Take a fresh look at your lifestyle.

గద్దెమీదికి సమ్మక్క

Population-turned-tent in medaram jathara

  • చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చిన గిరిజన వొడ్డెలు
  • అమ్మరాకతో ప్రధాన ఘట్టం పూర్తి
  • జనసంద్రంగా మారిన మేడారం

Population-turned-tent in medaram jatharaచిలుకల గుట్టల్లో కొలువైన మాయమ్మా.. భక్తుల కరుణించా బైలెల్లి రావమ్మా..అంటూ భక్తుల వేడుకోళ్ల మధ్య కోట్లాది మంది ఆరాధ్యదైవమైన వనదేవత సమ్మక్క గురువారం సాయంత్రం బయలుదేరి రాత్రి 9:10 గంటలకు మేడారం గద్దెకు చేరుకున్నారు. అమ్మవారిని గద్దె వద్దకు తీసుకువచ్చే ఘట్టం ఆసాంతం మహోద్విగ్నంగా సాగింది. ఈ దృశ్యాల్ని కళ్లారా చూడడానికి పెద్దసంఖ్యలో భక్తులు గుట్ట వద్దకు చేరారు. గిరిజన వొడ్డ్డెలు అమ్మవారిని గుట్ట నుంచి తేవడం చూడగానే ‘సమ్మవ్వ తల్లీ దండాలు’ అంటూ భక్త్యావేశంతో పెద్దయెత్తున నినదించారు.శివసత్తులు సిగమూగారు. గుట్టనుంచి మేడారం గద్దె వరకు కొనసాగిన ఊరేగింపులో పాల్గొనడానికి భక్తులు ఎగబడ్డారు. అమ్మవారు వచ్చే దారిపొడవునా ఆమెకు నైవేద్యంగా కొబ్బరికాయలు, ‘బంగారం’, బోనాలు సమర్పించారు. జంతుబలులిచ్చారు.అమ్మవారితోవచ్చే వొడ్డెలు తమపై నుంచి నడిచి వెళితే తమకు శుభం జరుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని వరం పట్టే మహిళాభక్తులు ఊరేగింపు వచ్చే దారిలో పొర్లుదండాలు పెట్టారు. తల్లి రాకతో మేడారం అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. సమ్మక్క గద్దెనెక్కడంతో జాతరలో ప్రధానఘట్టం పూర్తయ్యింది. ఇప్పటికే గద్దెలకు చేరుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతోపాటు సమ్మక్కను దర్శించుకోవడానికి భక్తుల రాక మరింత ఉధృతమైంది. దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే ఈ జాతరకు కోటిమందికి పైగా చేరుకున్నారు. తెలంగాణా కుంభమేళా మేడారం భక్తజనసంద్రంగా మారింది. అడవితల్లుల దర్శనానికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌తోపాటు సీఎం కేసీఆర్‌, ‌కేంద్రమంత్రులు, ప్రముఖులు కూడా రానున్నారు.

మేడారం జాతరలో అత్యంత అపురూప ఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. రెండేళ్ళ విరామం తర్వాత కోట్లాది మంది హృదయాలను చూరగొన్న ఆ అమ్మ దర్శనం కావడంతో భక్తుల సంతోషానికి హద్దులు లేకుండాపోయింది. అమ్మల దర్శనార్థం మూడురోజులుగా అ అడవి ప్రాంతంలోనే నివాసం ఏర్పరుచుకుని అమ్మ చల్లని వీక్షణాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆమె దర్శనంతో పులకించిపోయారు. సమ్మక్క కూతురు సారలమ్మ బుధవారం అర్థరాత్రి గద్దెకుచేరుకోగా అమెతోపాటు జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజులుకూడా గద్దెలపై ఆశీనులైనారు. ఇప్పుడు సమ్మక్క కూడా గద్దెకు చేరుకోవడంతో జాతర పరిపుష్టిని సంతరించుకుంది. సమ్మక్క దర్శనంతోనే అసలైన జాతర మొదలవుతుంది. ఈ ఘడియ కోసం నీరిక్షిస్తున్న భక్తజనం అమ్మవారిని దర్శించుకోవడానికి పోటీపడ్డారు. దాదాపు తొమ్మిదేళ్ళుగా తనను నమ్ముకున్న వారి కోరికలను ఈడేరుస్తున్న అమ్మను కనులారా వీక్షించుకునేందుకు గత రెండు రోజులకు పైగా దాదాపు పదిలక్షలకు పైగా జనం జాతర ప్రాంగణానికి చేరుకున్నారు.సాయంత్రం సమ్మక్క పూజారి వడ్డె కొక్కరి కిష్టయ్యతోపాటు మరికొందరు తోడురాగా ముందుగా సమ్మక్క గద్దెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమ్మవారిని తీసుకురావడానికి మూడు కిలోమీటర్ల రూరంలో ఉన్న చిలకలగుట్టకు తరలి వెళ్ళారు. అక్కడ అమ్మవారికి గిరిజన సంప్రదాయం ప్రకారం విశేష పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని గుట్టకిందకు తీసుకువచ్చారు. పూజ సందర్భంగా అధికారులు, నాయకులనెవరినీ వారు గుట్టమీదికి రానివ్వకుండా నిలిపివేశారు. కాగా, అమ్మ రాకకోసం అప్పటికే గుట్ట ప్రాంతంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంఎల్‌ఏలు పొడెం వీరయ్య, సీతక్క తదితరులతోపాటు అధికారులు ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్న భక్తజనం ఒక్కసారే తమ సంతోషాన్ని తెలుపుతూ పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. మేళతాళాలు, కొమ్ము వాయిద్యాల, డోళ్ళ చప్పుళ్ళతో అమ్మకు ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణను ఎర్రటి బట్టలో చుట్టిన పూజారులు తమ కళ్ళు మాత్రమే కనిపించేవిధంగా తలచుట్లూ గుడ్డలు చుట్టుకని ఎంతో జాగ్రత్తగా పట్టుకొచ్చారు.

Population-turned-tent in medaram jatharaఈ క్రమంలోనే అమ్మవారు గద్దెకు విచ్చేస్తున్న గౌరవసూచనగా ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపారు. మేడారంలోని ఆశేష భక్తజనానికి తుపాకి చప్పుళ్ళు అమ్మవారు విచ్చేస్తున్న సంకేతాన్నివ్వడంతో గద్దె వద్ద పెద్ద కోలాహలం మొదలైంది. కాగా అమ్మవారిని సగౌరవంగా అహ్వానిస్తున్న సూచనగా దారిపొడవున ఆడపడుచులు పసుపుతో అలికి రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దారు. మరికొందరు వడ్డెలు తమను తొక్కుకుంటూ పోతే పుణ్యమన్న భావనతో రారికి అడ్డంగా పడుకోవడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. కాని అమ్మవారిని తీసుకువస్తున్న పూజారుల కాలి ధూళి సోకినా చాలన్నట్లుగా భక్తులు ముందుకు తోసుకురావడంతో తోపులాట మొ)యింది. అమ్మ దర్శనంతో శివసత్తులకు పూనకాలు మొదలైనాయి. వారి అరుపులు కేకలతో ఆ ప్రాంత మంతా దద్ధరిల్లిపోయింది. అమ్మవారే వారిని ఆవహించిందని మరికొందరు వారిని శాంతింపచేసే ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు అమ్మవారికి తమ కష్టాలను చెప్పుకునే ప్రయత్నంచేస్తూ, అంతముందు తాము చెల్లించని మొక్కులకు క్షమాపణ చెప్పుకోవడం కనిపించింది. అమ్మవారు గద్దెకు చేరుకుంటున్న క్రమంలోనే తమ మొక్కుబడులను తీర్చుకోవడంలో చాలమంది భక్తులు పోటీపడ్డారు. తమకు శుభాలను చేకూర్చిన అమ్మకు తమ శక్తి కొలది జంతుబలులివ్వడంతో దారిపొడవునా జంతువుల రక్తంతో తడిసిపోయంది. మొక్కుబడుల్లో భాగంగా ఎదురు కోళ్ళ మొక్కును సమర్పించుకున్న వారు కొందరైతే వచ్చే జాతరవరకు తమ కోరికలను తీరిస్తే తమ ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటామని వరాలడుక్కునేవారు మరికొందరు కాగా కోడెలను అమ్మవారికి సమర్పించుకున్నారు ఇంకొందరు. అమ్మవారి దర్శనం కాగానే రెండెళ్ళుగా తమ కోర్కెలను మన్నించిన దేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, మరిన్ని కోరికలను మూటగట్టుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు.

 

Leave a Reply