Take a fresh look at your lifestyle.

మధ్యప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం

  • కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వానికి భారీ కుదుపు
  • కాంగ్రెస్‌కు సీనియర్‌ ‌నేత జ్యోతిరాదిత్య సింధియా గుడ్‌బై
  • ప్రధాని మోడీ,అమిత్‌షాలతో భేటీ
  • బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం
  • సోనియా అధ్యక్షతన అత్యవసరంగా కాంగ్రెస్‌ ‌నేతల భేటీ
  • పార్టీ నుంచి జ్యోతిరాదిత్య సస్పెన్షన్‌
  • ‌కమల్‌నాథ్‌ ‌సర్కార్‌ ‌కుప్పకూలడం ఖాయం అంటున్న విశ్లేషకులు
  • భోపాల్‌లో పరిస్థితిని సక్షిస్తున్న బిజెపి సీనియర్‌ ‌నేతలు

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సంక్షోభంలో పడింది. 17మంది ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ ‌నేత జ్యోతిరాదిత్య సింధియా జారుకోవడంతో అక్కడ మళ్లీ బిజెపి హస్తగతం అయ్యేలా పరిణామాలు వేగంగా మారాయి. కమలం దెబ్బకు కమల్‌నాథ్‌ ‌గద్దె దిగి…కమలనాధులు గద్దెనెక్కేలా వేగంగా పావులు కదుపుతున్నారు. బొటాబొటి మెజార్టీతో పాలన సాగిస్తున్న కమల్‌నాథ్‌ ‌తన స్వయంకృతాపరాథం..ఒంటెత్తు పోకడలతో ప్రభుత్వాన్ని చేజార్చుకోబోతున్నారు. మాధవరావు సింధియా తనయుడు, కాంగ్రెస్‌ ‌యువనేత జ్యోతిరాదిత్య సింధియా అనూహ్యంగా బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ, హోంమత్రి అమిత్‌షాలతో చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా సమర్పించారు. మొత్తంగా సోమవారం నుంచి మధ్యప్రదేశ్‌ ‌రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారం నుంచి గద్దె దించడానికి రంగం సిద్ధమైంది. కర్ణాటక తరహా రాజకీయాలకు మధ్యప్రదేశ్‌ ‌బీజేపీ తెరతీసింది.

సీఎం పదవి తనకు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ విజయవంతంగా తమ వైపు తిప్పుకుంది. మంగళవారం ఉదయం ప్రధాని మోదీతో జ్యోతిరాదిత్యసింధియా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా దగ్గరుండి ఆయనను మోదీ వద్దకు తీసుకెళ్లారు. మరోవైపు పరిణామాలపై సోనియా నేతృత్వంలో సీనియర్‌ ‌నేతలు ఢిల్లీలో అత్యవసర సమావేశంలో చర్చించారు. సింధియాను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీలో సింధియా చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వీరు రాజీనామా చేస్తూ కమల్‌ ‌నాథ్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూలిపోతుంది.దీంతో అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు బిజెపి రంగం సిద్దం చేస్తోంది.

అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్‌ ‌షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమవా రం అర్ధరాత్రి నుంచి మొదలైన హైడ్రామా ఇంకా కొనసాగు తూనే ఉంది. జ్యోతిరాదిత్య సింధియాకు కనీసం11 మంది ఎమ్మెల్యే మద్దతుంది. ఆరుగురు మంత్రులూ ఆయన వెంటు న్నారు. వారితో కలసి సింధియా బీజేపీలో చేరితే కమలానికే అధికారమొస్తుంది. ఒకవేళ అసమ్మతి ఎమ్మెల్యేలను సస్పెం డ్‌ ‌చేసినా సభలో బలం తగ్గుతుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సిద్ధమైంది. అంటే… సరైన బలం లేక ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంలాగే కనిపిస్తోంది. సింధియాను ఒప్పించి అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంగ్రెస్‌ ‌ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ఎత్తులకు ముందే బిజెపి పైఎత్తులు వేయడంతో ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేసేశారు. కమల్‌నాథ్‌ ‌ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేదీలేదని,. కమల్‌ ‌నాథ్‌ ‌ప్రభుత్వం కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ప్రదర్శించినా, బీజేపీ వ్యూహలను తట్టుకోవడం కాంగ్రెస్‌ ‌వల్ల కావడం లేదు. నిజానికి, మధ్యప్రదేశ్‌ ‌లో బీజేపీదే పైచేయి. మహారాష్ట్ర భంగపాటు క్లళెదురుగా ఉంది కాబట్టి, ఇంకోసారి పరువుపోకుండానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే అమిత్‌ ‌షా, సింధియాను మోడీ దగ్గరకు తీసుకెళ్లారు.

తండ్రి జయంతి రోజే సింధియా కొత్త నిర్ణయం:
మధ్యప్రదేశ్‌లో బలాబలాలను పరిశీలిస్తే మొత్తం సీట్లు 228 ఉండగా అందులో కాంగ్రెస్‌ ‌బలం 114 సీట్లు. నిజానికి మొత్తం అసెంబ్లీ సీట్లు 230. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో సీట్ల సంఖ్య 228కి తగ్గిపోయింది. కాంగ్రెస్‌కు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బిఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యే మద్దతుంది. బీజేపీకి ఉన్న బలం 109 సీట్లు. మంగళవారమే జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మధవరావు 75వ జయంతి. కాంగ్రెస్‌ ‌పార్టీలో తండ్రి కీలక నేతగానే కాకుండా చాలాకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ ఆయన గురించి గొప్పగానే చెప్పుకొంటోంది. అలాంటిది ఆయన జయంతి రోజునే కొడుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు. మరోవైపు బీజేపీ భోపాల్‌లో సమావేశమై అన్నిలెక్కలు సరిగా వేసుకొంటోంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని తాము కూల్చినట్లు కాకుండా, అంతర్గత కుమ్ములాటల వల్లే కుప్పకూలినట్లు ఎత్తుగడలు వేస్తున్నారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమార్‌, ‌మాజీ సిఎం శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ అక్కడే ఉండి అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఇంతకు ముందే హోంమంత్రి అమిత్‌ ‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, ‌మాజీ సిఎం శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌లను కలిశారు. ఇకపోతే ఈ పరిణామాలకు ముందే జ్యోతిరాధిత్య అనుచరులైన 17 మంది ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా అదృశ్యమయ్యారు. జ్యోతిరాధిత్య సింధియా ఆ 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రంలోని ఓ స్టార్‌ ‌హోటల్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య కూడా కాంగ్రెస్‌ ‌నేతలకు ఎవరికీ అందుబాటులో లేరు. అతని ఫోన్‌ ‌స్విచాఫ్‌ ‌చేసి ఉంది. అతనికి స్వైన్‌ ‌ప్లూ వచ్చినట్టు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌వ్యంగ్యంగా చెప్పారు. ఆ 17 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్‌ ‌వీడినున్నట్టు తెలుస్తోంది. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. వారంతా తమ పదవులకు రాజీనామాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.

పావులు కదుపుతున్న బిజెపి నేతలు:
మరో వైపు మంగళవారం సాయంతం 6 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌, ‌జ్యోతిరాధిత్య సింధియాల నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు గల మధ్యప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీకి 114 మంది, బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 116 మంది ఎమ్మెల్యేలు అవసరం కావడంతో బీఎస్పీ నుంచి ఒకరు, ఎస్పీ కి చెందిన ఒకరు, మరో నలుగురు ఇండిపెండెంట్‌ ‌సభ్యుల మద్దతు తీసుకొని మొత్తం 120 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను స్పీకర్‌ ‌కు పంపారు. అయితే ఇప్పుడు 17 మంది కూడా రాజీనామా చేస్తే ఆ పార్టీ బలం 107 కు పడిపోతుంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభమవుతుంది. దీనిపై బీజేపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌స్పందింస్తూ అది కాంగ్రెస్‌ అం‌తర్గత విషయమని, దాని గురించి తానేమి మాట్లాడనని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని తమకు లేదన్నారు.

బీజేపీ నేత నరోత్తమ్‌ ‌మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ లోకి వస్తే సాధరంగా ఆహ్వా నిస్తామని చెప్పారు. సింథియా పెద్ద నాయకుడు. ఆయన తమ పార్టీలో చేరితే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. మరో వైపు జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు సెంటిమెంట్‌ ‌ను ప్లే చేసినప్పటికీ సక్సెస్‌ ‌కాలేదు. మంగళవారం రోజే జ్యోతిరాధిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా జయంతి. మాధవరావ్‌ ‌సింధియా 9 సార్లు ఎంపీగా చేశారు. శతాబ్ది ఎక్స్ ‌ప్రెస్‌ ‌మొదటి సారిగా ప్రారంభించింది కూడా మాధవ్‌ ‌రావ్‌ ‌సింధియానే. ఆయన పార్టీకి, దేశాని ఎంతో సేవ చేశారంటూ కొనియాడుతూ సోషల్‌ ‌డియా ట్విట్టర్‌ ‌లో ట్వీట్లు పెట్టారు.తండ్రి జయంతి రోజు ఆయన ఆశయాలకు విరుద్ధంగా జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ చేరడం సరికాదన్నట్టుగా సూచనలు చేశారు.

Leave a Reply