Take a fresh look at your lifestyle.

రైతుల సమస్యలపై రాజకీయాలు… కేంద్రం వైఖరి వల్లే ఉద్రిక్తత

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని హర్యానాలో అడ్డుకోవడం వల్ల ఏర్పడిన ఉద్రిక్తత శుక్రవారం నాడు ఆ రైతులను ఢిల్లీలోకి అనుమతించడం వల్ల తొలగిపోయింది. అయితే, పోలీసుల పడగనీడలోనే ఢిల్లీలోని బురారీ మైదానంలో ప్రదర్శన జరుపుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అటు పంజాబ్ రైతులు,ఇటు కేంద్రమూ పట్టుదలకు పోవడం వల్ల రెండుమూడు రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనను కేంద్రం రాజకీయ కోణంలో చూడటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ లలో బలంగా ఉండేవి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో పరిస్థితి మారిపోగా,ఇప్పుడు పంజాబ్ లో మాత్రం క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పాలక పక్షాల ప్రాపకంతోనే ఈ సంఘాలు పని చేస్తున్నాయన్నది వాస్తవం. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో మహేంద్రసింగ్ తికాయత్ అనే జాట్ నాయకుణ్ణి ప్రోత్సహించి కేంద్రంపై ఉసిగొల్పారు. అప్పటి నుంచి తికాయత్ రైతుల హక్కుల చాంపియన్ గా గుర్తింపు పొందారు.

మహారాష్ట్రలో శరద్ జోషి చాలా కాలం చెరకు రైతుల తరఫున ఉద్యమాన్ని నడిపారు. పంజాబ్ లో ఇప్పుడు రైతుల ఆందోళన పెద్దది కావడానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ ఇస్తున్న మద్దతు కారణమన్న కేంద్రం అనుమానం నిరాధారం కాకపోయినా, రైతుల డిమాండ్లు బలమైనవి. వాటికి కేవ లం పంజాబ్ రైతాంగం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా రైతులంతా మద్దతు ఇస్తున్నారు. కేంద్రం గత సెప్టెంబర్ లో హడావుడిగా వ్యవహాయ బిల్లులను ఆమోదించింది.అవి చట్ట రూపం ధరించాయి. వాటి వల్ల కార్పొరేట్, కాంట్రాక్ట్ రంగాల్లోకి వ్యవసాయ రంగం వెళ్ళిపోతుందన్నది రైతుల ఆందోళన. వ్యవసాయ రంగంలో దలారుల ప్రమేయాన్ని తొలగించేందుకే ఈ కొత్త విధానాన్ని తెచ్చినట్టు ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలగదని పదే పదే హామీ ఇస్తున్నారు.రైతుల అనుమానాలను తీర్చేందుకు కేంద్రం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఈ బిల్లులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. మోడీ తాను తల్చుకున్నది చేసేయడమే కానీ, ప్రతిపక్షాలను సంప్రదించే సంప్రదాయాన్ని పాటించడం లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్ టి.

కొరోనా లాక్ డౌన్, పరిహారం ప్రకటన మొదలైన అన్ని అంశాల పైనా ఆయన ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాంతో వివిధ రంగాల్లో అసంతృప్తి వర్గాలు ప్రారంభించే ఉద్యమాలకు,ఆందోళనలకూ ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఇంతకీ కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల పెద్ద రైతులు, కాంట్రాక్టు వ్యవసాయం చేసే వారికి మాత్రమే ప్రయోజనమని వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన దేశ ప్రధాని కొరోనా కష్టకాలంలో హడావిడిగా బిల్లులను పార్లమెంటు చేత ఆమోదింపజేసుకోవడంలోని ఔచిత్యాన్ని ఇప్పటికే చాలా మంది ప్రశ్నించారు. దశాబ్దాల పాటు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న అకాలీ దళ్ ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, ఆ పార్టీకి చెందిన సిమ్రజిత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అధికార కూటమి నుంచి వైదొలగారు. ఆమెతో కానీ, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ తో కానీ, ఆ పార్టీ నాయకులతో కానీ చర్చలు జరపలేదు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా మోడీ మొదటి నుంచి గుర్తించడం లేదు. కనీసం మిత్ర పక్షంతోనైనా చర్చించి అకాలీ దళ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. అసలు కొరోనా కాలంలో అంత హడావుడిగా వ్యవసాయ బిల్లులను ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో కేంద్రం వివరణ ఇవ్వకపోవడం దారుణం.

వ్యవసాయం పై తరతరాలుగా ఆధారపడి జీవిస్తున్న కోట్లాది కుటుంబాలకు సంబంధించిన సమస్యపై కేంద్రం ఇంత ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవడాన్ని రాజకీయాలకు అతీతంగా దేశంలో చాలా మంది మేధావులు ప్రశ్నించారు. వ్యవసాయికంగా తన పట్టును నిలబెట్టుకునేందుకు పంజాబ్ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, రైతుల సమస్యలపై అంతా ఏకతాటిపై నిలవడం చాలాకాలంగా జరుగుతోంది. వ్యవసాయ కూలీల సంఘం, రైతు వికాస సంఘం వంటి సంఘాలన్నీ ఇప్పుడు పంజాబ్ లోనే క్రియాశీలంగా పని చేస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పై కేంద్రానికి కోపం ఉంటే అక్కడి రైతులు ఏం చేశారు. వారి ప్రతినిధులను పిలిచి మాట్లాడి ఉంటే ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభించేందుకు అవకాశం ఉండేది కాదు. తమ సమస్యలను కేంద్రం పట్టించుకోకపోవడానికి హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ కట్టార్ కారణమని అమరీందర్ సింగ్ ఆరోపిస్తున్నారు . హర్యానాలో కూడా ఒకప్పుడు రైతు ఉద్యమం బలంగా ఉండేది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తాత దేవీలాల్ చరణ్ సింగ్ ప్రదాన సహచరునిగా రైతు ఉద్యమాన్ని పెంచి పోషించారు. తరాలు మారాయి. దేవీలాల్ తర్వాత ఆ ఉద్యమం నీరస పడిపోయింది. అయినా పంజాబ్ రైతుల ఆందోళనలకు మద్దతు హర్యానా రైతులు ఇస్తూనే ఉన్నారు. ఇది కేవ లం పంజాబ్, హర్యానా రైతులకు సంబంధించిన సమస్యే కాదు. యావత్ దేశంలో రైతుల సమస్య. కేంద్రం తెచ్చిన బిల్లులపై పార్లమెంటులో కూడా సమగ్రమైన చర్చకు అవకాశం ఇవ్వలేదు. కేంద్రం ధోరణి చూస్తుంటే అనుమానాలకు ఊతం ఇస్తోంది. ఇప్పటికైనా ఈ సమస్యను పంజాబ్ రైతుల సమస్యగా కాకుండా దేశవ్యాప్తంగా రైతుల సమస్యగా పరిగణించి కేంద్రం పరిష్కరించాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతులంతా సంఘటితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply