Take a fresh look at your lifestyle.

భారత్‌ ‌బంద్‌కు సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ ‌మోర్చ ఈ నెల 27న ఇచ్చిన భారత్‌ ‌బంద్‌ను విజయవంతం చేసేందుకు బిజెపియేతర రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో దాదాపు ఇరవైకి పైగా రాజకీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించగా మరికొన్ని పార్టీలు, ఇతర సంస్థలు, సంఘాలు అందుకు తామూ సిద్ధమేనని ప్రకటిస్తున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతనంగా తీసుకొచ్చిన మూడు  చట్టాల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే.

గత సంవత్సరం నవంబర్‌ ‌నుండి దేశ రాజధాని డిల్లీ పరిసర ప్రాంతాల్లో వేలాది సంఖ్యలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  ఎండ, వాన, చలి అనక, ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొరోనా ప్రబలినా  వారు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకు దశల వారిగా అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ జరిగింది మాత్రం శూన్యం.

కేంద్ర ప్రభుత్వం కూడా చర్చల పేర దాదాపు పదకొండు సార్లు రైతు నాయకులతో సమావేశాలు జరిపినా అవి ఫలవంతం కాలేదు. ఇదిలా ఉంటే రైతుల ఆందోళనకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తున్నది.  గత తొమ్మిది నెలలుగా తెగని అంశంగా తయ్యారైన ఈ సమస్యపై కేంద్రపై వత్తిడి తెచ్చేందుకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చ తాజాగా భారత్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చింది. దాదాపు ఇరవై రోజుల ముందుగానే తీసుకున్న ఈ నిర్ణయంలో 75 రైతు సంఘాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్‌, ‌సిపిఐలతో పాటు భారతీయ జనతాపార్టీని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర, జాతీయ పార్టీలన్నీ ఇప్పటికే మద్దతును ప్రకటించాయి ఏఐకెఎస్‌, ఏఐటియుసి లాంటి లెఫ్ట్ ‌పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. కాగా కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న మరికొన్ని రాజకీయ పార్టీలను కూడా మద్దతివ్వాల్సిందిగా రైతు సంఘాలు కోరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇప్పటికే ఏపి అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలకు విజ్ఞప్తి చేశారు కూడా. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ను కూడా భారత్‌ ‌బంద్‌కు మద్దతివ్వాల్సిందిగా రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు కోరుతున్నాయి. కాగా కాంగ్రెస్‌ ‌మాత్రం ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నది. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి దొందూ దొందే నంటున్నాయి. కేంద్రం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మద్దతు ప్రకటించడాన్ని ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ఒక్క తాను ముక్కలేనంటూ, అటు మంత్రి కెటిఆర్‌, ఇటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు పైకి మాత్రమే విమర్శలు గాని రెండు పార్టీల ఆలోచనా దోరణి మాత్రం ఒకటేనంటూ విమర్శించడం చూస్తుంటే ఈ బంద్‌లో టిఆర్‌ఎస్‌ ‌కలిసి వొస్తుందా అన్నది సంశయంగానే మిగిలింది.

కాగా ఇండియన్‌ ‌జర్నలిస్టు యూనియన్‌(ఐజెయు) ఇతర ట్రేడ్‌ ‌యూనియన్‌లు, ముఖ్యంగా ఆలిండియా కిసాన్‌ ‌సంఘర్ష్ ‌లాంటి సంస్థలతో పాటు హైదరాబాద్‌ ‌క్యాబ్‌ ‌డ్రైవర్స్ అసోసియేషన్‌, ‌మహిళా సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తామిచ్చిన భారత్‌ ‌బంద్‌ ‌పిలుపును విజయవంతం చేయాల్సిందిగా సంయుక్త కిసాన్‌ ‌మోర్చ వివిధ సంస్థలు, సంఘాలకు విజ్ఞప్తి చేసింది. హాస్పిటళ్లు, అంబులెన్స్ ‌లాంటి ఎమర్జన్సీ సర్వీసులు మినహా పాఠశాలలు, కళాశాలలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్‌లు, దుకాణాలు, ఫ్యాక్టరీలు తదితర సంస్థలన్ని ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.  ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలవరకు ఈ బంద్‌ ‌కొనసాగుతుందని కూడా వారు ప్రకటించారు.

Leave a Reply