Take a fresh look at your lifestyle.

కొండ నాలుకకు మందు వేస్తే ..!

“ఇకమీదట ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి వోటుకు ఆరు వేల కన్నా తక్కువ పంచితే ప్రయోజనం ఉండదు. 119 స్థానాలకూ ఎన్నికలు జరిగేప్పుడు కెసిఆర్‌ అం‌త డబ్బు తీసుకురాగలరా.. తెచ్చినా ఖర్చు చేయగలరా..! గెలిచే అవకాశాలు తక్కువ కనబడుతున్నపుడు ఎంత డబ్బని పెడతారు.. పెడతారా లేక..ఆ పై వచ్చే ఎన్నికలలో తానో తన కుమారుడో ఖర్చు చేసుకోవచ్చులే అని దాస్తారా..? హుజూరాబాద్‌ ‌పుణ్యమా అని కెటిఆర్‌ ‌పట్టాభిషేకం ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడ్డట్టే. హుజూరాబాద్‌ ‌ఫలితం ఏ విధంగా చూసినా కొండ నాలుకకు మందు సామెత అని అన్నది అందుకనే..”

హుజూరాబాద్‌ ‌లో జరిగిన శృంగభంగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏ ‌విధంగా సమర్ధించుకుంటారు.. ఈ ప్రశ్నకు మనకు ఇప్పటికిప్పుడు సమాధానం దొరకకపోవచ్చు.. దొరికినా కెసిఆర్‌ ‌దానిని రేపు వమ్ము చేయవచ్చు..తన చాతుర్యంతో..! కానీ ఈసారికి కెసిఆర్‌ ‌వాక్చాతుర్యం మన ఆంచనాలను వమ్ము చేయడానికి తప్ప ఎందుకూ పనికి రాదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ ఏడేళ్ల పైచిలుకు కాలంలో కెసిఆర్‌ ఇం‌త దెబ్బ..దిమ్మ తిరిగే దెబ్బ.. ఎప్పుడూ తినలేదు. అది కూడా పూర్తిగా తన స్వయంకృతం. ఎవరి ప్రమేయం లేదు. తెలుగులో ఒక సామెత ఉంది.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అని. హుజూరాబాద్‌ ‌లో అధికారపక్షానికి ఎదురయిన ఫలితానికి అన్ని రకాలుగా ఆ సామెత సరిపోతుంది. నిజానికి కెసిఆర్‌ ‌తన అహంకారంతో ఈ స్థితి తెచ్చిపెట్టుకున్నారు.

ఈటల రాజేందర్‌ ‌పై ఆయన కక్ష కట్టక్కర్లేదు.. కానీ కట్టారు. 2018 ముందస్తు ఎన్నికలకు ముందే రాజేందర్‌ ‌కు కెసిఆర్‌ ‌సెగ తగలడం మొదలయింది. రాజేందర్‌ ‌నర్మగర్భంగా మాట్లాడడమూ మొదలయింది. 2018 ఎన్నికలలో రాజేందర్‌ ‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కౌశిక్‌ ‌రెడ్డి కి కెసిఆర్‌ ‌నుంచి పరోక్షంగా మద్దతు దొరికిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనను వోడించేందుకు కౌశిక్‌ ‌రెడ్డికి కెసిఆర్‌ ‌నుంచి ఆర్ధిక సహాయం అందిందని ఈటల రాజేందర్‌ ‌భావించారు. ఏమయినా గానీ రాజేందర్‌ ‌వోడిపోలేదు. దానితో కెసిఆర్‌ ‌లో పంతం పెరిగింది. రాజేందర్‌ ‌ను మంత్రిమండలిలోకి తీసుకోరాదని భావించారు. చివరి నిముషం వరకూ మంత్రుల జాబితాలో రాజేందర్‌ ‌పేరు లేదు. నష్టం జరుగుతుందని మేనల్లుడు హరీష్‌ ‌రావు సహా కొందరు సన్నిహితులు నచ్చజెప్పడంతో చివరి నిముషంలో రాజేందర్‌ ‌కు పిలుపు వెళ్లింది. రాజేందర్‌ ‌కు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం దొరకలేదు. కొరోనా మహమ్మారి వచ్చింది. సంబంధిత శాఖ చూస్తున్న రాజేందర్‌ ‌కు మద్దతు మాత్రం దొరకలేదు. నిధులు కూడా రాలేదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే జాప్యం తర్వాత నిధులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎపాయింట్‌ ‌మెంట్‌ ‌దుర్లభమైపోయింది. రాజేందర్‌ ‌నోట నర్మగర్భంగా నయినా గానీ కాస్త పదునయిన మాటలే రావడం మొదలయింది. తన కుమారుడు కెటిఆర్‌ ‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తున్న కెసిఆర్‌ ఈటల రాజేందర్‌ ‌నుంచి అందుకు గట్టి వ్యతిరేకత రావచ్చని అనుమానించారు. దానాదీనా దారులు వేరయ్యాయి. ఇదంతా కూడా అధికారం నెత్తికెక్కితే వచ్చే ప్రమాదం. అదే జరిగి కెసిఆర్‌ ‌వాస్తవ పరిస్తితి ని గ్రహించే శక్తి కోల్పోయారు. ఆయన చుట్టూ ఉండే ఆ కొద్ది మంది కోటరీ సభ్యులు అది కాదు ఇది అని ఆయనకు చెప్పడం ఎప్పుడో మానేశారు. చెప్పి సిఎం కు దూరం అవడం ఎందుకు… తమ పనులు కూడా ఇబ్బందిలో పడతాయి కదా.. ఈ మధ్యలో ఏ దశలోనయినా ఈటలను ముఖ్యమంత్రి పిలిపించుకుని భుజం పై చేయి వేసి మన మధ్య విభేధాలు ఏమిటి రాజేందర్‌ అని ఒక్క మాట అంటే ఏ గొడవా ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి నెత్తికెక్కిన అధికారం ఆ పని చేయనిచ్చింది కాదు.

రాజేందర్‌ ‌మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు అన్యాయం జరిగిందని ప్రజలకు గట్టిగా చెప్పగలిగారు. రాజేందర్‌ ‌బయటకు వెళ్లిన తర్వాత కెసిఆర్‌ ఆయనపై కత్తి కట్టి చేసిన ప్రతి పనీ ఎదురు తిరిగింది. నిన్నటి వరకూ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తిపై ప్రభుత్వం పెట్టిన కేసులను ప్రజలు విశ్వసించలేకపోయారు. అప్పటి నుంచీ కెసిఆర్‌ ‌రాజేందర్‌ ‌ను మట్టి కరిపించాలని తప్పుమీద తప్పు చేయడం మొదలుపెట్టారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికను వెరీ వెరీ హైస్టేక్స్ ‌పోరాటంగా మార్చేశారు. ఒకసారి ఆ జారుడు మొదలుపెట్టిన తర్వాత ఇక వెనక్కి రావడం సాధ్యం కాదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికను మిగతా అన్ని ఎన్నికల లాగానే లైట్‌ ‌తీసుకుంటే కెసిఆర్‌ ‌కు ఇంత శృంగభంగం ఎదురయ్యేది కాదు. రాజేందర్‌ ‌గెలిచినా అది కెసిఆర్‌ ‌కు వ్యక్తిత పరాజయం కింద లెక్కకు వచ్చేది కాదు. ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో కూడా తెలియక ముందే హుజూరాబాద్‌ ‌గ్రామాల్లో చిన్నా పెద్దా నాయకులకు ఆకర్షణలు మొదలయ్యాయి. వరసగా కొనుగోళ్లు ప్రారంభించారు. దళిత బంధు పధకం ప్రకటించారు. ఉపఎన్నిక జరగనున్న చోట అలాంటి పధకం ఎలా ప్రవేశపెడతారన్న విమర్శ వచ్చినపుడు, మేమేమీ సన్యాసులం కాదు.. గెలవడం కోసం అక్కడే ప్రవేశపెడతాం అని కెసిఆర్‌ ‌కుండ బద్దలు కొట్టారు. ఏ దళితులను ఉద్దేశించి ఈ పధకం ప్రకటించారో వారికి కూడా ఇది నచ్చలేదు. ఒక్క దళితులకు ఇలాంటి పధకం ప్రవేశపెడితే సరి పోతుందా.. మాకేమీ అక్కర్లేదా అని బీసీలు కూడా అనుకొని ఉండొచ్చు. వారు ఎటూ ముందు నుంచే రాజేందర్‌ ‌తోనే ఉన్నారనుకోండి. కుమారుడి పట్టాభిషేకానికి అడ్డం వస్తాడనుకొని దూరం పెట్టిన హరీష్‌ ‌రావును హుజూరాబాద్‌ ‌ప్రచారానికి పంపడం కూడా ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. కెటిఆర్‌ ‌ను హుజూరాబాద్‌ ‌కు దూరంగా ఉంచడం..మేనల్లుడిని పంపించడంలోని అంతరార్ధం అర్ధం చేసుకోలేని వారు ఎవరూ లేరు ఇవాళ. అది కూడా ప్రతికూలంగా పరిణమించి ఉండచ్చు.

ఫైనల్‌ ‌గా వోటుకు ఆరు వేలు చొప్పున పంచడం కూడా కెసిఆర్‌ ‌కు ఎదురు తిరిగింది. ఒకపక్క అన్యాయంగా బయటకు పంపడం.. ఆపై వోడించడం కోసం ఇంత డబ్బు బయటకు తీయడం.. ఇదేం తీరు అన్న మీమాంస మొదలయింది. రాజేందర్‌ ‌ను గెలిపించాలి అన్న ప్రజల నిర్ణయాన్ని ఈ ఖర్చు మార్చలేకపోయింది సరికదా.. ఎంతో కొంత గట్టిపరిచింది. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలుపు దొరకలేదు కాబట్టి ఇకపై ఎన్నికలలో డబ్బు ఖర్చుపై హుజూరాబాద్‌ ‌ఫలితం ప్రభావం చూపుతుందని కొందరు ఆశాజీవులు భావిస్తున్నారు. అలాగే జరగాలని లేదు. ఎన్నికలలో డబ్బు ఖర్చు ఇప్పుటికిప్పుడు తగ్గే అవకాశం లేదు. హుజూరాబాద్‌ ‌ద్వారా కెసిఆర్‌ ‌తనకు తాను భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం తెచ్చిపెట్టుకున్నారు. ఇకమీదట ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి వోటుకు ఆరు వేల కన్నా తక్కువ పంచితే ప్రయోజనం ఉండదు. 119 స్థానాలకూ ఎన్నికలు జరిగేప్పుడు కెసిఆర్‌ అం‌త డబ్బు తీసుకురాగలరా.. తెచ్చినా ఖర్చు చేయగలరా..! గెలిచే అవకాశాలు తక్కువ కనబడుతున్నపుడు ఎంత డబ్బని పెడతారు.. పెడతారా లేక..ఆ పై వచ్చే ఎన్నికలలో తానో తన కుమారుడో ఖర్చు చేసుకోవచ్చులే అని దాస్తారా..? హుజూరాబాద్‌ ‌పుణ్యమా అని కెటిఆర్‌ ‌పట్టాభిషేకం ప్రస్తుతానికి నిరవధికంగా వాయిదా పడ్డట్టే. హుజూరాబాద్‌ ‌ఫలితం ఏ విధంగా చూసినా కొండ నాలుకకు మందు సామెత అని అన్నది అందుకనే..!

గెస్ట్ ఎడిట్‌
ఆలపాటి సురేశ్‌ ‌కుమార్‌

Leave a Reply