుపుకున్న సంఘటన అక్కడి సమస్యకు మూలం. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ప్రజలెవరినీ ఇండ్లనుంచి బయటికి రావొద్దని ప్రభుత్వం చాలా కఠినమైన ఆదేశాలు జారీచేసింది. అలా వొచ్చినవారిని పోలీసులు ఎలా చితకబాదారో, వారితోని ఎలా గుంజీలు తీయించారో, ఎంతెంత అపరాధ రుసుము వసూలు చేశారో, ఎన్ని వాహనాలను సీజ్ ‌చేశారో నిత్యం టీవీల ద్వారా ప్రత్యక్షంగా చూశాంకూడా.

ఇలాంటి పరిస్థితిలో తన జన్మదిన వేడుకను తన స్నేహితుల మద్య ఎంఎల్‌ఏ ‌జరుపుకున్న విషయాన్ని స్థానిక ఎలక్ట్రానిక్‌ ‌మీడియా రిపోర్టర్‌ ‌ప్రసారంచేయడం ఆ రిపోర్టర్‌ ‌కొంప ముంచింది. ఈ వేడుకలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను కూడా అందించనున్నట్లు ప్రచారంచేయడంతో వందలాదిమంది అక్కడికి చేరుకున్నారు. అసలే లాక్‌డౌన్‌,అం‌దులో మనుష్యుల మద్య దూరం పాటించాల్సిన నిబంధనలన్నీ అక్కడ తుంగలో తొక్కివేయబడ్డాయి. ఏ కార్యక్రమాలకైనా పోలీసు అనుమతితో పదినుండి ఇరవై మందికన్నా ఎక్కువమంది లేకుండా కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్న ఆదేశాలను పక్కకు పెట్టి , వందలాదిమందిని గుమిగూడనివ్వడమే కాకుండా సరుకులకోసం ఒకరినొకరు తోసుకున్న ఉదంతాన్ని ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో చూపించడమే ఆ జర్నలిస్టు చేసిన తప్పిదం. బాధ్యతగల ప్రజానాయకుడు, అందులోనూ శాసనసభ్యుడు నిబంధనలను పట్టించుకోని ఉదంతాన్ని ప్రజలముందుంచినందుకు సంబంధిత జర్నలిస్టు కొత్తగా కట్టుకుంటున్న ఇంటిని కూల్చివేయడం అధికార దుర్వినియోగమే నంటున్నాయి జర్నలిస్టుల సంఘాలతో పాటు బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు. దీనిపై వివరణనివ్వాల్సిందిగా ఎంఎల్‌ఏతోపాటు జిల్లా అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఇబ్రహింపట్టణం ఎంఎల్‌ఏది మరో ఉదంతం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంవద్ద ఫార్మాసిటి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తున్న క్రమంలో స్థానిక ఎంపిటిసీ తనను ఆహ్వానించక పోవడాన్ని ప్రశ్నించినందుకు ఎంఎల్‌ఏ ‌మాట్లాడిన తీరుకు అమె మనస్తాపానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేరడం, ఆమెను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పరామర్శించడంతో పాటు ఎంఎల్‌ఏపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేయడంలాంటి సంఘటనలు అధికారపార్టీ నాయకుల అధికార దుర్వినియోగాన్ని తెలుపుతున్నాయి. తమది అనుకుంటున్న ప్రభుత్వంలోనే తమకు సమస్యలు ఎదురవుతే ఇక పట్టిచ్చుకునేవారెవరుంటారని ఆవేదన చెందుతున్నారు ప్రజలు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply