రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం వ్యాధి నిర్ధారణ పరీక్షల విషయంలో ఎందుకు వెనకబడిందో చెప్పాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పక్క రాష్ట్రమైన ఏపీతో పోలిస్తే తెలంగాణలో అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడంలో విఫలమైందని విమర్శించింది. ఈమేరకు టీ జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొరోనా కేసుల విషయంలో ఏపీ తెలంగాణను దాటిందనీ, ఈనెల 25 నాటికి రాష్ట్రంలో 990 పాజిటివ్ కేసులుంటే, ఏపీలో ఆ సంఖ్య 1016 దాటిందనీ, దీంతో సామాన్య ప్రజలకు తెలంగాణలో పరిస్తితి అదుపులో ఉందనీ, ఏపీలో పరిస్థితి బాగా లేదనే అభిప్రాయం ••లుగుతుందనీ, ఇందులో వాస్తవమేమిటో చెప్పాలని ప్రశ్నించింది. నిజానికి కేసుల సంఖ్య ఆ రాష్ట్రం చేసే పరీక్షలపైనే ఆధారపడి ఉంటుందనీ, పరీక్షలు ఎక్కువ చేస్తే కేసులు ఎక్కువగా బయటపడే అవకాశం ఉంటుందనీ, అలాగే, పరీక్షలు తక్కువ చేస్తే కేసులు తక్కువ నమోదవుతాయన్న విషయాన్ని గ్రహించాలని పేర్కొంది.
కొరోనా ఉధృతి తెలుసుకోవాలంటే కేసుల సంఖ్య కన్నా ఇన్ఫెక్షన్ రేట్ సరైన సూచిక అనీ, మొత్తం పరీక్షలలో అప్పటికి బయటపడిన పాజిటివ్ కేసుల శాతాన్ని ఇన్ఫెక్షన్ రేట్ అంటారని తెలిపింది. అయితే, తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు 5.35 శాతంగా ఉందనీ, అదే ఏపీలో అది 1.66 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. అంటే తెలంగాణలో ఇన్ఫెక్షన్ రేటు ఏపీ కన్నా 3.22 రెట్లు ఎక్కువనీ, దీనికి కారణం ఏపీలో జరిగిన పరీక్షలు 61266 కాగా, తెలంగాణలో కేవలం 18514 మాత్రమే జరిగాయని తెలిపారు. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటులో మాత్రం దేశంలో మూడో స్థానంలో ఉందని తెలిపింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి పరీక్షల సంఖ్య తక్కువ, ఆసుపత్రుల్లో మరణించిన వారిని కొరోనా మృతులుగా పరిగణించకపోవడం, పాజిటివ్ కేసుల సెకండరీ కాంటాక్ట్ కేసులను పరీక్షించొద్దని ప్రభుత్వం ఆదేశించడం వంటి మూడు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. పరీక్షలు భారీగా పెంచకుండా కొరోనా వైరస్ అదుపు అసాధ్యమనీ, ట్రేస్…టెస్ట్…ట్రీట్ పంథా ఒక్కటే మార్గమని డబ్ల్యుహెచ్వో పదేపదే చెబుతున్నదనీ, తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.