పెరడు పూసిన పూలే
పెద్ద ముత్తయిదువలవగ..
కంపల విరిసిన విరులే
కెంపులై మెరిసినవి..
తర్పణములైన కుసుమాలు
వేల్పులై పూజలొందినవి…
మేనుల మేనాలపై ఊరేగి
ఉత్సవాలు చేసినవి..
తొమ్మిదోదొద్దుల సంబరాలు
అంబరాన్ని ముద్దాడ..
బతుకమ్మాయంటు జనుల
దీవెనార్తి పలికింది..
ఆడబిడ్డ ల ఆట జూశి
పల్లె , పట్నం మురిసింది..
పడుచు పిల్లల జోరు సూశి
గజ్జె కట్టి ఆడింది..
నేల తల్లి సింగిడై
సందడే చేసింది..
పూబంతుల సింగారాల
చిందులే వేసింది..
ఎద నిండిన పూల జూశి
ఏరు తల్లి పొంగింది..
గౌరమ్మను పాయిరంగా
కడుపుల్ల దాచుకుంది..
సల్లంగ సూడు మంటూ
ఊరు, వాడ మొక్కింది..
పోయిరా తల్లి యని
సద్దిగట్టి పంపింది..
– మధుర శ్రీ, (మధుకర్ రావు బోగెళ్లి)
హన్మకొండ. చరవాణి : 8522000157.