అమానవీయంగా బూటుకాలుతో తన్నినందుకు చర్య
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓ ప్రయివేటు ఇంటర్ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విద్యార్థిని తండ్రిని బూటుకాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీదర్పై చర్య తీసుకున్నారు. విద్యార్థిని తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించి, అతనిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్ ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర హోమ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోమ్ మంత్రి మహముద్ అలీ సంగారెడ్డి ఇంఛార్జి ఎస్పీ చందనా దీప్తికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కానిస్టేబుల్ శ్రీధర్ ను ఎస్పీ చందనా దీప్తి సస్పెండ్ చేశారు. బుధవారం బీడీఎల్ భానూర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సంధ్యారాణి మృతదేహాన్ని సిటిజన్ హాస్పిటల్నుంచి పటాన్చెరు ఏరియా దవాఖానకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి బాధిత కుటుంబసభ్యులతో కలిసి మృతదేహాన్ని కళాశాల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీస్ సిబ్బంది అడ్డుకొన్నారు. ఈ సమయంలోనే తండ్రి చంద్రశేఖర్ ను కానిస్టేబుల్ శ్రీధర్ బూటు కాలితో తన్నాడు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ’ప్రజలు దుఃఖ సమయాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు సానుభూతి చూపించాలి’ అని ట్వీట్‌చేశారు. ఈ విషయంపై హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టి సారించి, పోలీసుల ప్రవర్తనపై సక్షించాలని కోరారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్‌ను సంగారెడ్డి ఏఆర్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటన దురదృష్టకరమని డీజీపీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.