Take a fresh look at your lifestyle.

తెలుగు పత్రికారంగ మేరునగ ధీరుడు

ఐదు దశాబ్దాల పాటు పత్రిక రంగానికి విశేష సేవలు చేసిన ప్రముఖ పాత్రికేయులు, జన్మించింది ఆంధ్రలోనైనా నిఖార్సయిన తెలంగాణ వాది, ప్రజాస్వామిక వాది, మానవ హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసిన మానవతా వాది.  పంచకట్టులో, పొడవు చేతుల తెల్ల చొక్కాపై ఉత్తరీయంతో చిరునవ్వులు చిందిస్తూ అచ్చ తెలుగుతనం మూర్తీభవించే సంస్కృతి, సంప్రదాయం,  నిలువెత్తు విగ్రహం. తెలుగు పత్రికారంగంలో ప్రముఖులుగా విరాజిల్లిన ఆ మూర్తి  ఒక అక్షర నక్షత్రం.  ఒక మంచి మనీషి. పదువురు మెచ్చిన పాత్రికేయుడు. తెలుగు పాత్రికేయ దిగ్గజాల్లాంటి ఎడిటర్లలో ఆయన ఒకరు. ఆయన క్రమశిక్షణ కలిగిన ఒక అక్షర నిబద్ధుడు. తెలుగు పాత్రికేయరంగం శిఖరాగ్రాన నిలిచిన కొద్దిమంది ప్రముఖుల్లో ఈయన ఒకరు. ఆయనే  పొత్తూరి వేంకటేశ్వరరావు. సరిగ్గా నేటికి ఏడాదైంది ఆరూపం అదృశ్యమై. ఆ అక్షరం అంతర్ధానమై. ఆ రూపం మాయమై. ఆ గళం మూగవోయి. కలం ఆగిపోయి.

నాటి పత్రికా విలువలు ఎరిగి, నేడు విలువలు ఎలా, ఏ కారణాల చేత మారిపోయాయో తెలిసిన వారు. 1957లో ఆంధ్రజనతలో అడుగు పెట్టి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ దినపత్రికలతో అపార అనుబంధం ఉంది. ఈనాడు, ఉదయం, వార్త పత్రికలలోనూ అనుభవజ్ఞులైన వ్యక్తి వీరు. ఆంధ్రప్రభ సంపాదకులుగా ఈయన చాలా కాలం పనిచేశారు. చిరునగవుల విత్తనాలు జల్లి పరిమళాల ఉద్యానవనంగా ఆయన తీర్చిదిద్దిన ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం, వార్త.. అక్షరాల వనంలో వారితో కలసి అడుగులు నిజంగా అవార్డులందుకున్నంత గర్వం. అపారమైన ఆయన శిష్య సాగరంలో నేనొక సింధువును.

ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తెలుగు భాషాభ్యున్నతికి కారకులైయ్యారు. తెలుగు భాషా వికాస ధోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు. తెలుగు సర్వతోముఖాభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేసారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. నూట యాబై ఏళ్ళ తెలుగు పత్రికా చరిత్రను ఆకళింపు చేసుకుని నిలువుటద్దంగా ప్రసిద్ధికెక్కారు. దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావుతో పొత్తూరి గారికి చక్కని సాన్నిహిత్యం ఉండేది. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తెలుగు భాషాభ్యున్నతికి కారకులైయ్యారు. తెలుగు భాషా వికాస ధోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు.

తెలుగు సర్వతోముఖాభివృద్ధికి కృషిచేసారు. పత్రికారంగంలో అనేక పరిణామాలని,  మార్పులని చూశారు. తెలుగు పత్రికారంగంలో ప్రముఖులుగా విరాజిల్లిన ఆ మూర్తి ఫిబ్రవరి 8, 1934 లో గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. తండ్రి: వెంకట సుబ్బయ్య,  తల్లి: పన్నగేంద్రమ్మ. చిన్న-పెద్ద, వారి స్థాయి తేడా లేకుండా అందరితో సౌమ్యంగా మాట్లాడే సహృదయులు. తెలుగు పత్రికారంగంలో విలువలకు, వ్యక్తిత్వానికి పెద్దపీట వేసి దశాబ్దాలాకాలం ఆ పునాదులమీద తనకంటూ ఒక ప్రత్యేక పాత్రికేయ భవంతిని నిర్మించుకుని, ఆరు దశాబ్దాలకుపైగా అందరి గౌరవం అభిమానం సంపాదించుకున్న దిట్ట పొత్తూరి. యావత్ తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు పొత్తూరి. ఓ మేటి పాత్రికేయునిలో ఉండవలసిన లక్షణాలన్నీ పొత్తూరిలో ఉన్నాయి. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు. పొత్తూరిది ఎప్పుడూ ప్రసన్న వదనమే. అనుగ్రహమే కానీ, ఆగ్రహం చూడలేదు ఎవరూ. పాత్రికేయ రంగంలో అందరికీ గురుతుల్యులు.

తెలుగు సాహిత్య జగత్తులో అరవై యేళ్ళుగా సాగుతున్న కృషిని, పరిణామాలని పొత్తూరి వినిపించారు. ఆయనది అపారమైన అనుభవం. సాహిత్య ప్రియులందరికీ ఆయన అందుబాటులో వుంటారు. సభలలో తరచు పాల్గొంటారు. అనేక పుస్తకాలకి ముందు మాట వ్రాసారు.  విషయాన్ని చదువరుకలు బోధపడేటట్టు సరళమైన భాషలో చెప్తారు. ఈ నేర్పు, కూర్పు, ఉదారగుణం పొత్తూరి ప్రత్యేకత అని చెప్పవచ్చు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్ పట్టాతో గౌరవించింది. అనేక అంశాలపై సాహితీ సభల్లో, ఆకాశవాణిలో పలుప్రసంగాలు చేసారు. ఆయన రేడియో వార్తలు చదివిన విషయం కొందరికే తెలిసుండవచ్చు. రాష్ట్రంలో తీవ్రవాదుల ఎంకౌంటర్లు జరిగినప్పుడు పౌరహక్కుల సంఘాల తరఫున అనేక నిజనిర్ధారణ కమిటీల్లో సభ్యుడుగా రాజ్యహింసను వేలెట్టి చూపిన సంఘటలెన్నో. టి టి డి ప్రచురణలకు ఫొత్తూరి సంపాదకుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదనకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  స్వయంగా పొత్తూరి గృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయనకు చాలా కాలం బ్రిటీష్ లైబ్రరి సభ్యత్వం ఉండేది. కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) రూపంలోకి మళ్ళించి అంతర్జాలం మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ పథకం అవిష్కరించారు. ఆయన వ్రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనమే “చింతన”. స్ఫూర్తిగా నిలచిన మహనీయుల మీద వ్రాసిన సంపాదకీయాల సంకలనం “చిరస్మరణీయులు”;  తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏమి ప్రత్యేకతలు సంతరించుకున్నాయో, మహనీయులు ఎలా శ్రమించారో “నాటి పత్రికల మేటి విలువలు”లో వివరించారు. “తెలుగు పత్రికలు”-తెలుగు పత్రికల చరిత్రకు అద్దం పడుతుంది. కొంత కాలం అనారోగ్యంతో బాధపడినా, పత్రిక, సాహితీ సేవకు ఎప్పుడూ విరామం తీసుకోలేదు. పాత్రికేయ సహచరులు, సాహితీ మిత్రులతో పడకకుర్చీలో కూర్చుని, మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ ముచ్చట్లు చెప్పేవారు,  ఎవరినీ నిరాశపరచి పంపలేదు. 2020 మార్చి 5వ తేదీ ఆయన దేహం చాలించారు. ఆ చిరునగవుల వదనం చిన్నబోయింది.                              —–   నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply