Take a fresh look at your lifestyle.

దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం

‘‘ఏ ‌దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా భారత రాజ్యాంగంలో ‘చట్టం ముందు అందరూ సమానం, జీవన భద్రత, వెట్టిచాకిరీ నిషేధం, ప్రజాసంక్షేమం, కనీస అవసరాలు పొందే హక్కు’ లాంటి పలు అంశాలను పొందుపరిచినా గత 75 ఏండ్లలో ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం. ’’

75 ఏండ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాలు ఘనం నిర్వహించుకుంటున్న వేళ పేదరిక సమస్య ప్రభుత్వాలను అనాదిగా వెక్కిరిస్తూనే ఉన్నది. కరోనా మహమ్మారి కల్లోలంతో ఆదాయ మార్గాలు మూతపడడం, నిరుద్యోగం పెరగడం, అసమానతల అగాధాలు ఏర్పడడంతో పేదరిక ఊబిలోకి అభాగ్యులు అనేకం పడిపోయారు. నేటి ఆధునిక డిజిటల్‌ ‌యుగంలో కూడా పేదరికం ఓ బహువ్యాధి లక్షణంగా (పావర్టీ సిండ్రోమ్‌) ‌మారడంతో ఈ విష వలయంలో చిక్కిన పేదలు ఆకలి చావుల అంచున నిస్సహాయంగా నిలబడి ఉండడం అత్యంత విషాదకరమే కాదు దేశానికి, దేశవాసులకు అవమానకరం కూడా.

భారత్‌లో పేదరికం:
ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 కోట్ల ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని తెలుస్తున్నది. వరల్డ్ ‌పావర్టీ క్లాక్‌ – 2021 ‌ప్రకారం భారత్‌లో 8.68 కోట్ల జనులు పేదరికంతో సతమతం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇండియాలో పేదరికం 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలపడం కొంత ఊర్లను ఇస్తున్నది. 2011లో పేదరిక శాతం 22.5 ఉండగా, 2019లో 10.2 శాతానికి పడిపోవడం గమనించారు. గ్రామీణ భారతంలో కూడా పేదరికం గణనీయంగా తగ్గడం మరింత ఉపశమనానికి కారణం అవుతున్నది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 26.3 శాతం ఉండగా, 2019లో 11.6 శాతానికి తగ్గడం శుభ పరిణామమనే చెప్పాలి. కరోనాకు పూర్వం కడు పేదరికంలో (ఎక్స్‌ట్రీమ్‌ ‌పావర్టీ) 1 శాతం దేశ ప్రజలు మగ్గుతున్నారని కూడా గణాంకాలు తెలుపుతున్నాయి.

పేదరిక దుష్ప్రభావం:
ఏ దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా భారత రాజ్యాంగంలో ‘చట్టం ముందు అందరూ సమానం, జీవన భద్రత, వెట్టిచాకిరీ నిషేధం, ప్రజాసంక్షేమం, కనీస అవసరాలు పొందే హక్కు’ లాంటి పలు అంశాలను పొందుపరిచినా గత 75 ఏండ్లలో ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం.

పేదరిక నిర్మూలన మార్గాలు:
దారిద్య్ర రేఖ దిగువన నరకం అనుభవిస్తున్న పేదలను పైకి లాగడానికి ప్రభుత్వాలు నిర్దిష్ట ప్రణాళికలు రచించడం, పవిత్ర భావనతో అమలు పరచడం సత్వరమే జరగాలి. పేదరిక నిర్మూలనకు ఆర్థిక ప్రగతి పథకాలు, మౌళిక వనరుల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పటిష్ట ప్రజాపంపిణి వ్యవస్థల కల్పన, వ్యవసాయ రంగ ఉపాధులు, వ్యవసాయేతర ఉపాధులు, పని కల్పన, ఉద్యోగాల కల్పన మ్నెదలగు పలు రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రామిక వర్గాలకు ఉపాధి కల్పించగల ప్రాజెక్టులను చేపట్టడం, దేశ పెట్టుబడులతో పేదల చేతులకు పని కల్పించడం విధిగా జరగాలి. పేదరిక నిర్మూలనకు ఆహార భద్రతతో పాటు పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థలు నిరంతరం చురుకుగా, క్రియాశీలంగా పని చేయాలి. సుస్థిర జీవనోపాధులు, మౌళిక సామాజిక సేవల కల్పన, సామాజిక ఆర్థిక భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్వల్పకాలిక పథకాలతో పాటు దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నపుడే పేదరికం లేని భారతం సిద్ధిస్తుందని మరువరాదు. పేదరిక నిర్మూలనలో జనాభా నియంత్రణ, ప్రాంతీయ అసమానతల తొలగింపు, కనీస అవసరాల కల్పన, ఉన్నత విద్యావ్యాప్తి, నైపుణ్య వికాస కార్యక్రమాలు లాంటివి కొనసాగాలి.

పేదరిక నిర్మూలనలో వ్యవసాయరంగం:
పేదరికానికి దేశ వ్యవసాయాభివృద్ధికి విలోమ సంబంధం ఉంటుంది. వ్యవసాయరంగం అభివృద్ధి పెరిగితే పేదరికం నేరుగా తగ్గుతుంది. 1960ల్లో పంజాబ్‌, ‌హర్యానాల్లో జరిగిన హరిత విప్లవంతో అక్కడ పేదరికం చాలా తగ్గడం చూసాం. అనంతరం వ్యవసాయరంగంలో యాంత్రీకరణ పెరగడంతో ఉద్యోగ ఉపాధులు ప్రభావితం కావడం గత అనుభవంగా గమనించాం. దేశ ఆర్థికాభివృద్ధికి ‘లైఫ్‌లైన్‌’‌గా వ్యవసాయరంగం నిలుస్తున్నది. చిన్న సన్నకారు రైతులకు ఉపశమనం కలించేలా వ్యవసాయానికి ప్రభుత్వాలు చేయూతను ఇవ్వాల్సి కనీస బాధ్యత ఉన్నది. కరువుకాటకాలు, నీటి ఎద్దడి ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయాలకు ప్రాణవాయువును అందించడం కొనసాగాలి. మౌళిక వనరుల కల్పన రంగాలు పేదరికాన్ని తగ్గించేవిగా ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలుగా పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఫౌల్ట్రీ, గొర్లు మేకల పోషణ వృత్తి, రవాణా, చిరు వ్యాపారాలు, హస్తకళలు, వ్యవసాయ ఆధార ఉపాధులకు పెద్ద పీట వేయాలి.

సంక్షేమ, సుస్థిర సమగ్రాభివృద్ధి సమ్మిళిత సేవలు:
ఉచిత పథకాలు స్వల్పకాలిక ఫలితాలను ఇస్తాయని గమనిస్తూ దీర్ఘకాలిక ఉద్యోగ ఉపాధులపై అధిక దృష్టిని కేంద్రీకరించాలి. ‘చేపల్ని ఉచితంగా ఇవ్వడం కాదు చేపలు పట్టే నైపుణ్యాన్ని నేర్పుదాం’ అనే సూత్రాన్ని అమలు చేసినపుడే ఇంటింటా సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. ఓటు బ్యాంకు సంక్షేమ ఉచిత మంత్ర నిర్ణయాలను క్రమంగా తగ్గించుకుంటూ, దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధి దిశగా తమ కాళ్ల మీద తామే నిలబడేలా పేదలకు గౌరవప్రదమైన ఉద్యోగ ఉపాధులను కల్పించడం కనీస కర్తవ్యంగా ప్రభుత్వాలు దిశ నిర్ధేశనం చేయాలి. పేదలు ఓటు వేసే యంత్రాలు కాదని, గౌరవంగా సమాజంలో తల ఎత్తుకొని సగర్వంగా జీవించే పౌరులని గుర్తుంచుకుందాం. బహుముఖీ పథకాల రచనతో పాటు వాటిని పటిష్టంగా అమలు చేసినపుడు మాత్రమే పేదరికం భూతం పారిపోతుందని, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న అభాగ్యులకు చేయి అందించి మానవీయ కోణంతో ప్రపంచ పేదలను బయటకు లాగుదాం. ఆకలి చావులు లేని సౌభాగ్య ప్రపంచాన్ని నిర్మించుకుందాం.

burra madhusudhan reddy

Leave a Reply