Take a fresh look at your lifestyle.

జనరంజకమైన ప్రసారాలు జరగాలి

ఆకాశవాణి హైదరాబాద్‌ ‌కేంద్రం 102.8 వివిధ భారతి కార్యక్రమాలలో ఈ నెల అక్టోబర్‌ 1 ‌నుండి సమూల మార్పులు చేస్తూ, ఎన్నో ఏళ్ల నుండి లక్షలాది మంది శ్రోతలను అలరిస్తున్న కార్యక్రమాలను రద్దు చేస్తూ, వాటి స్థానంలో కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో ఎంతగా మార్పు వచ్చిందంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు వినిపించే వందేమాతరం స్థానంలో మార్పు, గాంధీ జయంతి రోజున మహాత్మా గాంధీ గారి స్మరణ, మాట, పాట లేకుండా కార్యక్రమాలు కొనసాగాయి. గత 30, 40 ఏళ్ల నుండి లక్షలాది మంది శ్రోతలను అలరించిన జనరంజని, ఈ పాట మీకోసం మొదలగు జనరంజక కార్యక్రమాలను రద్దు చేసి, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలను, ఆ పాత మధురాలు, అలనాటి ఆణిముత్యాలైన పాటలను ప్రసారం చేయకూడదని నిర్ణయించారు. కేవలం వాట్సాప్‌ ‌ద్వారా కొత్త పాటలను మాత్రమే కోరుకోవాలని శ్రోతలను ఆదేశించే విధంగా కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. వివిధ భారతి కార్యక్రమంలో వచ్చిన మార్పులు శ్రోతలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజు ప్రసారమై అందరిని అలరించే వివిధ భారతి కార్యక్రమాలకు లక్షలాది సంఖ్యలో శ్రోతలు, వేలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఎన్ని మీడియాలు వచ్చినా, ఎన్ని టీవీలు వచ్చినా, ఎన్నో ప్రైవేట్‌ ఎఫ్‌ఎం ‌రేడియో స్టేషన్లు వచ్చినా, ఆకాశవాణి కార్యక్రమాలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. సరికదా దినదినం శ్రోతల సంఖ్య పెరుగుతూ ఉంది.

వివిధ భారతి ప్రసారం చేసే జనరంజని, ఈ పాట మీకోసమే, మధుర గీతాలు, పాటల పల్లకి, నవరాగం వంటి కార్యక్రమాలు ఏళ్ల తరబడి శ్రోతల మన్ననలు పొందు తున్నాయి. ఎన్నో ప్రైవేట్‌ ఎఫ్‌ఎం ‌ఛానల్‌ ‌వచ్చినా వివిధ భారతి కార్యక్రమా లకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలకు దాదాపు 40 లక్షల మంది రెగ్యులర్‌ ‌శ్రోతలు ఉన్నట్లు ఒక అంచనా. చాలా గ్రామాల్లో దినసరి కూలీలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, క్షురకులు, దర్జీలు ఇలా ఎన్నో వర్గాల వారు ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు వింటారని ఒక అంచనా. వివిధ భారతి కార్యక్రమాల పట్ల ఎంతో మమకారం కలిగిన శ్రోతలు రేడియోను తమ జీవితంలో ఒక భాగం చేసుకున్న సంగతి అధికారులకు, ఆకాశవాణి సిబ్బందికి బాగా తెలుసు రేడియోలో ప్రసారం అయ్యే కార్యక్రమాలు ఏకకాలంలో పండిత పామరులను ఆకర్షిస్తాయి. ఎంతో మంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు, గృహిణులు, విశ్రాంత ఉద్యోగులకు ఆకాశవాణి ఒక ప్రియమైన నేస్తం. రోజువారీ పని చేసుకుంటూ శారీరక శ్రమను మర్చిపోయి వినోదాన్ని పొందే ఆకాశవాణి శ్రోతలది ఒక కుటుంబం. ఒక ప్రపంచం. రేడియోతో వారి అనుబంధం విడదీయలేనిది. హలో ఎఫ్‌ఎమ్‌ ‌కార్యక్రమంలో మాట్లాడే వృద్ధులు, పెద్ద మనుషులు, విశ్రాంత ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, గృహిణుల మాటలు వింటుంటే వివిధ భారతి విశిష్టత విస్పష్టమవుతోంది.

రేడియో కార్యక్రమాలు వింటూ, జీవి తాన్ని గడిపేస్తూ, బాధలను మరచి పోయి వారికి, తమ అభిప్రా యాలను టెలి ఫోన్‌ ‌ద్వారా ఉత్తరాల ద్వారా వ్యక్త పరిచే విషయాలన్నీ ఆకాశవాణి అధి కారులు మర్చి పోతే ఎలా? పోస్ట్ ఆఫీస్‌ ‌కి వెళ్లి ఉత్తరాలు కొనుక్కుని నచ్చిన సినిమా పాటలు రాయడం తిరిగి వాటిని రేడియోలో వినడం అనేది మర్చిపోలేని, మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇప్పటికీ శ్రోతలు అసంఖ్యాక ఉత్తరాలు వ్రాసి పాటలు కోరుతున్నారు అంటే రేడియో కార్యక్రమాలు జనరంజని, ఈ పాట మీకోసం ఎందరి జీవితాలతో మమేకమై పోయిందో తెలుస్తుంది. అటువంటి జనరంజని, ఈ పాట మీకోసం కార్యక్రమాలను మొత్తం ఎత్తివేయడం శ్రోతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆకాశవాణి హైదరాబాద్‌ ‌కేంద్రం నుండి వివిధ భారతి ఎఫ్‌ఎమ్‌ ‌తో పాటు ఏ కేంద్రం బి కేంద్రం నుండి ప్రసారాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి అంటే సంస్కృతికి సంప్రదాయాలను పరిరక్షించే సంస్థ. కళల కాణాచి. స్వాంతన కు మనశాంతికి చిరునామా. గ్రామీణ కళాకారులను, ఒగ్గు కథకులను, బుర్రకథ కళాకారులు, జానపద కళాకారులు, ఎందరో సాహితీవేత్తలను, నాటక ప్రయోక్త లను, రచయిత, కళాకారులను, సకల కళలను పెంచి పోషించిన సంస్థ. ఆకాశవాణి అమ్మలాంటిది. దీనిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అంతకుమించి కేంద్ర ప్రభుత్వం పై ఉన్నది. ప్రసార భారతి పై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో దూరదర్శన్‌, ఆకాశవాణిల మనుగడ ప్రశ్నార్థకమైంది. ప్రకటనలు తెచ్చుకోండి.. మీ ఆదాయం మీరే సమకూర్చుకోండి.. అని ఆదేశాలు జారీ చేయడం, మారుమూల పట్టణాల్లో ఉన్న స్టేషన్లను క్రమంగా ఎత్తివేయడం, ప్రసార భారతిని కార్పొరేషన్‌ ‌గా మార్చి క్రమక్రమంగా మూసివేసే ప్రయత్నాలు చేయడం బాధాకరం.

మారుమూల ప్రజలకు సమాచారం, వినోదం అందించడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో రేడియో పాత్ర మరువలేనిది. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ప్రసార భారతికి ప్రకటన రూపంలో ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించాలి. కార్పొరేట్‌ ‌సంస్థల సామాజిక బాధ్యత (సి.ఎస్‌.ఆర్‌) ‌క్రింద ఆకాశవాణి కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలి. ఆకాశవాణి హైదరాబాద్‌ ‌కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పదవి విరమణలు జరుగుతున్నా కొత్త నియామకాలు జరగడం లేదు. ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలి. వివిధ భారతి 102.8 ఎఫ్‌ఎం ‌లో అనేక ఏళ్లుగా ప్రజాదరణ పొందుతున్న జనరంజని, ఈ పాట మీకోసం, మధుర గీతాలు, నవరాగం, బృందావనం, హరివిల్లులాంటి కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించి ప్రసారం చేయాలి.

suresh kaleru
సురేష్‌ ‌కాలేరు, రేడియో శ్రోత రాష్ట్ర సహాధ్యక్షులు తెలంగాణ ఉద్యోగుల సంఘం

Leave a Reply