Take a fresh look at your lifestyle.

నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినం

ఎల్.బి. స్టేడియంలో  హోమ్ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి నివాళులు

హైదరాబాద్ : అది 1959, అక్టోబర్ 21, భారత్ చైనా సరిహద్దులోని లడక్ – అక్సాయ్ చిన్ ప్రాంతం. గజగజ వణకించి, గడ్డగట్టే విపరీతమైన చలి. సరిహద్దు రక్షణవిధుల్లో కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి ఆర్ పి ఎఫ్)పదిమంది జవానులు సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్నారు. చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చారు. వారిని ఈ పది మంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు కోల్పోయారు. దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సంఘటన అది. ఆ దుర్ఘటననేపథ్యంలో అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై “అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా” పాటించాలని నిర్ణయించారు.

నాటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల త్యాగాన్ని స్మరించుకుని, వారి కుటుంబాలకు సానుభూతినీ, సహకారాన్ని ప్రకటించి, వారికి ఘనంగా నివాళుల ర్పిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ 21నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్రం లోని అన్ని పోలీసు కమీషనరేట్లు, ఎస్.పీ. కార్యాలయ పరిధిల్లో అనేక కార్యక్రమాలు నిర్వహ్స్తున్నారు.

పోలీసు విధి నిర్వహణ శ్రమతో కూడుకున్నది, ఇతర ఉద్యోగుల మాదిరి రోజులో కొన్ని గంటలకు మాత్రమే పరిమితం కాదు, ఇరవైనాలుగు గంటలూ ఉద్యోగంలో ఉండేది ఒక్క పోలీసు మాత్రమే! పోలీసులు లేని సమాజాన్ని ఉహించుకోలేం. ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే !. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది, ఏ పరిస్థితుల్లో నైనా అన్ని వేళలో ముందుండేది పోలీసులే. సమాజంలోని ప్రతి వ్యక్తీ, ప్రతీ అవసరానికి సాయం కోరేది పోలీసులనే! దేశాన్ని శత్రువుల దండయాత్రల నుంచి కాపాడేది సైనికులైతే, అంతర్గత శత్రువుల నుంచి అందరినీ కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, ఆస్తులకు రక్షణ కల్పించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపు, నేరగాళ్ళ నియంత్రణ పోలీసుల కర్తవ్యం. ప్రజలకు భద్రతనిచ్చే విధుల్లో పోలీసులు ప్రాణాలుకూడా అర్పిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ, పెద్దలు చెప్పినట్లు మానవ సేవే మాధవసేవ అని నిరూపిస్తున్నారు. వారి నుంచి నీతి, నిజాయితీ, అంకిత భావం, మానవత్వం, త్యాగం తదితర ఉత్తమ లక్షణాలను సమాజం ఆశిస్తున్నది.

ఒకవైపు పోలీసు విభాగం ఆధునీకరణ దిశగా నూతన విధానాలు అవలంబిస్తూ పౌరులకు మెరుగైన సేవలను అందిస్తూనే, నేరాలకు పాల్పడు తున్న వ్యక్తులను గుర్తించి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకుని సమర్థవంతంగా దుష్టశక్తులను అణచివేసేందుకునిర్విరామ కృషి చేస్తోంది. ఈ పరిసిథితుల్లో పోలీసులు ప్రాణాలు లెక్క చేయ కుండా, కుటుంబ సభ్యుల భవిష్యత్తుకూడా పక్కన పెట్టి ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తు న్నారు. ఈ వాతావరణంలోనే రాష్ట్ర అంతర్గత భద్రతకు సవాలు విసురుతున్న వామపక్ష తీవ్ర వాదులతో తలపడి, మరిన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రజల భద్రత విధులు నిర్వర్తిస్తూ తెలంగాణకు చెందిన 326 మంది పోలీసులు మావోయిస్టు, ఎం.ఎల్ గ్రూపుకు నక్సలైట్ల చేతుల్లో హతులయ్యారు. ఈ త్యామూర్తులైన పోలీసులకందరికీ తెలంగాణ ప్రజానీకం యావత్తూ నివాళులు అర్పిస్తోంది.

తెలంగాణ లో మొట్ట మొదటి పోలీస్ అమర వీరుడు మహమ్మద్ ఇబ్రాహీం కాగా, ఇప్పటి వరకు నిస్వార్థ సేవలందిస్తూ, విధినిర్వహణలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఐ.పీ.ఎస్ స్థాయి పోలీస్ అధికారుల వరకూ 326 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 180 మంది కానిస్టేబుళ్లు, 52 మంది హెడ్ కాని స్టేబుళ్లు, ఏడుగురు ఏ.ఎస్.ఐ లు, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, పది మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు డీ.ఎస్.పీ లు, ముగ్గురు ఐ.పీ.ఎస్ అధికారులతో పాటు ఇతర విభాగాలకు చెందిన 32 మంది వివిధ హోదాల అధికారులున్నారు. నడుస్తున్న సంవత్సరం లో దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు ప్రాణాలు వదిలారు. ఈ సంవత్సరం తెలంగాణలో పోలీసు లెవరూ ప్రాణాలు కోల్పోవకపోవడం అదృష్టం.. ప్రజా భద్రత, శాంతి పరిరక్షణకు సేవలందించిన అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్ 21 న నివాళులు అర్పిస్తున్నారు.

ఎల్ బి స్టేడియంలో పోలీస్ పరేడ్
అక్టోబర్ 21 న, పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని హైదరాబాద్, ఎల్.బి. స్టేడియంలో, ప్రత్యేకంగా పోలీసు అమర వీరుల స్మృతి చిహ్నం వద్ద హోమ్ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పిస్తారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రతీసారి నిర్వహించే గోషా మహల్ స్టేడియం లో కాకుండా ఎల్.బీ. స్టేడియం (ఇండోర్ స్టేడియం)లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలీస్ పరేడ్ అనంతరం హోమ్ మంత్రి, డీ.జీ.పీ ల సందేశాలుంటాయి. పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. కరోనా నిబంధనలననుసరించి ఈ కార్యక్రమాన్ని అందరు వీక్షించేందుకు వీలుగా వివిధ చానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఫేస్ బుక్ ద్వారా కూడా లైవ్ కవరేజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply