Take a fresh look at your lifestyle.

రామ మందిరంపై రాజకీయ విమర్శలు

(మండువ రవీందర్‌రావు)
అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటున్నది. హిందువులంతా పవిత్ర స్థలంగా భావించే రామజన్మభూమిలో ఈ నెల 22న  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మతగురువులు, పీఠాధిపతుల మధ్యకూడా ఈ విషయంలో సయోధ్య కనిపించడంలేదు. మందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రాణ ప్రతిష్ట క్రతువును నిర్వహించడం సరైందని పలువురు పీఠాధిపతులు అభిప్రాయపడుతుండగా, ప్రాణ ప్రతిష్ట తర్వాత కూడా ఆలయ నిర్మాణం చేసుకోవచ్చనడానికి పలు దృష్టాంతాలు ఉన్నాయని పండిట్‌ రవిశంకర్‌లాంటి వారు సూచిస్తున్నారు.  నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే సంప్రోక్షణ జరుగడమన్నది హిందూ ఆచారాలను పాటించకపోవడమేనని,  శాస్త్ర వ్యతిరేకంగా జరుగుతున్న ఈ క్రతువులో పాలుపంచుకోకూడదని మరికొందరు గురువుల ఆలోచన.  ఈ విషయంలో ప్రముఖ శంకరాచార్య పీఠాలకు చెందిన స్వాములు ఒకరిద్దరు అసహనం వ్యక్తంచేయగా, మరి కొందరు మౌనం వహించడం గమనార్హం.  అన్యమతస్థులు హిందుత్వంపై దాడులు జరుపుతున్న క్రమంలో  హిందువులు ఐక్యతను చాటిచెప్పాల్సిందిపోయి భేదాభిప్రాయాలను ప్రకటించడం సరైందికాదని, ఈ కార్యక్రయాన్ని విజయవంతం చేసేందుకు హిందువులంతా కలిసి రావాలని మరికొందరూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు.  కాగా రాబోయే లోకసభ ఎన్నికలకు రామ మందిరాన్ని  భారతీయ జనతాపార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి దీన్ని రాజకీయ ప్రాజెక్టుగా మారుస్తున్నారని భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇంఛార్జీ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేష్‌ చేసిన విమర్శ గమనార్హం.

రాముడిని రాజకీయంగా వాడుకుని ధర్మాన్ని బిజెపి దుర్వినియోగం చేస్తున్నదన్నది ఆయన ఆరోపణ. ఇంకా పూర్తిగాని మందిరాన్ని ప్రారంభించడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలన్నదే ఆ పార్టీ ఆలోచనగా ఉందంటారాయన. దానికి తగినట్లుగా అయోధ్య కార్యక్రమంతా బిజెపి ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లుగా ఉంది. మంగళవారం రాముడి విగ్రహాన్ని స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ గర్భగుడికి తీసుకువొచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. పూజా మండపం నుంచి గర్భగుడికి ప్రధాని మోదీయే విగ్రహాన్ని తీసుకురావడమన్నది ఈ కార్యక్రమంలోని దృశ్యం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌రాయ్‌ ప్రకారం ఈ కార్యక్రమంలో మోదీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌చంచాలక్‌ మోహన్‌ భగవత్‌, యుపి గవర్నర్‌ ఆనంద్‌బెన్‌ పటేల్‌, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు వేలాదిమంది సాధువులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ తాను నిష్టగా ఉండటంతోపాటు సంక్రాంతి నుండి దేశ వ్యాప్తంగా జ్యోతిని ప్రజ్వలింపజేయాలని, అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని  పిలుపునిచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బిజెపికి రాముడి మీదకన్నా హిందూ వోట్లపైనే ఎక్కువ ప్రేమ ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు విమర్శిస్తున్నారు. మందిర నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడంలేదని, రాముడిని రాజకీయాల్లోకి తీసుకురావద్దన్నదే తమ అభిప్రాయంగా ఆయన చెప్పుకొచ్చారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు రేణుకాచౌదరి కూడా రాముడిని బిజెపి ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నదన్నారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్నందున్నే ఆలయం పూర్తికాకున్నా హడావిడిగా ప్రాణప్రతిష్టా కార్యక్రమాన్ని బిజెపి చేపట్టిందంటూ, రాముడిని దర్శించుకోవడానికి బిజెపి నేతల అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరమంటారామె. కాగా హిందువులందరికీ చెందిన రాముడిని బిజెపి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.

ఇదిలా ఉంటే దేశ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి.  మరో రెండు నెలల్లో జరుగనున్న లోకసభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలన్నది ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యం. 2014 ఎన్నికల్లో అప్పటికే దశాబ్ధకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పట్ల వచ్చిన వ్యతిరేకత మోదీని ప్రధానిని చేసింది. ఆ తర్వాత 2019లో ఉగ్రవాద దాడులు, శత్రుదేశాలతో బిజెపి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వసనీయత పెరిగి మరోసారి అధికారాన్నిచ్చింది. ఈసారి 2024లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు.  అందుకు అయోధ్య అస్త్రాన్ని మోదీ ప్రయోగిస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. రామమందిర ప్రాణప్రతిష్ట ద్వారా హిందూ సెంటిమెంటును బిజెపి వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. మరో పార్టీపైన ఆధారపడకుండా మ్యాజిక్‌ ఫిగర్‌ 273 సీట్లను సాధించాలన్న లక్ష్యంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వేలాదిమందిని గ్రామాలకు పంపించి గత తొమ్మిదిన్నర ఏళ్ళకాలంగా బిజెపి చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే బృహత్కర కార్యక్రమానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రామాలయంతో హిందూ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నదంటున్నారు విశ్లేషకులు.

Leave a Reply