Take a fresh look at your lifestyle.

‌పొలిటికల్‌ ‌వార్‌

పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయలను కుదిపేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అరెస్టుతో ఆ పార్టీ- అధికార పార్టీల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. సంజయ్‌తోపాటు మరికొందరు బిజెపి ప్రధాన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, సంజయ్‌తో పాటు నలుగురిని వరంగల్‌ ‌నలుగురిని అరెస్టు  చేశారు. కాగా సంజయ్‌ను వరంగల్‌ ‌కోర్టుకు తరలించడం ఉద్రిక్తంగా మారింది. కేసుకు సంబంధించి  మరో  నలుగురు అబ్‌స్కాండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు. బుధవారం కోర్టుకు సెలవు కావడంతో ప్రత్యేక అనుమతితో ఫ్లస్ట్‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌  ‌నివాసంలో  వీరిని హాజరు పర్చారు.

న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రవేశపెట్టిన ఎఫ్‌ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏ1 గా పేర్కొనడం పెద్ద సంచలనమైంది. ఈ కుట్రకు ఆయనే మూలకారకుడిగా పోలీసులు తెలుపుతున్నారు. సంజయ్‌ అరెస్టుపై ఆగ్రహించిన బిజెపీ పార్టీ శ్రేణులంతా రోడ్లమీదకు రావడంతో  హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేసినప్పటినుండీ ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నది కుటుంబ సభ్యులతోసహా బిజెపి శ్రేణులకు, వారి న్యాయవాదులకు కూడా సమాచారం లేదు.  బుధవారం వరంగల్‌కోర్టులో జడ్జిముందు హాజరు పర్చేవరకు వివిధ ప్రాంతాలు  తిప్పుతుండడంతో పార్టీ కార్యకర్తలుకూడా ఎక్కడికక్కడ పోలీసు వ్యాన్‌లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రవేశపెడుతున్న క్రమంలో బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు బండి ఉన్న వాహనపైన చెప్పులు, కోడిగుడ్లు విసురుతూ ఆయనకు వ్యతిరేక నినాదాలు చేయడంతో కాసేపు వాతావరణం  ఉద్రిక్తంగా మారింది.

ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దిల్లీ  స్థాయిలో ప్రకంపనలు లేపుతోంది. బండి సంజయ్‌ ‌కేవలం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా పార్లమెంటు సభ్యుడు కూడా కావడంతో ఆయన అరెస్టు పట్ల బిజెపి పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దీనిపై పార్లమెంట్‌ ‌స్పీకర్‌ ఓం ‌బిర్లాను కలిసి అక్రమ అరెస్టుపై స్పందించాల్సిందిగా కోరారు. కాగా, బిజేపి కేంద్ర నాయకత్వంకూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నాయకులతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌చర్చిస్తున్నారు. ఈనెల ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వొస్తున్న క్రమంలోనే వెలుగుచూసిన ఈ ఎపిసోడ్‌ ఆ ‌పార్టీ వర్గాలను కుదిపేస్తున్నది. ఒక వైపు టిఎస్‌పీఎస్‌పి  పేపర్ల లీకేజీ, పదవతరగతి ప్రశ్నాపత్రాలు బయటపడటం, మరో పక్క  దిల్లీ లిక్కర్‌ ‌కేసు లాంటివి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేవిగా ఉండటంతో వీటిపైన ఎనిమిదవ తేదీన ప్రధాని ఘాటుగా విమర్శించే అవకాశాలున్నాయనుకున్నారు.

కాని, పరిస్థితి తారుమారు అయింది. ఆరోపణలు ఇప్పుడు బిజెపి మెడకు చుట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చే విధంగా బిజెపి రాష్ట్ర శాఖ ఒక పథకం ప్రకారం పదవ తరగతి ప్రశ్నాపత్రాలను లీక్‌ ‌చేసిన విషయం తమ విచారణలో  తెలిసినట్లు పోలీసులు చెబుతున్నారు.  కీలక పాత్ర పోషించిన ప్రశాంత్‌కు బండి సంజయ్‌కి మధ్య ఈ పేపర్‌ ‌విషయంలో వాట్సప్‌ ‌లో మాటలు జరిగాయని, బండి సంజయ్‌ ‌తన ఫోన్‌ను ఇవ్వడానికి నిరాకరించారుకాని, దానితో మరిన్ని వాస్తవాలు బయటికి వొచ్చే అవకాశాలున్నాయని వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. సాంకేతిక నిపుణులతో వాటిని వెలికితీయాల్సి ఉండగా బండి సంజయ్‌ ‌వాట్సప్‌ ‌మెసేజస్‌లను డిలీట్‌ ‌చేసినట్లు తెలుస్తున్నదన్నారు.  సంజయ్‌ అరెస్టు విషయాన్ని పార్లమెంట్‌ ‌స్పీకర్‌కు తెలియజేసినట్లు కూడా సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.  ఏదిమేమైన విద్యార్ధుల భవిష్యత్‌తో రాజకీయ పార్టీలు క్రీడలు ఆడటాన్ని  విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు పార్టీలవరకే పరిమితం కావాలికాని ప్రజ)కు అభద్రతా భావాన్ని కలిగించేవిగా  ఉండరాదని, దాని వల్ల రాష్ట్ర ఎదుగుదలకు తీవ్ర ఆవరోధం ఏర్పడుతుందని వారంటున్నారు.

Leave a Reply