Take a fresh look at your lifestyle.

లేడీ బాస్‌ ‌కూ తప్పని రాజకీయ ఒత్తిడులు

గవర్నర్‌, ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పదవులకు రాజకీయ నాయకులను నియమించడం, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిర పర్చేందుకు వారి సేవలను వినియోగించుకోవడం కాంగ్రెస్‌ ‌సంస్కృతి అని భారతీయ జనసంఘ్‌, ఆ ‌తర్వాత బీజేపీ పదే పదే ఎద్దేవా చేసేవి. తాము అధికారంలోకి వొస్తే రాజకీయ నిరుద్యోగులను గవర్నర్‌ ‌పదవులకు నియమించబోమని స్పష్టం చేసేవి.అయితే, అధికారంలోకి వొచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా కాంగ్రెస్‌ ‌సంస్కృతినే అనుసరిస్తోంది. ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికి వారిపై అక్రమంగా కేసులను బనాయించడం, పర్యావరణ కార్యకర్తలు,హక్కుల ఉద్యమ కారులపై అక్రమ కేసులు పెట్టడంలో బీజేపీ కాంగ్రెస్‌ ‌ను మించి పోయింది.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు సాగిస్తున్న ఆందోళనను సమర్ధిస్తున్నందుకు దిశా రవి అనే హక్కుల ఉద్యమ కార్యకర్తను అరెస్టు చేసింది ఈ కోణంలోనే. నిజానికి ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి సమాచారాన్ని ప్రత్యర్ధులకు అందించలేదు.అలాగే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదు.అయినా ఆమెపైనా, ఇతర హక్కుల ఉద్యమకారులపైనా కేసులు నమోదు చేశారు. అలాగే, ఇప్పుడు ఉన్నపళంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌కిరణ్‌ ‌బేడీని తప్పించి,ఆ పదవిని తెలంగాణ గవర్నర్‌ ‌తమిళ సైకి అదనపు బాధ్యతగా అప్పగించడం వెనుక కూడా రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేడీ బాస్‌ అనే పేరు సంపాదించుకున్న కిరణ్‌ ‌బేడీ దేశంలో అత్యుత్తమ పోలీసు అధికారిగా పేరొందారు . ఎటువంటి ఒత్తిడులు, మొహమాటాలకూ లొంగకుండా ముక్కుకు సూటిగా వ్యవహరించడం ఆమెకు అలవాటు ఆమె పాత్రపై తెలుగు సహా పలు భాషల్లో సినిమాలు కూడా వొచ్చాయి. లేడీ బాస్‌ ‌సినిమా విజయశాంతికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

దేశంలో రుజువర్తన గల అధికారిణుల్లో ఆమె అగ్రస్థానాన్ని సంపాదించుకున్నారు.రాజకీయాలతో సంబంధం లేని ఆమె అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్‌ ‌సారథి కేజ్రీవాల్‌, ‌మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంతోష్‌ ‌హెగ్డే వంటి వారితో కలిసి పని చేశారు. రాజకీయాల్లో అడుగు పెట్టినా ఆమె రుజువర్తనానికి భిన్నంగా ఎన్నడూ వ్యవహరించలేదు. ఆమెను పుదుచ్చేరి గవర్నర్‌ ‌గా నియమించింది మోడీ ప్రభుత్వమే.ఇప్పుడు తొలగించింది కూడా మోడీ ప్రభుత్వమే. పుదుచ్చేరిలో నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌సంకీర్ణ ప్రభుత్వంపై చాడీలు చెప్పేందుకు, ఆ ప్రభుత్వం నేరాల చిఠాను తయారు చేసి పంపేందుకు ఆమెను మోడీ నియమించారు.అయితే, ఆమె ఐపీఎస్‌ అధికారిణిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తి కావడం వల్ల కేంద్రం అప్పచెప్పిన పనుల కన్నా ఇంకా ఎక్కువగా చొరవ ప్రదర్శించారు.అది రాజకీయపార్టీలకు కంటగింపు అయింది. పుదుచ్చేరిలో గతంలో ముఖ్యమంత్రి గా పని చేసిన రంగస్వామి సొంత పార్టీ ఎన్‌ ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

- Advertisement -

తమిళనాడులో అడుగు పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు సాగించినా ఫలించని నేపధ్యంలో బీజేపీ కనీసం పుదుచ్చేరిలోనైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.ఈ నేపధ్యంలో రంగస్వామి పార్టీతో పాటు మరి కొన్ని స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పార్టీలన్నింటికీ కిరణ్‌ ‌బేడీ సింహస్వప్నం వంటిది.అందుకని ఆమెను తొలగిస్తేనే బీజేపీతో పొత్తు సాధ్యమని రంగస్వామి సూటిగా స్పష్టం చేశారు. రంగస్వామి ఒకప్పుడు కాంగ్రెస్‌ ‌వాది. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్‌ ‌కు పెట్టని కోటగా ఉండేవారు. కానీ, అప్పట్లో అంటే, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో పిఎంఓ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి అతి జోక్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌ను వీడి సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. ఆయనను పుదుచ్చేరి కామరాజ్‌ ‌గా పిలుస్తారు.

ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా పేరొందారు. అయితే, నారాయణ స్వామి కేంద్రంలో ప్రధానమంత్రి కార్యాలయం వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారాలను చెలాయించారు. ఆ జోరులో ఆయన పుదుచ్చేరి ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకునే వారు. దాంతో రంగస్వామి పార్టీని వీడాల్సి వొచ్చింది. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీలో చిరకాలం విధేయునిగానే వ్యవహరించారు. ఇప్పుడు ఆయనను తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆయన పెట్టిన షరతుకు తలొగ్గి కిరణ్‌ ‌బేడీని కేంద్రం తొలగించిందంటూ వొచ్చిన వార్తలు నిరాధారం కాదు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌గా నవాబ్‌ ‌జంగ్‌ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ‌కి వ్యతిరేకంగా జంగ్‌ ‌ను కాంగ్రెస్‌ ఇలాగే ముందుకు తోసేది. జంగ్‌, ‌కేజ్రీవాల్‌ ‌ల మధ్య తగవులకు కాంగ్రెస్‌ ‌కారణం.

ఇప్పుడు కిరణ్‌ ‌బేడీ, ముఖ్యమంత్రి నారాయణ స్వామిల మధ్య తగాదాలకు బీజేపీయే కారణం. బిజేపీ ప్రలోభ పర్చడం వల్లనే నలుగురు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటులో లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌సహకారం అవసరం కనుక, బీజేపీకి అనుకూలంగా ఉండే నాయకుడు లేదా నాయకురాలిని నియమించడం కోసం కిరణ్‌ ‌బేడీని తొలగించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ గవర్నర్‌ ‌తమిళ సై పూర్వాశ్రమంలో బీజేపీకి చెందిన వారే.ఆమె పైఇంతవరకూ ఫిర్యాదులేవీ రాలేదు. కేంద్రానికి అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు అందువల్ల పుదుచ్చేరి ఎన్నికలు అయ్యేవరకూ అదనపు బాధ్యతల్లో అమెను కొనసాగించే అవకాశం ఉంది.

Leave a Reply