Take a fresh look at your lifestyle.

తెలుగు పత్రికారంగ శిఖరాగ్రాన పొత్తూరి

“మనుషులలో ఉన్న మంచితనం చూడడం వీరి విశేష గుణం. తిరగేసిన ఏ గ్రంథాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, విషయంలో మంచిని, రచయిత విధానాన్ని విశదీకరించగలరు. తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి నిష్ఠ అపారమైనది. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్‌ ‌తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు పొత్తూరి. ఓ మేటి పాత్రికేయునిలో ఉండవలసిన లక్షణాలన్నీ పొత్తూరిలో చూడవచ్చు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు.”

పొత్తూరి వేంకటేశ్వరరావు ఒక మంచి మనీషి. పదుగురు మెచ్చిన పాత్రికేయుడు. తెలుగు పాత్రికేయ అష్టదిగ్గజాల్లాంటి ఎడిటర్లలో ఆయన ఒకరు. ఆయన క్రమశిక్షణ కలిగిన ఒక అక్షర నిబద్ధుడు. తెలుగు పాత్రికేయరంగం శిఖరాగ్రాన నిలిచిన కొద్దిమంది ప్రముఖుల్లో ఈయన ఒకరు. ఐదు దశాబ్దాల పాటు పత్రికా రంగానికి విశేష సేవలు చేసిన ప్రముఖ పాత్రికేయులు. జన్మించింది ఆంధ్రలోనైనా నిఖార్సయిన తెలంగాణవాది, ప్రజాస్వామిక వాది, మానవ హక్కుల కోసం అహర్నిశలు కృషి చేసిన మానవతావాది. పంచకట్టులో, పొడవు చేతుల తెల్లచొక్కాపై ఉత్తరీయంతో చిరునవ్వులు చిందిస్తూ అచ్చ తెలుగుతనం మూర్తీభవించే సంస్కృతి, సంప్రదాయం, నిలువెత్తు విగ్రహం. తెలుగు పత్రికారంగంలో ప్రముఖులుగా విరాజిల్లిన ఆ మూర్తి 2020 మార్చ్ అయిదో తేదీ ఉదయం పరమపదించారు. ఆయన పాత్రికేయ వినీలాకాశానికి చేరిన ఒక అక్షర నక్షత్రం.

1957లో ఆంధ్రజనతలో అడుగుపెట్టిన ఆయనకు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలతో అపార అనుబంధం ఉంది. ఈనాడు, ఉదయం, వార్త పత్రికలలోనూ అనుభవజ్ఞులైన వ్యక్తి వీరు. ఆంధ్రప్రభ సంపాదకులుగా ఈయన చాలా కాలం పనిచేశారు. ఆ చిరునగవుల వదనం చిన్నబోయింది. కలం ఆగిపోయింది. అంత పెద్దవారికి సమకాలికునిగా పత్రికారంగంలో ఉండడం అదృష్టం. ఆయన విత్తనాలు జల్లి పరిమళాల ఉద్యానవనంగా తీర్చిదిద్దిన ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం, వార్త…అక్షరాల వనంలో నేను అడుగులు వేయగలగడం నిజంగా ఎన్నో అవార్డులందుకున్నంత గర్వకారణం. అపారమైన ఆయన శిష్యవర్గంలో నేనొక బిందువును.

Dr pothuri venkateswara rao passed away

తెలుగు సర్వతోముఖాభివృద్ధికి చివరివరకూ కృషిచేసారు..నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికా చరిత్రను ఆకళింపు చేసుకుని నిలువుటద్దంగా ప్రసిద్ధికెక్కారు. నాటి పత్రికా విలువలు ఎరిగి, నేడు విలువలు ఎలా, ఏ కారణాల చేత మారిపోయాయో తెలిసినవారు. దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారితో పొత్తూరికి చక్కని సాన్నిహిత్యం ఉండేది. పత్రికారంగంలో అనేక పరిణామాలని, మార్పులని చూశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రెస్‌ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తెలుగు భాషాభ్యున్నతికి కారకులయ్యారు. తెలుగు భాషా వికాస ధోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు. మనుషులలో ఉన్న మంచితనం చూడడం వీరి విశేష గుణం. తిరగేసిన ఏ గ్రంథాన్నైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, విషయంలో మంచిని, రచయిత విధానాన్ని విశదీకరించగలరు. తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి నిష్ఠ అపారమైనది. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్‌ ‌తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు పొత్తూరి. ఓ మేటి పాత్రికేయునిలో ఉండవలసిన లక్షణాలన్నీ పొత్తూరిలో చూడవచ్చు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు. పొత్తూరివారిది ఎప్పుడూ ప్రసన్న వదనమే. అనుగ్రహమే కానీ, ఆగ్రహం చూడలేదు ఎవరూ. పాత్రికేయరంగంలో అందరికీ గురుతుల్యులు. చిన్న-పెద్ద, స్థాయి తేడా లేకుండా అందరితో సౌమ్యంగా మాట్లాడే సహృదయులు. తెలుగు పత్రికారంగంలో విలువలకు, వ్యక్తిత్వానికి పెద్దపీట వేసి దశాబ్దాలకాలం ఆ పునాదులమీద తనకంటూ ఒక ప్రత్యేక పాత్రికేయ భవంతిని నిర్మించుకుని, ఆరు దశాబ్దాలకుపైగా అందరి గౌరవం అభిమానం సంపాదించుకున్న దిట్ట పొత్తూరి.

నాటి పత్రికలు విలువలు పాటించేవని. సంపాదకులు నడిపించేవారని, నేడు యజమానులే నడిపిస్తూ, పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడడంవల్ల విలువలు క్షీణించాయని కుండబద్దలుకొట్టినట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. పత్రికల్లో చాలా మటుకు విలువలు అంతరిస్తున్నాయని, వ్యయ ప్రయాసలు పెరిగి పోవడం వల్ల పత్రికారంగానికి గడ్డురోజులని ఆయన అభిప్రాయం. తెలుగు సాహిత్య జగత్తులో అరవై యేళ్ళుగా సాగుతున్న కృషిని, పరిణామాలని పొత్తూరి వినిపించారు. ఆయనది అపారమైన అనుభవం. సాహిత్య ప్రియులందరికీ ఆయన అందుబాటులో వుంటారు. సభలలో తరచు పాల్గొంటారు. అనేక పుస్తకాలకి ముందుమాట వ్రాసారు. విషయాన్ని చదువరులకు బోధపడేటట్టు సరళమైన భాషలో చెప్తారు. ఈ నేర్పు, కూర్పు, ఉదారగుణం పొత్తూరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. రాష్ట్రంలో తీవ్రవాదుల ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు పౌరహక్కులసంఘాల తరఫున అనేక నిజనిర్ధారణ కమిటీల్లో సభ్యుడుగా రాజ్యహింసను వేలెట్టి చూపిన సంఘటలెన్నో. ఓ రచయిత మంచి చదువరి అయి వుండాలని శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి చెప్పిన విషయం పొత్తూరి విషయంలో అక్షర సత్యం. ఈయన గొప్ప చదువరి. చదవడంతో పాటు రచయిత సమకాలీన స్థితిగతులు, భాషా పదజాల ప్రయోగం, రచనా నడక, దాని ఉనికి, అందులోని నిక్షిప్త సారం వంటి విషయాలన్నీ ఔపోశన పట్టిన వ్యక్తి. వారి భావాలు, విషయం తెలిపే విధానం, వారికున్న చింతన అపారం. ‘‘సద్‌ ‌చింతన పొత్తూరిలో మెండుగా ఉంది. నియమ నిబద్ధతలు కలిగిన అనుభవ యోగ్య భాషా పరిజ్ఞానికుడు. విభిన్న క్షేత్ర, రంగ విషయాలు తెలిసినందువల్ల రచనలపై మంచి పట్టు సాధించారు.

రచనలు వాడుక భాషలో వ్రాస్తే అది ప్రజలకు మరింత చేరువవుతుందని నిరూపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్‌ ‌పట్టాతో గౌరవించింది. హైద్రాబాద్‌, ‌విజయనగర్‌ ‌కాలనీ, పి ఎస్‌ ‌నగర్‌ ‌లో స్థిరపడ్డారు. అనేక అంశాలపై సాహితీ సభల్లోనూ, ఆకాశవాణిలోను పలు ప్రసంగాలు చేసారు. పొత్తూరి టి టి డి ప్రచురణలకు సంపాదకుడిగా ఉన్నారు. ఈయనకి చాలా కాలం బ్రిటీష్‌ ‌లైబ్రరి సభ్యత్వం ఉండేది. కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) ‌రూపంలోకి మళ్ళించి అంతర్జాలం (ఇంటర్‌ ‌నెట్‌) ‌మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్‌ ‌పథకం అవిష్కరించారు ఆయన. ఇలాటి అనుభవ పూర్ణ తెలుగు భాషా విశారదుల ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది. పొత్తూరి వెంకటేశ్వరరావు (86) ఫిబ్రవరి 8, 1934 లో గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. తండ్రి: వెంకట సుబ్బయ్య, తల్లి: పన్నగేంద్రమ్మ. పొత్తూరి వ్రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనమే ‘‘చింతన’’. స్ఫూర్తిగా నిలచిన మహనీయుల మీద వ్రాసిన సంపాదకీయాల సంకలనం ‘చిరస్మరణీయులు’ తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏమి ప్రత్యేకతలు సంతరించుకున్నాయో, మహనీయులు ఎలా శ్రమించారో ‘‘నాటి పత్రికల మేటి విలువలు’’ లో వివరించారు. ‘‘తెలుగు పత్రికలు’’ – తెలుగు పత్రికల చరిత్రకు అద్దం పడుతుంది. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ ఇత్యాది అంశాల మీద అనేక సంకలనాలు తన కలం ద్వారా, సంపాదకీయం ద్వారా దాదాపు 160 వ్యాసాలు ప్రజల ముందుకి తీసుకొచ్చారు. ఆదే ‘‘వ్యాసప్రభ’’. జవహర్లాల్‌ ‌నెహ్రూ పంచాయతీరాజ్‌ ‌పై ప్రసంగాలను తెనుగీకరించారు. వీరు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వారికిదే అక్షర నివాళి.
– నందిరాజు రాధాకృష్ణ,
పాత్రికేయుడు
98481 28215

Leave a Reply