Take a fresh look at your lifestyle.

పొత్తూరి చిరస్మరణీయుడు

“ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా హైదరాబాద్‌తోనూ, తెలంగాణ వారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆంధ్రప్రాంతానికి చెందిన ఐదుగురు మేధావులతో కలిసి తెలుగువారు తరచూ తగవులు పడటం కన్నా విడిపోయి అన్నదమ్ములుగా మసులుకుంటే మంచిదని ఆనాటి ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖ రాశారు.”

సుప్రసిద్ధ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు తెలుగు పత్రికా రంగంలో అజాత శత్రువు. ఆయన ఎన్నో పత్రికలలో సంపాదకునిగా పని చేసినా ఆంధ్రప్రభకు ఆయన అందించిన సేవలు అమూల్యమైనవి. ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా హైదరాబాద్‌తోనూ, తెలంగాణ వారితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆంధ్రప్రాంతానికి చెందిన ఐదుగురు మేధావులతో కలిసి తెలుగువారు తరచూ తగవులు పడటం కన్నా విడిపోయి అన్నదమ్ములుగా మసులుకుంటే మంచిదని ఆనాటి ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, కాకర్ల సుబ్బారావు, సోషల్‌ ‌సైంటిస్టు ఎన్‌ ‌భాస్కరరావు, సామాజిక ఉద్యమకారుడు కత్తి పద్మారావు ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఎన్నడూ కలిసి లేవనీ, క్రీస్తు శకం •1800 సంవత్సరం నుంచి ఇరు ప్రాంతాల మధ్య పొసగకపోవడం అనేది ఉందనీ, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట బలవంతంగా ఈ రెండు ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.

పొత్తూరి మొదటి నుంచి నిండుకుండవంటి మనిషి. ఆయనకు భషజాలు లేవు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఏమండీ అని పిలిచేవారు. ఆయన మృదు భాషి, స్నేహ శీలి. ఆయనకు ఆంధ్రప్రాంతంలో ఎంత మంది మిత్రులున్నారో తెలంగాణలో కూడా అంతే మంది స్నే•హితులు ఉన్నారు. పొత్తూరి పత్రికా రచయితగానే కాకుండా పలు పత్రికల్లో శీర్షికలు రాసేవారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి రాసిన ఇయర్‌ ఆఫ్‌ ‌పవర్‌కి సహరచయితగా వ్యవహరించారు. ఆంధ్రప్రభ దిన, వార పత్రికలు రెండింటికీ ఆయన ఏక కాలంలో సంపాదకులుగా వ్యవహరించారు. వార పత్రికలో కూడా ఆయన సంపాదకీయాలు రాసేవారు. అవి తెలుగు సాహిత్య, సాంస్కృతిక విశేషాలకు అద్దం పట్టేవి. ఏదో రాయాలని కాకుండా ఏ అంశంపైనైనా లోతుగా అధ్యయనం జరిపి వాటి పూర్వాపరాలను వెలికితీసి రాసేవారు. 20 ఏళ్ళ క్రితం ‘నాటి పత్రికలు-మేటి విలువలు’ పేరుతో రాసిన పుస్తకం ఎంతో మంది ప్రశంసలను అందుకుంది. నిజాన్ని నిర్భయంగా రాయగలిగిన చేవ కలిగిన రచయిత పొత్తూరి అని జర్నలిస్టులే కాకుండా కవి, పండితులు ప్రశంసించారు. పొత్తూరికి భాష మీద మంచి పట్టు ఉండేది. తెలంగాణ మాండలికాల గురించి ఆయనకు బాగా తెలుసు.

- Advertisement -

తెలంగాణ భాష పుట్టుపూర్వోత్తరాలపై ఆయన వ్యాసాలు రాశారు. తెలంగాణ ప్రజల అపోహలను శాశ్వతంగా తొలగించేందుకు విడిపోయి కలిసి ఉండటమే మేలని ఆయన అనేక సభల్లో స్పష్టం చేశారు. అలా చేసినందుకు ఆయనను ఆంధ్రప్రాంతంలో పలువురు విమర్శించిన వారున్నారు. అయితే, దేనికీ భయపడకుండా తాను చెప్పదల్చుకున్నది ధైర్యంగా ఆయన వ్యాసాల రూపంలో అందించారు. ఆంధ్ర సాహిత్యాన్ని గురంచి కూడా సాధికారికమైన వివరణలతో ఆయన వ్యాసాలు రాశారు. పదవుల కోసం ఆయన అధికారంలో ఉన్న వారిని ఎన్నడూ ఆశ్రయించలేదు. ఆయన ప్రతిభను గుర్తించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రెస్‌ అకాడమి చైర్మన్‌గా నియమించింది. ప్రజల్లో మంచిని పెంచడమే పత్రికా సంపాదకుని లక్ష్యమని ఆచరణలో చూపిన వారు పొత్తూరి. సమాజ హితం కోరేవాడే పత్రికా సంపాదకుడని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆయన తన పర భేదాలు లేకుండా ఎన్నో సందర్భాల్లో సమస్య తీవ్రతను బట్టి విమర్శిస్తూ వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. ఆయన ముమ్మూర్తులా ఆదర్శ పత్రికా సంపాదకుడు. సమాజ హితైషి, అన్నింటినీ మించి అందరికీ సన్మిత్రుడు.
‘ప్రజాతంత్ర’

Tags: Tripuraneni Hanuman Chowdhury, Cocker Subbarao, Social Scientist N Bhaskara Rao, Social activist Kadu Padmarao

Leave a Reply