Take a fresh look at your lifestyle.

మొక్కుబడిగా కాలుష్య నివారణ దినోత్సవాలు

హక్కుల ఉద్యమకారులు, పర్యావరణ పరిరక్షకులను మన ప్రభుత్వాలు నేరస్థులుగా పరిగణిస్తున్నాయి. వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారినీ, పరిశ్రమల పేరిట ఉద్గారాలను పెంచి కాలుష్యాన్ని వ్యాపింపజేస్తున్న వారినీ స్వాగతించి సత్కారాలు చేస్తున్నాయి. భోపాల్‌ ‌గ్యాస్‌ ‌దుర్ఘటన జరిగి నేటికి 36 ఏళ్ళు. పర్యావరణ ప్రాముఖ్యాన్ని భారత దేశానికే కాకుండా యావత్‌ ‌ప్రపంచానికి ఈ సంఘటన గుర్తు చేసింది. ఈరోజు అంటే డిసెంబర్‌ ‌రెండో తేదీన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడమే జరుగుతోంది, కానీ, పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజలను చైతన్య పర్చే కార్యక్రమాలేవీ జరగడం లేదు. ఒక వేళ అక్కడక్కడ జరుగుతున్నా అది కేవలం మొక్కుబడిగానే సాగుతున్నాయి. ఈ మధ్య హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోను గ్రీన్‌ ‌చాలెంజ్‌ ‌కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని పలువురు సెలబ్రిటీలు, వాణిజ్య రంగానికి చెందిన ప్రముఖులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం వేడుకగా జరుగుతున్న మాట నిజమే కానీ, ఎన్ని మొక్కలు బతుకుతున్నాయో, ఎన్ని వ్యర్థం అవుతున్నాయో పర్యవేక్షణ జరగడం లేదు.

నగరాలు, పట్టణాలలో పార్కులను కబ్జా చేసే ఘనులు తయారైన ప్రస్తుత పరిస్థితుల్లో కాలువ ఒడ్డు పైనా, చెరువు కట్టలపైనా ఆక్రమణలకే చోటు లేనప్పుడు మొక్కలకు చోటెక్కడ. భోపాల్‌ ‌గ్యాస్‌ ‌దుర్ఘటన జరిగిన తర్వాత కేంద్రంలో, మధ్యప్రదేశ్‌లో అనేక ప్రభుత్వాలు మారాయి. ఈ ఘటనలో వేలాది మంది మరణించారు. అంతకు రెట్టింపు మంది వికలాంగులు కావడమో, అంధులు కావడమో జరిగింది. బాధితులకు సరైన పరిష్కారం ఈనాటికీ అందలేదంటే యావత్‌ ‌భారత జాతి సిగ్గుతో తలదించుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి దుర్ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్ని జరిగాయో లెక్కేలేదు. ఎప్పటికప్పుడు పరగడుపు ధోరణిలో ప్రభుత్వాలు ఘనమైన ప్రకటనలు చేస్తుంటాయి. అవి అమలుకు నోచుకోవు. కొద్ది నెలల క్రితం ఆంధప్రదేశ్‌లో విశాఖ సమీపంలో ఎల్‌జి పాలిమార్స్‌లో గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటనలో మరణించిన వారికి ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌ ‌వెంటనే స్పందించి భారీగా పరిహారాన్ని ప్రకటించారు. పరిహారంతో మృతుల కుటుంబాల్లో ఏర్పడిన వెలితి తీరకపోయినా, అదొక స్వాంతన మాత్రమే. అలాగే, కొరోనా పేషంట్లు ఉన్న విజయవాడ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు కూడా జగన్‌ అదే రీతిలో వెంటనే స్పందించారు. ఇలాంటి ప్రమాదాలన్నీ మానవ తప్పిదాలేనని వేరే చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా, కాలుష్యాన్ని వ్యాపింపజేసే సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన ప్రభుత్వాలు ఆయా సంస్థలతో రాజీ పడుతున్నాయి. బాధితుల పక్షాన పోరాడుతున్న ఉద్యమకారులపై తీవ్రవాద ముద్రవేసి కేసులు నమోదు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్ళల్లో ఉన్న వారిని సైతం వాయు కాలుష్యం వదలడం లేదు. పౌరుల్లో ఆరోగ్యం పట్ల స్పృహ లేకపోవడం, సంపన్నవర్గాల్లో నానాటికీ స్వార్థం పెరిగిపోతుండటం వల్ల కాలుష్యం వ్యాపిస్తోందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికీ ఉండటం లేదు. రాజీవ్‌ ‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గంగానది కాలుష్య నివారణకు ఆరోజుల్లోనే 20వేల కోట్ల రూపాయిలు కేటాయించారు. ఆ సొమ్ము ఎలా ఖర్చు చేశారో ఇప్పటికీ తెలియదు. కానీ, అప్పటి కన్నా గంగానది కాలుష్యం ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నదుల కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి తొలి కేబినెట్‌లో ఉమాభారతికి ఆ శాఖను అప్పగించారు. ఆమె తన వంతు ప్రయత్నాలు చేశారు. కానీ, ఆమెను మోడీ రెండో సారి కేబినెట్‌లోకి తీసుకోలేదు. పారిశ్రామిక వేత్తలు, భారీగా వ్యర్థాలను గంగానదిలోకి వొదిలే సంస్థల వొత్తిడి కారణంగానే ఆమెను మళ్ళీ మంత్రిగా తీసుకోలేదన్న కథనాలు వెలువడ్డాయి.

ఇవి పూర్తిగా నిరాధారాలు కావు. పారిశ్రామిక, కార్పొరేట్‌ ‌సంస్థల వొత్తిడులకు లొంగి ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్న వామపక్షాల ఆరోపణలను పూర్తిగా తోసిరాజనడానికి లేదు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న రైతులు సైతం కాలుష్యాన్ని పెంచడంలో భాగస్వాములు అవుతున్నారు. పంజాబ్‌, ‌హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడంతో పొగ దట్టంగా వ్యాపించి ఢిల్లీ పరిసరాలను కాలుష్యమయం చేస్తున్నట్లు వొచ్చిన ఆరోపణలను కొట్టివేయలేం. పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు ఆ పంటను దగ్ధం చేస్తున్నారు. ముఖ్యంగా చెరకు పంట విషయంలో ఇది చాలా చోట్ల కనిపిస్తున్న దృశ్యం. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంటల వ్యర్థాలను కాల్చి బుగ్గి చేయడమే కారణం. అలాగే, నగరాలు, మహానగరాల్లో వాహనాల సంఖ్య పెరగడం వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరగడానికి పాత వాహనాలను ఉప సంహరించకపోవడమే కారణం. పాత వాహనాలను ఉపసంహరిస్తే కాలుష్యం ఇంతగా పెరగదు. అలా జరగకపోవడంలో కూడా రాజకీయ జోక్యం ఉంది. నీటి కాలుష్యం గురించి వేరే చెప్పనవసరం లేదు. భారీ వర్షాలు, వరదల్లో హైదరాబాద్‌ ‌వాసులు అనుభవించిన కష్టాలను కళ్ళారా చూశాం. చుట్టూ నీరున్నా, వరద నీరు ముంచెత్తినా, తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక జనం ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. ఇలాంటి సన్నివేశాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. జల, వాయు, శబ్ద కాలుష్యాలు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించి వేస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ ‌హారన్లను మోగించడంపై నిషేధం ఉన్నా యథేచ్ఛగా వాటిని వాడటం జరుగుతోంది. అలాగే, దీపావళి బాణ సంచాపై నిషేధం ఉత్తుత్తిగానే అమలు జరిగింది. మానవ కల్పిత కాలుష్యాలే సాటి మానవుని కష్టాల పాలు చేస్తున్నాయి. కాలుష్య నివారణకు చట్టబద్ధమైన చర్యలు తీసుకోకుండా ఏటా కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం మొక్కుబడే అవుతుంది.

Leave a Reply