Take a fresh look at your lifestyle.

ఎదురుచూస్తున్నరు

స్వాతంత్య్ర స్వర్ణభారతంలో
మారని బతుకు చిత్రం
మౌలికవసతులేవి లేని సామాన్యుల బతుకుగొంగడి
తడిసడిలేక రేగి కంపకువేలాడి
చిల్లులుపడి చిద్రమౌతుంది

కాయం రాలిపోయేదాకా కష్టపడి
బానిసల్లా స్వేదమంతా దారపోసిన
తిరిగిచూస్తే తరగని అప్పులు
తీరని ఆకలి
తరాలకు దారవోస్తూ తెలియక వెలుగుదారి
చీకటినింపుకుని చిద్రమౌతరు

కాలం మారుతున్న తలరాత మారదు
దోపిడెంత జరిగిన చిల్లరకమ్ముడుపోయి
అడిగేహక్కు కోల్పోయారు
తాయిలాల లోయలో కొట్టుకుపోతూ మారనిబతుకుకు వారసులౌతున్నరు

మాయదారి రోగాలు దండయాత్ర చేస్తుంటే
సర్కారు దవాఖానలో వసతులుండవ్‌
‌డాక్టర్లు నర్సులు అన్నీ ఖాళీలే
ఏముండవ్‌
‌వైద్యసౌకర్యాలు కల్పించలేని
స్వర్ణోత్సవ భారతదేశంలో
నాయకత్వం
కార్పొరేట్‌ ‌కాలర్స్ ‌చేతిలో
తోలుబోమ్మలాటలాడుతోంది

సామాన్యులకు సామాజిక న్యాయమెపుడో
శవాలై కొట్టుకుపోతుంటే
ఏ.సి గదుల్లో ముసలికన్నీరు
విడిచే చేతకాని నాయకత్వం రాజ్యమేలుతోంది

అట్టడుగు వర్గాలను దోచుకుంటూ
అంతరిక్షంలో ఎగిరితే ఏంలాభం
విపత్తు ఎదుర్కోని సర్కారులెందుకని
రాజకీయాధికారంతో రాబందుల్లా
అధికారం చేతికిచ్చినోళ్ళ చావులు చూస్తూ
వగలేడ్పులేడ్చేటందుకా

మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేసే ఆసుపత్రులకు
వత్తాసుపలుకుతున్న బినామి భాగస్వామ్యం ఈనాటి నాయకత్వం
అద్దాలమేడల్లో వైద్యం
చావుల వేదాలు వల్లిస్తూ
ధనాసురులు ఊపిరినొక్కేస్తుంటే
ఆనందయ్యకోసం జనం ఎదురుచూస్తున్నరు
ఎప్పుడొస్తడోననీ ఆశతో
– సి. శేఖర్‌(‌సియస్సార్‌), 9010480557.

Leave a Reply