Take a fresh look at your lifestyle.

అగ్రిచట్టాల వాయిదా… రైతు సంఘాల విజయం

ఏ సమస్యకైనా మనసు పెట్టి ప్రయత్నం చేస్తే పరిష్కారం కుదరకపోవడం అంటూ ఉండదు. కేంద్రం, వ్యవసాయ సంఘాల ప్రతినిధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా అగ్గి రేపిన వివాదం పరిష్కారం దిశగా వొస్తున్నందుకు హర్షించని వారెవరూ ఉండరు. కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేయడానికి కేంద్రం నిర్ణయించడం, ఇందుకు లిఖితపూర్వకమైన హామీని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించేందుకు అంగీకరిచడం గుణాత్మకమైన పరిణామం. ఇది రైతు సంఘాల విజయం. దేశంలో ఏనాడూ లేని విధంగా రైతు సంఘాల నాయకులు దాదాపు అరవై రోజుల పాటు నిరవధికంగా సాగించిన పోరు కొలిక్కి వస్తోంది. దీనిని పరిష్కరించకపోతే ప్రభుత్వం ప్రతిష్ఠ పోయే పరిస్థితులు నెల కొన్నాయి. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతు సంఘాల నాయకుల డిమాండ్ల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. రైతు సంఘాల నాయకులు ఏ పార్టీకీ చెందకపోయినా అన్ని పార్టీల మద్దతు వారికి ఉంది.అందుకే, రైతులకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమానికి శుభం కార్డు పడక తప్పదన్న అభిప్రాయం దేశంలో చాలా మందిలో ఏర్పడింది.ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ చట్టాలను వాయిదా వేసేందుకు అంగీకరించడం వల్ల పరిష్కారానికి అనుకూల మైన వాతావరణం ఏర్పడేందుకు వీలుంది. ప్రభుత్వం ప్రజలెన్నుకున్నదే కనుక, ప్రజల వాణిని వినిపించుకోకతప్పదు. అమెరికాలో ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయనున్నట్టు కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారానంతరం ప్రకటించిన రోజునే ఇక్కడ మన దేశంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం యాదృచ్ఛికం.

ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకూ అనుసరిస్తున్న వైఖరిలో వెసులుబపాటు ఉండవచ్చన్న సంకేతం ఈ నిర్ణయంలో కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాల్లో వివాదాస్పద అంశాలపై మెట్టు దిగేందుకు ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది.ముఖ్యంగా, విద్యుత్ చట్టంలో మార్పులను వాయిదా వేసేందుకు అంగీకరించింది. ఇది ప్రధానమైనది. మద్దతు ధర విషయంలో ప్రభుత్వం రద్దు చేస్తానని ఎక్కడా అనలేదు కానీ, దానిని చట్టంలో చేర్చేందుకు సుముఖత చూపలేదు. కనుక, మద్దతు ధర విధానం యథాతథంగా కొనసాగుతుంది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చునన్న నిబంధన కొత్తదేమీ కాదు.ఇప్పటికే రైతులు ధర వొచ్చిన చోట అమ్ముకుంటున్నారు.అయితే, అంతవరకూ ఆగలేని బక్క, సన్నకారు రైతులు పెద్ద రైతులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. కనుక పరిస్థితిలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. అందువల్లనే ప్రభుత్వం ఈ చట్టాల అమలును వాయిదా వేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకటిన్నర సంవత్సరాలంటే ఆ సమయానికి ఎన్నికలు దగ్గర పడవచ్చు. ఈ అంశంపై ప్రజలవద్దకు వెళ్ళాలనే అభిప్రాయం ప్రభుత్వానికి కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రజల తీర్పు ప్రకారం నడుచుకుంటే ఏ గొడవా ఉండదు. అంతేకాకుండా, కాలపరిమితికి పూర్తి కాకుండానే ఎన్నికలు రావచ్చునంటూ తెలుగుదేశం అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గడిచిన కొంత కాలంగా పాటపాడుతున్నారు. గురువారం కూడా జమిలి ఎన్నికలు వొస్తున్నాయి సిద్ధంగా ఉండండి అని తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.

- Advertisement -

ఆయన అధికారంలో లేకపోయినా, అధికార పీఠాలకు దగ్గరగా ఉన్న వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంటుంది.అయితే, జమిలి ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. దానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది . మోడీపై ఇలాంటి ఒత్తిడి వస్తుందేమో తెలియదు కానీ, మోడీ అంత తేలిగ్గా ఇలాంటి ప్రతిపాదనలను అంగీకరించరు. అయితే,అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆయన ఆ వైపుగా ఆలోచించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు వొచ్చే అవకాశం లేకపోవచ్చు. అంతేకాకుండా కొరోనా, అకాల వర్షాలు వంటి కారణాల వల్ల అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దెబ్బతింది.ఎన్నికలకు వెళ్లే సత్తా ఇప్పుడు ఎవరికీ లేదు. చంద్రబాబునాయుడు మళ్ళీ ఎప్పుడు పీఠం ఎక్కుదామా అన్న ఆలోచనలో ఉన్న దృష్ట్యా పదే పదే జమిలి ఎన్నికల మంత్రాన్ని పఠిస్తున్నారు. రైతుల సమస్యలపై ఇంతవరకూ ఆయన నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. మోడీ తెచ్చిన చట్టాలపై దేశమంతటా వ్యతిరేకత కానవస్తున్నా, బాబు మాత్రం తనదైన అవకాశవాద మార్క్ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. రైతులకు ప్రస్తుతం కావల్సింది ఓదార్పు. వారు పరాన్న జీవులుగా మారేందుకు సిద్ధంగా లేరు. కేంద్రంతో జరిపిన చర్చల లో వారు అదే విషయాన్ని స్పష్టం చేశారు.

తమ గౌరవ మర్యాదలను కాపాడేట్టు చూడాలని వారు కోరారు. ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు చేసినా రైతులు మెత్తబడలేదు.రైతులు ఈ పోరాటం ద్వారా తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు. ఫలితం వొస్తుందా లేదా అన్నదాని గురించి ఆలోచించకుండా తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నారు.ఇదే వారి విజయం. రాజకీయ ప్రయోజనం పొందే పార్టీలు, నాయకులు ఫలితాన్ని గురించి ఆలోచిస్తారు. రైతులు తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి పోరాడి విజయం సాధించారు. ఇది రైతులు సాధించిన విజయం ముమ్మాటికీ నిజం. కేంద్రం ఒకటిన్న సంవత్సరం తర్వాత కేంద్రం వైఖరిలో మార్పు రావచ్చు ఈ చట్టాలను మొత్తంగా రద్దు చేయవొచ్చు.అందుకే రైతు సంఘాల ప్రతినిధులు ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నారు. శుక్రవారం నాటి (22వతేదీ) సమావేశంలో ఆందోళన విరమణపై నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వం తోక జాడిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలను రైతు నాయకులు ఇప్పటికే చేసి ఉన్నారు. అంతా మంచే జరుగుతుందని ఆశించవొచ్చు.

 

Leave a Reply