Take a fresh look at your lifestyle.

పోరు జెండా సాక్షిగా..!

సంస్కరణల మెరుగులద్దితేనే …
మట్టి దేహాలు వన్నెలు చిందవు

సంక్షేమ మంత్రం జపించినంతనే …
అన్నదాత బతుకు పులకరించదు

నవ్య శాసనాల లిఖించినంతనే …
ఎవుసం ఏడింతలు రెట్టించదు

ఈ కోతల మాటలు కట్టిపెట్టండి
మీ పిట్టల దొర వేషం చాలించండి

మీరు ఉహించినట్లుగా…
సత్తెకాలపు సత్థయ్యలం కాము

దేశం ఆకలి తీర్చిన చందంగా…
జాతి ద్రోహుల పాతిపెట్టే దిట్టలం

- Advertisement -

కలుపు మొక్కల వేరేసిన వైనంగా
వ్యవస్థ చీడల తొలిచేసే నేర్పరులు

నాగళ్లతో దుక్కి దున్నటమే కాదు
పలుగుతో కోటల పెకిలించటం ఎరుకే !

బురద నుంచి బువ్వ తీయటమే కాదు
పోరాట సేద్యంలోను అనుభవజ్ఞులమే !

అందుకే !
మీ విష శాసనాల నిరసిస్తూ …
తిరుగుబాటు బవుటా ఎత్తినం
రాజధాని హస్తినా సరిహద్దుల్లో
చారిత్రక పోరాటం సాగిస్తున్నం
ఇపుడు దేశం మా పక్షమే నిలిచింది

మద్దతుగా జన ప్రభంజనం పోటెత్తింది
ఇక మీ ఢిల్లీ పీఠాలు కూల్చుటే ఆలస్యం

రైతు వ్యతిరేక పాలకుడా !
పోరు ‘‘జెండా’’ సాక్షిగా…
నీకు మరో దారంటూ ఏది లేదు
చీకటి చట్టాల ఉపసంహరించి
మన్నించమని మోకరిల్లటం తప్పా !
(నల్ల చట్టాల రద్దుకు సాగే కర్షక పోరుకు మద్దతుగా…) కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply