Take a fresh look at your lifestyle.

యాచక వృత్తి మాన్పించడం సాధ్యమవుతుందా…?

Possible to stop Begging profession

అడుక్కోవడమన్నది నేడు సర్వసాధారణ మైపోయింది. మన పురాణాలను తిరగవేసినా, రాజుల కాలాన్ని తిరగదోడినా ఒకరిని ఒకరు యాచించిన కథలు అనేకం కనిపిస్తాయి. కాని ఆనాడవి ధర్మంకోసం, ప్రజారక్షణకోసంగా ఉండేవి. కాని, నేడు బిక్షమెత్తే విధానాలుకూడా మారిపోయాయి. నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎన్నికలవేళ తమ పార్టీకి డబ్బులులేవని తెల్పేందుకు బిక్షాటన నాటకాలను రక్తికట్టించడంకూడా చూస్తుంటాం. ఇప్పుడా బిక్షాటనలో వచ్చిన సొమ్ముకుకూడా లెక్కలు చెప్పాలంటున్నారు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు.. అదివేరే విషయమనుకోండి. తాజాగా హైదరాబాద్‌ ‌నగరాన్ని యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం మరోసారి నడుంకడుతోంది. మరోసారి అని ఎందుకన్నామంటే హైదరాబాద్‌లో ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరిగాయికాబట్టి. ఆలోచన వచ్చింది మొదలు ఆచరణలో పెట్టడంవరికేగాని దాన్నిపూర్తిగా నిర్వహించలేకపోవడమన్నది మన ప్రభుత్వాలకు మొదటినుండీ వస్తున్న అలవాటేకదా. ప్రపంచ దేశాల్లో తనకో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లాంటి నగరాల్లో బిక్షాటన చేస్తూ ఎవరూ కనిపించకూడదన్న ఆలోచనను కొన్నాళ్ళకిందనే రాష్ట్రప్రభుత్వం చేసింది. అప్పుడుకూడా ఇవ్వాళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌వస్తున్న సందర్భంగా గుజరాత్‌లో మురికి వాడలముందు గోడకట్టి ఎలా పేదరికాన్ని దాచిపెట్టాలనుకున్నారో, 2017లో ట్రంప్‌ ‌కూతురు ఇవాంకా ట్రంప్‌ ‌హైదరాబాద్‌ ‌రాక సందర్భంగా నగరంలోని పేదవాళ్ళనందరిని నగరం వెలుపలకు తరలించే కార్యక్రమం జరిగింది.

 

అప్పుడే నగరంలోని చంచల్‌గూడా, చర్లపల్లి జైళ్ళశాఖ భవనాల్లో యాచకులకోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలకుగాను ఆర్థిక సహాయాన్ని అందించే బాధ్యతను జీహెచ్‌ఎం‌సీ అప్పగించారు. దీనికి చక్కగా ఆనందాశ్రమం అనిపేరుపెట్టారు. జైళ్ళశాఖకూడా ప్రభుత్వంనుండి నిధులు వస్తాయనుకుంది. కాని, అటు ప్రభుత్వంనుండికాని, ఇటు జీహెచ్‌ఎం‌సీనుండికాని నిధులు రాకపోవడంతో ఆనందాశ్రమానికి ఆనందం కరవైంది. వారికి కావాల్సిన తిండి, బట్టలతోపాటు ఇతర సదుపాయాలేవీ అందకుండా పోయాయి. జైళ్ళశాఖకిది భారంగా పరిగణించడంతో ఈ ఆశ్రమాన్ని బలవంతంగా మూసివేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. వికలాంగులు, మతిస్థిమితంలేనివారు ఇలా•• రకాలుగా యాచనకు అలవాటుపడినవారు దాదాపుగా పదిహేను వేలమంది ఇందులో ఆశ్రయంపొందారు. అప్పుడే తెలిసింది హైదరాబాద్‌లో యాచకవృత్తిలో స్థిరపడినవారు దాదాపు పదిహేను వేలమందిదాకా ఉన్నారని. యాచనలో వీరి ఏడాది ఆదాయం దాదాపు ఇరవై కోట్ల వరకుంటుందని ఓ సర్వే సంస్థ పేర్కొంది. వాస్తవంగా బిక్షమెత్తుకోవడంతప్ప మరే అవకాశంలేని వారు వీరిలో కేవలం రెండు శాతం మందేనని, మిగతావారంతా ఇతర వృత్తులను చేసుకోగల శక్తి ఉండికూడా బద్దకించో, మాఫియాగో మారో ఇదే వృత్తిలో స్థిరపడ్డారన్న విషయంకూడా వారి సర్వేలో తేలిన అంశం. 1959లోనే బాంబే బిక్షాటన చట్టాన్ని రూపొందించినా దేశంలో ఎక్కడా చట్టపరమైన నిషేధం అమలుకావడంలేదనడానికి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలవద్ద ఎక్కడ చూసినా కనిపించే యాచకులే ప్రత్యక్షం సాక్ష్యం.

అయితే విచిత్రమైన విషయమేమంటే యాచన చేస్తున్నవారంతా ఏమాత్రం అక్షర జ్ఞానం లేనివారో, లేక నిత్యదారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నవారో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇవాంక ట్రంప్‌ ‌రాక సందర్భంగా పునరావాస కేంద్రాలకు వీరిని తరలిస్తున్న క్రమంలో అనేక ఆసక్తి విషయాలు వెలుగుచూశాయి. వీరిలో కొందరు పోస్టు గ్రాడ్యుయేట్‌ ‌చేసినవారు, విదేశాలకు వెళ్ళివచ్చినవారు. బతికిచిత్కినవారున్నట్లు ఆనాటి సర్వేసంస్థ వెలుగులోకి తీసుకువచ్చిన విషయాలనేకం. ఇలాంటి వారికి తిరిగి చేయూతనందించడంద్వారా యాచక వృత్తినుండి దూరం చేయవడచ్చన్న లక్ష్యం సంపూర్ణంగా నెరవేరకుండానే ఆనందాశ్రమం మూతపడింది. మరోఆసక్తికర విషయమేమంటే యాచకుల్లోకూడా దయార్థ్రహృదయులుంటారన్న కథనాలనేకం ఇటీవలకాలంలో వెలుగుచూశాయి. కడుపు మాడ్చుకుని, చిరిగిన దుస్తులతో కనిపించే బిచ్చగాళ్ళను చూస్తే ఎంత జాలివేస్తుందో వారి వివరాలు తెలిస్తే అంత ఆశ్చర్యంకూడా కలుగుతుంది. పుదుచ్చేరీ దగ్గర ఓ ఆలయంవద్ద బిక్షమెత్తుకుని జీవించే ఓ మహిళ లేవలేని స్థితిలో ఉంటే ఆమెను ఓల్డేజీ హోంకు తరలించేప్పుడు వెతుకగా ఆమె సంచీలో పదిహేను వేల రూపాయల నగదు, బ్యాంకు ఎకౌంట్‌లో రెండు లక్షలున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

ముంబైకి చెందిన బిర్జు చంద్ర ఆజాద్‌ అనే ఓ యాచకుడు రైలుపట్టాలుదాటుతూ మృతిచెందాడు. అతని ఇంటికి వెళ్ళి పోలీసులు పరిశీలిస్తే 8.77లక్షల ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్స్, 1.55 ‌లక్షల విలువచేసే చిల్లర డబ్బులు కనిపించాయట. అలాగే రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన నందినీశర్మ అనే యాచకురాలు బ్యాంకులో దాచుకున్న ఆరున్నర లక్షలకు పైగా డబ్బుకు ఇద్దరు నామినీలను ఏర్పాటుచేసింది. ఆమె మరణానంతరం వారు పుల్వామా ఆత్మాహుతిదాడిలో మృతిచెందిన జవాన్లకుటుంబాలకు ఆర్థికసహాయాన్ని అందించారు. అంతెందుకు మన పొరుగురాష్ట్రంలో విజయవాడ సమీపంలోని ముత్యాలపాడులో షిర్డీ దేవాలయానికి ఎనిమిదిలక్షలు విరాళంగా ఇచ్చాడు యాదిరెడ్డి అనే యాచకుడు. ప్రతీఏటా ఏదో దేవాలయానికి ఇలా లక్షల్లో విరాళం ఇవ్వడం అతనికి అ)వాటేనట. దీన్నిబట్టి యాచకులుకదా అని వారిని చులకనగా చూడడమో, తేలిగ్గా తీసివేయడం తగదన్న విషయాన్ని ఇవి గుర్తుకు తెచ్చేవిగా ఉన్నాయి. పరిస్థితుల ప్రభావంతోనో, మానసికంగా క్రుంగిపోయో, బలవంతంగానో వారు ఈ వృత్తిలోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకు వారికి సరైన మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పుడు ట్రంప్‌, ఆయన కూతురు ఢిల్లీకి వచ్చిన సందర్భంలోనే మరోసారి యాచకరహిత దేశం కావాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇది కాకతాళీయమై ఉండవచ్చు. ఇందుకు పై)ట్‌ ‌ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌నే ఎంచుకుంది. గత అనుభవాలను నెమరువేసుకుంటూ కేంద్రం అందించే వందకోట్ల రూపాయలను సద్వినియోగంచేసుకుంటే విధివంచితులనైనా ఈ మార్గంనుండి తప్పించవచ్చు.

manduva ravindhar rao guest editor

మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply