శివసేనకు ఏక్‌నాథ్ షిండే ఝలక్
21 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో క్యాంపు
ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటున్న విశ్లేషకులు
ముంబయి, జూన్ 21 : మహారాష్ట్రలో ఠాక్రే సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే21 మంది ఎమ్మెల్యేలనువెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్ నగరంలోని మెరీడియన్ హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రేప్రభుత్వంలో అలజడి మొదలైంది. సిఎం ఉద్ధవ్ ఠాక్రేకు సొంత పార్టీ శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే అతని అనుచర ఎమ్మెల్యేలు షాకిచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి షిండే, మరో 11 మంది ఎమ్మెల్యేలు ఠాక్రే సర్కారుకు అందుబాటులో లేరు. వారంతా ఠాక్రే సర్కారుపై తిరుగుబావుటా ఎగరేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారంతా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హౌటల్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతరాత్రి వీరంతా ఛార్టెడ్ విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో అఘాడీ సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలిలో 10 స్థానాలకు సోమవారం ఎన్నికలను నిర్వహించారు. ఇందులో అఘాడీ కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన రెండు, ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. విపక్ష బిజెపి సొంతంగా 5 స్థానాలలో విజయాన్ని సాధించింది. కాషాయ పార్టీకి నలుగురు అభ్యర్థులను గెలిపించుకోగల సంఖ్యా బలం మాత్రమే ఉన్నప్పటికీ.. అయిదుగురిని బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో బిజెపి సొంత బలం 106 కాగా.. 133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని కాషాయ పార్టీ ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థులు బిజెపికి మద్దతు తెలపడంతోపాటు అధికార కూటమికి చెందిన కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికల్లో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. వీరిలో ఏక్‌నాథ్ షిండే వర్గం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసస మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నిర్థారణ కావడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమాచారం చేరవేసే నిమిత్తం ఏక్‌నాథ్ షిండేను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఠాణెళిలో శివసేన ముఖ్య నేత అయిన షిండే.. ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు షిండే, మరో 11 మంది ఎమ్మెల్యేలు ఠాక్రే సర్కారుకు అందుబాటులో లేరు. షిండే బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా షిండే.. సంకీర్ణ ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అఘాడీ సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కన్పిస్తోంది. ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు.
పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోవడం లేదని, పక్కనపెడుతున్నారని షిండే భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆయనతోపాటు పల్ఘర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగా, అలీగర్ ఎమ్మెల్యే మహేంద్ర డల్వీ, భివండి రూరల్ ఎమ్మెల్యే శాంతారామ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు ’అన్‌రీచ్‌బుల్’ అని వస్తున్నాయి. ఈ పరిణామంపై ఎన్‌సీపీ ప్రతినిధి మహేష్ తపసే మాట్లాడుతూ.. మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉందన్నారు. ప్రతిపక్ష బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేనకు చెందిన 22 ఎమ్మెల్యేలతోపాటు 5 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ శివసేన నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న నారాయణ్ రాణె స్పందిస్తూ.. కారణం ఏంటో తెలియకుండా ఇలాంటి అంశాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాగా మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాకూటమి, విపక్ష బీజేపీ చెరో 5 సీట్లు గెలుచుకున్న గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ పోటీ చేసిన 5 చోట్లా విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ నేత, దళిత నాయకుడు చంద్రకాంత్ హండోర్ ఓటమి పాలవ్వడం అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. పరిస్థితులు చూస్తుంటే అధికారి శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ పార్టీకి ఇబ్బందులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.