తెలంగాణలో కొరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయనీ, టెస్ట్‌ల సంఖ్య పెంచాలని అందరూ సూచిస్తున్నారు. . ఒక్క తెలంగాణయే కాకుండా గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల స్వయంగా ప్రస్తావించారు.. ఇదే మాటను తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా అన్నారు. దీంట్లో తప్పేమీ లేదు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాష్ట్రంలో కొరోనా తీవ్రతను సక్రమంగా అంచనా వేయలేకపోతున్నదనిన్నారు. గవర్నర్ రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుని, దానిని సరిచూసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికివొస్తారు, కేంద్రం కోరితే ఆ సమాచారాన్నే అందజేస్తారు. ఇది ఏ గవర్నర్ అయినా చేసే పనే. అయితే, తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస నాయకులకు ఇది తప్పుగాతోచింది.తమిళి సై ఒక గవర్నర్‌గా కాకుండా బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారంటూ తెరాస ఎమ్మెల్యే చేసిన ఆరోపణపై భారతీయ మహిళా మోర్ఛా భగ్గుమంది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద గురువారం ప్రదర్శన నిర్వహించింది., బిజెపి నాయకుడు డా. కె. లక్ష్మణ్ రాష్ట్రంలో ప్రజల గొంతును గవర్నర్ వినిపించారని అభినందిస్తూ గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమవుతోందనీ, ఈ విషయాన్ని తాము ప్రస్తావిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి తమపై ఎదురు దాడి చేస్తోందని ఆయన అన్నారు. ఇదొక్కటే కాదు., కొరోనా కిట్లు,, మాస్క్‌లు, గ్లౌజ్‌ల విషయంలో కూడా ప్రభుత్వ దవాఖానాల్లో యథార్ధ పరిస్థితిని గురించి మాట్లాడే వారిపై అధికార పార్టీ నాయకులు విరుచుకుని పడుతున్నారు. ఇప్పుడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై తెరాస ప్రభుత్వం ఆచి చూచి వ్యవహరిస్తోంది. అయితే, దిగువ స్థాయి నాయకులు మాత్రం గవర్నర్ కి ఉద్దేశ్యాలు ఆపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు. తమిళి సై గవర్నర్ పదవిని చేపట్టక ముందు వైద్యురాలు.. వైద్య రంగంలో విశేష అనుభవం ఉన్న ఆమె సలహాలను కొరోనాని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఉండాల్సింది. ప్రస్తుత సమస్య ప్రజల ఆరోగ్యానికి సంబంధించినది, రాజకీయాలతో సంబంధం లేదు. కానీ, దురదృష్టం తెలుగు రాష్ట్రాల్లో కొరోనా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు ఎక్కువ చేయడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
తెలంగాణలో టెస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉంది కనుకనే, కేసుల సంఖ్య తక్కువ నమోదు అవుతున్నట్టుగా ప్రజలందరి నోట వినిపిస్తున్న మాట. తెరాస ప్రభుత్వం మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించిన వారే, టెస్ట్ ల విషయంలో వెనకబడి ఉన్నందుకు విమర్శిస్తున్నారు. అందువల్ల అధికారంలోఉన్న వారు ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. గవర్నర్ నిజం మాట్లాడితే తెరాస నాయకులు నిష్టూరం వేస్తున్నారనీ, ఈ సమస్యను రాజకీయం చేయదల్చుకుంటే తమ పార్టీ ఏనాడో ఘాటుగా స్పందించి ఉండేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పది మంది మరణానికి కారణమైన ఒక హోటల్ లో అగ్నిప్రమాద సంఘటనపై తెలుగు దేశం నాయకులు కూడా రాజకీయం చేస్తున్నారు. ఆ హోటల్ ను లీజుకు తీసుకున్న హాస్పిటల్ యజమాని పై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెట్టిందంటూ తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో కొరోనా పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ప్రశంసలు అందించాయి. అక్కడ కొరోనా ప్రారంభ సమయంలో ఒక్క లాబ్ కూడా లేదు. ఇప్పుడు పదమూడు జిల్లాల్లో ఉన్నాయి. అలాగే, మొబైల్ టెస్టింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రికవరీ రేటు ఎక్కువ ఉంది. అందుకే, కేసుల సంఖ్య పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. తమిళి సై గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడులో బీజేపీ నాయకురాలిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఒక్క ఆమె విషయంలోనే కాకుండా నరేంద్రమోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు గవర్నర్లుగా తమ పార్టీ మాజీ నాయకులనే నియమిస్తోంది. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరచూ విమర్శలు చేసేది. ఇప్పుడు తాను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది. కొరోనా ప్రారంభ దశలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రద్ధాసక్తులతో వ్యవహరించిన మాట నిజమే.అయితే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ఒక విధమైన నిర్లిప్తతా భావం నెలకొంది. కొరోనా చికిత్సలను రాష్ట్రం మొత్తానికి ఒకే హాస్పిటల్ లో నే కేంద్రీకరించడం సరికాదన్న విమర్శలు గతంలోనే వొచ్చాయి. వాటిని రాజకీయ దృష్టితో చూడకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కొరోనా కేసుల చికిత్సకు మరిన్ని హాస్పిటల్స్ ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది.దీనిని సహేతుకమైన దృష్టితోనే పరిశీలించాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేవని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొరోనా కేసులను వికేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుంది. కొరోనా కేసుల నమోదు, చికిత్సల విషయంలో రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. అందునా వైద్య రంగంలో ఉన్న వారు తమ అమూల్యమైన సలహాలను అందించడం వాంఛనీయం. తమిళి సై• ఒక వైద్యురాలిగా సలహా ఇచ్చినట్టు తెరాస నాయకులు భావించాలి. రాజకీయ పరమైన దాడి చేయడం వాంఛనీయం కాదు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇలాంటి సమయాల్లో సంయమనాన్ని పాటించాలి,. కొరోనా వైద్యాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు.ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది.