Take a fresh look at your lifestyle.

పాలిటిక్స్ ‌పొల్యూటర్‌

తన అవసరం కోసం
వంగివంగి దండం పెడతాడు
ఉప్పొంగిపోయి ఆదరించావో
కట్టుబట్ట కూడ మటుమాయం

తన స్వార్థం కోసం
ఆలింగనానికి యత్నిస్తాడు
ఎరక్కపోయి హత్తుకున్నావో
వెన్నుపోటు గాయం ఖాయం

తన ఎజెండా కోసం
భ్రమల లోకంలో ఊరేగిస్తాడు
ఉబ్బిపోయి జేజేలు కొట్టావో
కట్టుబానిసత్వం ఇక శరణ్యం

అధికార పీఠం కోసం
కపట నాటకం ప్రదర్శిస్తాడు
కరిగిపోయి ఓటును వేశావో
ఐదేళ్ల పరాయి పీడన తధ్యం

సంపాదనే ధ్యేయంగా
ఆధిపత్యమే సమస్తంగా
అధికారమే పరమార్థంగా
క్షణానికో రంగు మారుస్తాడు

- Advertisement -

తాయిలాలు మంత్రంగా
బూటక హామీలు తంత్రంగా
పచ్చనోట్ల పంపిణీ అస్త్రంగా
ఎన్నికల పోరులో గెలుస్తాడు
దోపిడీ పాలనను సాగిస్తాడు

ఓటరు! ఈ కుహనా నేతల
మాటలు అసలే నమ్మబోకు
నమ్మి పీఠాన్ని కట్టబెట్టబోకు

ఎందుకంటే అతడు
బృటాలిటీ సింబల్‌
‌చీటింగ్‌ అం‌బాసిడర్‌
‌పాలిటిక్స్ ‌పొల్యూటర్‌

( ‌నేటి రాజకీయ నేతల కువైఖరిని ఎండగడుతూ..)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply