Take a fresh look at your lifestyle.

నేడు పోలింగ్‌… ‌భయంలో వోటర్లు..!

  • ఆందోళనలో అభ్యర్థులు
  • వోటు హక్కును వినియోగించుకోవాలంటూ పోలీసుల ర్యాలీలు
  • ఎన్నికల డ్యూటీనుండి మినహాయించాలని టీచర్స్ అసోసియేషన్‌ ‌విజ్ఞప్తి

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,ఏప్రిల్‌ 29 ) ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా ఎన్నికల తేదీ రానేవచ్చింది. రెండు మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌లు, అయిదు మున్సిపాలిటీలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నికలకు కావాల్సిన సకల ఏర్పాట్లను పూర్తిచేశాయి. ఇక వోటర్లు తమ వోటు హక్కును వినియోగించు కోవడమే తరువాయి. అయితే ఈసారి వోటర్లు పోలింగ్‌ ‌కేంద్రాలకు పోవాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ట్రంలో విస్తృతంగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంటినుండి బయటికి రావద్దని ఒకపక్క ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్న క్రమంలో ఎంతమంది ఈసారి తమ వోటు హక్కును వినియోగించుకుంటారన్నది వేచి చూడాల్సిందే. కొరోనా మొదటి విడుతకన్నా ండవ విడుత వైరస్‌ ‌చాలా తీవ్రంగా ప్రభలుతున్నది. గత పదిపదిహేను రోజులుగా అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఏ రోజుకు ఆరోజే భయం గొలిపే సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు వస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ ఎన్నికల్లో లక్షలాది మంది వోటర్లు తమ వోటు హక్కుకోసం క్యూల్లో నిలబడినప్పుడు ఎలాంటివారి పక్కన నిలబడాల్సి వస్తుందోనన్న ఆందోళన చెందుతున్నారు. పోలింగ్‌ ‌స్టేషన్‌లోపల సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించినప్పటికీ బయట కొండవీటి చాంతాడంత క్యూలైన్లను అదుపు చేయడం ఎవరికి సాధ్యపడుతుందన్న భావన ఉంది. కొరోనా వచ్చినవారు కొందరు ఇప్పటికే బయటికి చెప్పకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒక్కరివల్ల వందలమందికి వ్యాపించే పరిస్థితిలో దీన్ని కట్టడిచేయడం కష్టమంటున్నారు. ఇప్పటికే కొరోనా సోకిందేమోనని అనుమానించేవారు, నివృత్తికోసం కొరోనా పరీక్ష చేయించుకునే పరిస్థితికూడా లేకుండా పోయింది. రాష్ట్ర రాజధానితోపాటు ఎక్కడచూసినా తమవద్ద టెస్ట్ ‌కిట్లు లేవని వందలమందిని వెనక్కు పంపుతున్న సంఘటనలు అనేకం.

ఏ రోజుకారోజు టెస్ట్ ‌కేంద్రాలకు వెళ్ళడం నిరాశతో తిరిగి రావడం మామూలైపోయింది. అనుమానంతో రోజుల తరబడి ఇంట్లో ఎలా ఉండా లంటున్నారు కొరోనా పరీక్షలకోసం ఎదురుచూస్తున్నవారు. తమనుండి కుటుంబ సభ్యులకు సోకుతుందేమోనన్న అనుమానం ఒకపక్క పీకుతుంటే, మరోపక్క నిజంగానే కొరోనా సోకినట్లైతే చికిత్స చేయించుకోవడంలో జాప్యం జరుగుతున్నదేమోనన్న అనుమానం మరో వైపు తమకు నిద్రపట్టకుండా చేస్తున్నదంటున్నారు. రెండవ విడుత తీవ్రత నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ఇతర మేధావి వర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని , ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తిచేసినప్పటికీ ఎవరుకూడా పట్టించుకోలేదు. ఈ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లు వేసింది మొదలు ప్రచార పర్వం పూర్తి అయ్యేసరికి దాదాపు అన్ని పార్టీలకు చెందినవారు సభలు, సమావేశాలు, ర్యాలీలు చేపట్టారు. వీటిల్లో పాల్గొన్న వేలాదిమందిలో ఎంతమంది క్షేమమో తెలియదు.

ఈ ఎన్నికల సందర్భంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌కొరోనా భారినపడిన విషయం తెలియందికాదు. వారు విఐపిలు కాబట్టి సరైన చికిత్స లభించే అవకాశముంది. కాని సామాన్యుల పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తున్నది. హైదరాబాద్‌ ‌మొదలు రాష్ట్రంలోని ఏ జిల్లాలోకూడా ప్రైవేటు హాస్పిటల్స్ల్లో పేషంట్లను తీసుకోవడంలేదు. హాస్పిటల్స్ ‌చుట్టూ తిరిగితిరిగి పేషంట్‌ ‌రోడ్లమీదే ప్రాణాలు వదులుతున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఆక్సీజన్‌ ‌కొరత, బెడ్స్ ‌కొరత, వెంటీలేటర్స్ ‌కోరత,లైఫ్‌ ‌సేవింగ్‌ ‌డ్రగ్‌ ‌కొరత, చివరకు టెస్ట్ ‌కిట్స్‌కూడా కొరతే. ఇలాంటి పరిస్థితిలో జన సమూహంలోకి వెళ్ళి తమ వోటు హక్కును ఎలా వినియోగించుకునేదంటూ ఆందోళ వ్యక్తంచేస్తున్నారు. అయితే వరంగల్‌ ‌లాంటి కొన్ని ప్రాంతాల్లో తమ వోటు హక్కును వినియోగించుకోవాలంటూ పోలీసులే ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాల్లో ప్రకటనలు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్నికల పక్రియలో పాల్గొనేందుకు ఈసారి ప్రభుత్వ సిబ్బందికూడా భయపడుతున్నారు. తమను ఎన్నికల డ్యూటీనుండి మినహాయించాలని ఇప్పటికే టీచర్స్ అసోసియేషన్‌ ‌ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తమకు డ్యూటీ పడకుంటే బాగుండని కొందురు భగవంతుడి ప్రార్థించుకుంటున్నారు. డ్యూటీ కన్నా తమ ప్రాణం ముఖ్యమంటున్నారు. ఏ పనిచేయాలన్నా ముందు ప్రాణాలతో ఉండాలి కదా అంటున్నారు. చాలామంది ఎంప్లాయిస్‌ ‌బారిన పడ్డారుకూడా. కాగా, ఎన్నికల కమిషన్‌ ఆఫీసులోనే ముఖ్య అధికారితోపాటు కొందరు సిబ్బంది కొరోనాకు గురైనవారున్నారు. అయితే ఎలక్షన్‌ అర్జంట్‌ అన్న ఒకే ఒక క్లాజ్‌తో డ్యూటీకి హాజరుకాక తప్పదంటూ తమ నిస్పృహను వ్యక్తంచేస్తున్నారు మరికొందరు. రెండవ వేవ్‌కే ఇంత భయపడిపోతున్న క్రమంలో మేలో కొరోనా మూడవ వేవ్‌కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మూడేకాదు.. నాలుగు.. అయిదు వేవ్‌లు వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేమీలేదంటున్నారు.

ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేయాలనే విషయంలో హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. కోర్టుకూడా ఈ విషయంలో పలుసార్లు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నైట్‌ ‌కర్ఫ్యూ పదిరోజులుగా కొనసాగుతున్నది. దానివల్ల పాజిటివ్‌ ‌కేసులు పెద్దగా అదుపులోకి రాకపోగా మరింత విజృంభించాయి. నైట్‌ ‌కర్ఫ్యూ నేటి తో ముగియనుంది. దీని తర్వాత ఏమిటన్నది ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రశ్నించినా ప్రభుత్వం వద్ద జవాబులేదు. మిన్నువిరిగి మీద పడుతున్న ప్రభుత్వానికి చలనంలేదంటూ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహించిందికూడా. ఇలాంటి పరిస్థితిలో ఈసారి ఎంతమంది పోలింగ్‌ ‌బూత్‌కు వెళ్ళి వొటు వేస్తారన్నది ప్రశ్నేమరి. సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించాలని చెబుతూనే వేలిపై సిరాగుర్తు పెట్టేక్రమంలో అందరికీ ఒకే స్టిక్‌ ‌వాడుతారు కదా అప్పుడెలా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు.

Leave a Reply