Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌వ్యాఖ్యలపై రాజకీయ వివాదం

  • కోవిడ్‌ ‌నియంత్రణలో వైఫల్యం చెందిందనడంపై టీఆర్‌ఎస్‌ ఆ‌గ్రహం
    ఉన్న మాటంటే ఉలుకెందుకన్న బీజేపీ

తెలంగాణలో కొరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌చేసిన విమర్శలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. గవర్నర్‌ ‌వ్యాఖ్యలపై అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఉన్న మాటంటే ఉలుకెందుకనని బీజేపీ సమర్థించింది. రాష్ట్రంలో కొరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారనీ, దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని గవర్నర్‌ ‌తమిళిసై ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ ‌పరీక్షల సంఖ్య పెంచమని తాను స్వయంగా సీఎం కేసీఆర్‌కు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఖండించారు. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ తమిళిసై గవర్నర్‌గా కాకుండా బీజేపీ అధ్యక్షురాలిగా మాట్లాడారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ ‌ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి కాని విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

కొరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నదనీ, అయినప్పటికీ దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్‌పై విమర్శలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. గవర్నర్‌ ‌తమిళిసైకి మద్దతుగా మాట్లాడిన ఆ పార్టీ నేత శ్రీధర్‌రెడ్డి గవర్నర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా గవర్నర్‌ ‌మాట్లాడుతున్నారని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. గవర్నర్‌కు సైదిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను ఆ పార్టీ అధిష్టానం అదుపులో పెట్టుకోవాలని సూచించారు. గవర్నర్‌ ‌రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపైనే వ్యాఖ్యలు చేశారన్నారు. కోవిడ్‌ ‌నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విఫలం చెందిందో దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు మందలించిందో, ప్రభుత్వం వైరస్‌ ‌నియంత్రణ సాధ్యం కాకపోతే బాధితులు ప్రైవేటు దవాఖానాలలో ఎందుకు చేరాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ‌నేతలు గవర్నర్‌పై విమర్శలు మాని కోవిడ్‌ ‌నియంత్రణకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా రావుల శ్రీధర్‌రెడ్డి సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!