Take a fresh look at your lifestyle.

‌కల్తీ కోరల్లో జనావళి

ప్రపంచం ప్రగతి బాటలో పరుగులు పెడుతున్నది. అయితే ఈ పరుగులు భవిష్య మానవ జీవనాన్ని సంకటంలోకి నెడుతున్నాయి. అభివృద్ధి పేరుతో అంతిమంగా మానవ జీవనం ఇరకాటంలో పడుతున్నది. గతంలో లేని అనేక సౌకర్యాలు మన ముంగిట కొచ్చాయి. సుఖజీవనానికి అలవాటు పడ్డాము. సైన్స్ ‌సాధించిన ప్రగతి మనిషిని మరమనిషిగా మార్చేసింది. గతంలో అనేక రోగాలు విజృంభించి, ఊళ్ళకు ఊళ్ళు తుడిచి పెట్టుకు పోయేవి. చాలా రోగాలకు చికిత్స ఉండేది కాదు. రోగాలొస్తే మరణమే శరణ్యంగా మారేది.నేడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది.పలు రోగాలకు చికిత్స దొరుకుతున్నది.  సాంకేతిక పరిజ్ఞానం మానవాళి ముంగిట కొచ్చి,నర్తిస్తున్నది. ప్రపంచం ఒక కుగ్రామంలా మారింది. పెరిగిన విజ్ఞానం వలన మరణాల సంఖ్య తగ్గింది. ప్రపంచ జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు సరిపడా సౌకర్యాలు పెంచడం సాధ్యం కావడం లేదు.

జనాభాను పెంచగలిగినా భూమి విస్తీర్ణత పెంచలేము. అందరికీ ఆహారం అందించాలంటే పరిమిత వనరులతోనే సర్దుబాటు చేయాలి.ఈ కారణంగానే సకల సమస్యలు చుట్టుముట్టు కుంటున్నాయి.పంటలకు విచ్చలవిడిగా ఎరువులు వేసి, అధిక దిగుబడుల సాధన కోసం ప్రయత్నించడం, క్రిమి కీటకాదుల సంహారం కోసం పురుగు మందుల వాడకం  అధికం చేయడం జరిగింది. ఈ చర్యల వలన ఆహార ధాన్యాలు రసాయనాలతో నిండిపోతున్నాయి. పంట పొలాల నుండి మార్కెట్లోకి వచ్చేవరకు, మార్కెట్ల నుండి ఇంటికి వచ్చేవరకు  మనం తినే పండ్లు,కూరగాయలు, ధాన్యం తో సహా నిత్యావసరవస్తువులన్నీ రసాయనాలతో కలుషితమై పోతున్నాయి. త్రాగు నీటితో సహా గాలి కూడా కలుషితమై పోతున్నది.

సహజ వనరులు తరిగి పోతున్నాయి, కృత్రిమ వనరుల కోసం ప్రపంచం తాపత్రయపడుతున్నది. ప్రపంచ మంతా కాలుష్యంతో,కల్తీ తో నిండిపోయింది. ఎన్ని చట్టాలున్నా కల్తీని అరికట్టలేకపోతున్నాం.ప్రజల జీవన ప్రమాణాలు అధమ స్థానంలో ఉండడం వలన, ధరలు ఊర్ధ్వ స్థానానికి ఎగబాకడం వలన   నాణ్యమైన వస్తువులను,ఆహార పదార్థాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రజల ఆర్ధిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని,  కల్తీ విక్రయ దారులు పెరిగి పోతున్నారు. కల్తీ వలన ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారు. కల్తీ మయంగా మారిన వ్యాపార సామ్రాజ్యాన్ని పెకలించాలి. ప్రజలకు ఆహార పదార్థాల  నాణ్యత పట్ల, కల్తీ పట్ల,ఇతర వస్తూత్పత్తుల పట్ల అవగాహన కలిగించాలి. అన్నింటికంటే ముందుగా ప్రజల కొనుగోలు సామర్ధ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంచాలి.

సమీప భవిష్యత్తులో ఇది సాధ్యం కాని పని. ‘‘అయినా పోయిరావలె హస్తినకు…’’ అన్నట్టుగా మన ప్రయత్నం కొనసాగించాలి. ఆహార పదార్థాల కల్తీ పట్ల నిఘా పెంచాలి.పాలు,నీరు, ఉప్పు,పప్పు, పంచదార ఒకటేమిటి అన్నీ కల్తీ మయమై పోతున్నాయి. మన జనాభా ఎంత? పాల దిగుబడి ఎంత? విక్రయమెంత? అనే విషయాలను క్షుణ్ణంగా ఆలోచిస్తే పాలల్లో జరిగే దారుణమైన కల్తీ విషయం ద్యోతక మవుతుంది. దాదాపు పాలలో 50 శాతం  కల్తీ జరుగుతున్నది. సంపూర్ణ ఆహారంగా పిలవబడే పాలు యూరియా, డిటర్జంట్‌ ‌వంటి కలుషితాలతో నిండి పోతున్నాయి. వనస్పతి,సల్ఫ్యూరిక్‌ ఆమ్లము, పాల అధిక  దిగుబడుల  కోసం వినియోగించే ఇంజక్షన్ల వలన ప్రజా రోగ్యం దెబ్బతింటున్నది.భోజనం మాన వచ్చేమో గాని కాఫీ,టీ లేకుండా జీవించడం అసాధ్యం గా మారిన వర్తమానంలో టీ పొడిలో జరుగుతున్న కల్తీ దారుణం. టీపొడి లో రంగు,రుచి కోసం వాడే పదార్థాల వలన, రసాయనాల వలన ఆరోగ్యంపై  పడుతున్న దుష్ఫరిణామాల గురించి ఆలోచించాలి.

ఒక సారి వాడిన టీ,కాఫీ పొడిని పునర్వినియోగించడం, చాక్లెట్‌ ‌ఫౌడర్‌ ‌ను వాడడం  వలన కిడ్నీ సంబంధిత వ్యాధులు,  డయాబెటిస్‌ ‌వంటి రోగాలు ఏర్పడుతున్నాయి.కారం లో ఇటుక పొడి, ఇతర ప్రమాదకరమైన రంగులను వాడడం వలన కేన్సర్‌,అల్సర్‌ ‌వంటి రోగాలు తలెత్తుతున్నాయి.పసుపు భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. పసుపు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పసుపు యాంటీ బయోటిక్‌ ‌గా పేరొందింది. ఇలాంటి పసుపు లో కూడా కల్తీ జరగడం వలన పలు రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.వంట నూనెల్లో జంతువుల కొవ్వు కరిగించి కల్తీ చేయడం జరుగుతున్నది.ప్రత్తి గింజల నూనెను అధిక ప్రమాణంలో అధిక ధరల్లో ఉండే  సన్‌ ‌ప్లవర్‌ ‌తో కల్తీ చేస్తున్నారు.ఎర్ర రక్త కణాలు నాశనం కావడానికి కారణమయ్యే ప్రమాదకరమైన కల్తీలను వంట నూనెల్లో కలుపుతున్నారు.నెయ్యి లో వనస్పతి ని కలిపి కల్తీ చేస్తున్నారు.ఇటుక పొడి,రంపపు పొడి, కృత్రిమ రంగులతో కల్తీ చేయడం వలన జనారోగ్యం దెబ్బతింటున్నది. బియ్యంలో కల్తీ, గోధుమ పిండిలో కల్తీ, కంది పప్పులో కల్తీ….సర్వం కల్తీ మయమే.అందరూ ఇష్టపడే స్వీట్ల లో నెయ్యి, పాలు కు బదులుగా, పామ్‌ ఆయిల్‌ ,‌సింథటిక్‌ ‌మిల్క్ ‌కల్తీగా ఉపయోగిస్తారు.

ఒకప్పుడు వంశ పారంపర్యంగా సంభవించే షుగర్‌,‌బి.పి వంటి వ్యాధులు నేడు అందరినీ వేధిస్తున్నాయి. దీనికి కారణం మన శరీర వ్యవస్థను, రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తున్న కల్తీ కారకాలే.ధనవంతులు నాణ్యత,భద్రతా ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను ఎంత ఖరీదైనా కొనుగోలు చేస్తారు. వారి అర్ధిక స్థోమత వారికి ఆలంబన. కాని కటిక పేదరికంలో, దారిద్య్ర రేఖకు అత్యంత దిగువ స్థాయిలో జీవించే వారికి  నిత్యావసర వస్తువులను  అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే శక్తి ఉండదు. ఈ అవకాశాన్ని సాకుగా తీసుకుని, సామాన్యుడికి సైతం అందుబాటు లో ఉండే ధరలతో ఆకర్షణీయమైన పద్ధతులతో కల్తీ చేసి బ్రాండెడ్‌ ‌సరుకు కు ఏ మాత్రం తీసిపోని విధంగా కల్తీని చేస్తూ కోట్లాది రూపాయల మార్కెటింగ్‌ ‌చేస్తున్నారు.’’బ్రాండ్‌’’ ‌పేరుతో కల్తీ దందా కొనసాగుతున్నది. కల్తీ ప్రపంచంలో ఏది కల్తీ, ఏది స్వచ్ఛమైనదో తెలుసు కోవడం కష్టం. కల్తీ మాఫియా చెలరేగి పోతున్నది.

వినియోగ దారుల చట్టాలున్నాయి. ఆహార పదార్థాల కల్తీని తెలుసుకునే మార్గాలున్నాయి. అనునిత్యం ప్రతీ వస్తువు నాణ్యమైనదా? కాదా అని తెలుసుకోవడం, కల్తీ జరిగితే తత్సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, లేబరేటరీలకు శాంపిల్స్ ‌పంపి నిజనిర్ధారణ చేయడం  సామాన్యులకు సాధ్యమా?  కల్తీ ని అరికట్టడానికి ఒకరో,ఇద్దరో ఉద్యమించినంత మాత్రాన ఫలితం శూన్యం. సమిష్ఠి బాధ్యత, చైతన్యం, చిత్తశుద్ది లేనిదే    కల్తీ సామ్రాజ్య సౌధాలను కూల్చడం అసాధ్యం. కల్తీని అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంతో ఉంది.  పలు రకాల కేన్సర్‌ ‌వ్యాధులకు, కిడ్నీ,లివర్‌ ‌వ్యాధులకు, శ్వాసకోశ, జీర్ణ సంబంధిత వ్యాధులకు, గుండె జబ్బులకు కారణమౌతున్న కల్తీని అరికట్టాలి. ఎన్ని వైద్య సదుపాయాలు సమకూరినా మనం తినే ఆహార పదార్ధాలు కల్తీ అయితే ఎవరూ కాపాడలేరు. కల్తీ ని భుజించి జీవించడం ఎంతకాలం సాధ్యం? ఇకనైనా ప్రభుత్వాలు వినియోగదారులు  మేల్కొనాలి. కల్తీ మాఫియా నుండి ప్రజలను కాపాడాలి.
– సుంకవల్లి సత్తిరాజు,
మొ:9704903363.

Leave a Reply