Take a fresh look at your lifestyle.

చిక్కిపోతున్న పౌల్ట్రీ పరిశ్రమ

కొరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థికరంగాన్నే కుదిపేస్తున్నది. ముఖ్యంగా ఉత్పత్తి రంగాలకు దాని కారణంగా తీరని అన్యాయం జరుగుతున్నది. ఉత్పత్తులకు తగినట్లుగా కొనుకొళ్ళు లేకపోవడంతో దాదాపుగా అన్ని రంగాలు అయోమయంలో పడిపోతున్నాయి. అలా అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఇప్పుడు పౌల్ట్రీ రంగం చెప్పుకోదగ్గది. కొరోనా వైరస్‌ ‌దుష్ప్రభావం కారణంగా ఈరంగం కుదేలైపోతున్నది. చికెన్‌ ‌తినడంవల్లే కొరోనా వస్తున్నదంటూ విస్తృతంగా ప్రచారం జరుగడం ఈ రంగాన్ని తీవ్ర ఆర్థికసంక్షోభంలోకి నెట్టివేసింది. దీంతో రాష్ట్రంలో ఒకనెల రోజుల్లోనే దాదాపుగా రెండువేల కోట్ల రూపాయల నష్టాన్ని ఈ రంగం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలానే కొనసాగితే ప్రతీనెల రెండువేల కోట్ల రూపాయలచొప్పున నష్టం వాటిల్లక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఈ సంక్షభం నుంచి బయటపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పౌల్ట్రీ వ్యాపారస్తులు ఆర్థిస్తున్నారు. జాతీయ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్‌ ఇటీవలనే ఈ విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి తమకష్టాలను ఏకరువు పెట్టారు.

అసలే చాలాకాలంగా ఈ వ్యవస్థ తీవ్ర వొత్తిడులకు లోనవుతుండగా, గోరుచుట్టుపై రోకటి పోటులాగా కొరోనా మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని, తమను అన్ని విధాలుగా ఆదుకుంటే తప్ప ఈ ఊభిలోనుంచి తాము బయటపడలేమన్న విషయాన్ని అసోసియేషన్‌ ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టింది. చికెన్‌ ‌తిన్నంత మాత్రాన కొరోనా రాదన్న విషయాన్ని ముందుగా ప్రభుత్వాల పరంగా విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలన్నవారి విజ్ఞప్తికి వెంకయ్యనాయుడు పాజిటివ్‌గానే స్పందించినా, చికెన్‌ ‌తినేందుకు మాత్రం ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో మార్కెట్‌లో కోళ్ళు, గుడ్ల ధరలు డమాల్‌ అం‌టూ పడిపోయాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న కోళ్ళను కొనేనాథుడే లేకపోవడంతో ఉత్పత్తిదారులు మరోమార్గంలేక ఉచితంగా పంపిణీ చేపట్టారు. కోళ్ళమీద ఆఫర్లు కూడా ప్రవేశపెట్టారు. రెండు కోళ్ళు కొంటే ఇన్ని గుడ్లు ఫ్రీగా ఇస్తామంటూ ప్రచారం చేశారు. అయినా ఎవరో కొంతమంది తప్ప వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చేసేదేమీలేక వాటిని ప్రాణాలతోనే పూడ్చివేస్తున్నారు. ఈ సంఘటనలు ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశంలోని భిన్న ప్రాంతాల్లోకూడా ఇలాంటి తంతే జరుగుతున్నది. అయితే ఉత్తరాదితో పోల్చిచూస్తే దక్షిణాధిలోనే ఎక్కువగా కనిపిస్తున్నది. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో నజీర్‌ అహమ్మద్‌ అనే పౌల్ట్రీ వ్యాపారస్తుడు తన కోళ్ళ ఫాంకుచెందిన ఆరున్నర వేల కోళ్ళను, తొమ్మిదిన్నర వేల కోడి పిల్లలను ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన సంఘటన సోషల్‌ ‌మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది.

దీన్ని చూస్తే ఆ రంగం ఇప్పుడు ఎంత దయనీయ పరిస్థితికి చేరిందో అర్థమవుతున్నది. అంతెందుకు మనరాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్‌ ‌స్వయంగా తమ సంస్థ ఎంత నష్టపోయిందన్న విషయాన్ని సాక్షాత్తు శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా చెప్పిన విషయం తెలియంది కాదు. కొరోనా ఎఫెక్టుతో తన స్వంత పౌల్ట్రీలో సుమారు పదికోట్ల మేర నష్టం వాటిల్లిన విషయాన్ని ఆయనే స్యయంగా చెప్పాడు. స్యూరాపేట జిల్లా మేళ్ళచెరువులో ఓ రైతు తన పౌల్ట్రీకి చెందిన సుమారు మూడు వేల కోళ్ళను ట్రక్కులో తీసుకుని ఉచితంగా పంచిపెట్డాడు. అలాగే సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మరో కోళ్ళ వ్యాపారి రెండు వేల కోళ్ళను ఉచితంగా పంచిపెట్టారు. జహీరాబాద్‌లోనైతే కోళ్ళను తీసుకునేవారు లేకపోవడంతో వాటిని ఇతరుల్లా పూడ్చిపెట్టడానికి ప్రాణం ధరించక సమీపంలోని పొలాల్లోకి వందలాది కోళ్ళను వదిలేశాడు . కొందరు ఉచిత కోళ్ళనైతే తీసుకుంటున్నారుగాని వాటిని తినాలంటే భయపడిపోతున్నారు. కోడి సగటు ఉత్పత్తి ధర ఎనభై రూపాయలైతే కిలో పదిన్నర రూపాయలకిప్పుడు అమ్ముతున్నారు. అలాగే కోడిగుడ్డు ధర నాలుగున్నర రూపాయల నుండి ఇప్పుడు రెండున్నర రూపాయలకు పడిపోయింది. ఇలా కోళ్ళ పరిశ్రమ స్థంభించి పోవడంతో దీని ప్రభావం ఇతర ఉత్పత్తులపైన పడింది. ప్రధానంగా కోడి దానా తయారుచేసే సోయాబిన్‌, ‌మొక్కజొన్న ఉత్పత్తులపై పడింది.

ఇప్పటికే మొక్కజొన్న కిలోధర ఇరవై అయిదు రూపాయల నుండి పదిహేరు రూపాయలకు తగ్గింది. దీంతో ఆయాపంటల రైతులు కూడా తీవ్ర నష్టానికి లోనవుతున్నారు. ఈ సుడిగుండం నుండి తాము బయటపడాలంటే తమ పట్ల ఉదారంగా వ్యవహరించాలంటున్నారు పౌల్ట్రీ యజమానులు. అదే విషయాన్ని వెంకయ్యనాయుడికి విన్నవించుకున్నారు. పౌల్ట్రీ రంగాలపై అయిదు శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వడంతో పాటు టర్మ్‌లోన్‌ ‌రుణాల చెల్లింపు విషయంలో తమకు ఏడాదిపాటు అదనపు సమయాన్ని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బియ్యం, గోధుమలను కూడా సబ్సీడీ ధరకు అందించినట్లైతే తమకు కొంతమేలు జరుగుతుందని వారు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇదీలా ఉంటే అసలే కరోనా కారణంగా అమ్మకాలు కోల్పోయిన ఈ రంగం రైతులు ఇప్పుడు కొత్తగా వ్యాపిస్తున్న వివిఎన్‌డి వైరస్‌తో హతాశయులవుతున్నారు. ఏపిలో ఇప్పటికే ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో వేలాది కోళ్ళు మృతి చెందాయి. కాగా ఇప్పుడిప్పుడే ఈ వైరస్‌ ‌ఖమ్మం జిల్లాకు కూడా వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు బెంబేలెత్తుతున్నారు.

Leave a Reply