Take a fresh look at your lifestyle.

సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకున్న పోలీసులు

  • పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఓ రోగి మృత్యువాత
  • పోలీసుల తీరుపై మండిపడ్డ అంబులెన్స్ ‌డ్రైవర్లు
  • ప్రాణాలు దక్కించుకుందామని వస్తే అడ్డుకోవడంపై బంధువుల ఆగ్రహం
  • హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌

హైకోర్టు ఆదేశాలను పోలీసులు తుంగలో తొక్కారు తాము చెప్పిందే చట్టమన్న రీతిలో అంబులెన్‌ను ఆపడంతో ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. అంబులెన్స్ ‌నిలిపివేతతో మహబూబ్‌నగర్‌ ‌జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఒకరు మృతి చెందారు. గత రాత్రి 12 గంటల నుంచి పోలీసులు అంబులెన్స్‌లను తెలంగాణలోకి రాకుండా నిలిపివేశారు. సుమారు వంద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. బాధితులు ఎంత బ్రతిమలాడినా పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఒక్క అంబులెన్స్‌ను కూడా అనుమతించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటలకు ఓ అంబులెన్స్‌లో ఉండే పేషెంట్‌ ‌మృతి చెందాడు. అయితే ఆ రోగి వివరాలు తెలియరాలేదు. రోగి మృతిచెందిన వెంటనే అంబులెన్స్ ‌తిరిగి వెళ్లిపోయినట్లు తెలియవచ్చింది.

హాస్పిటల్‌ అనుమతి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప పోలీసులు పుల్లూరు టోల్‌ ‌గేట్‌ ‌నుంచి అనుమతించడంలేదు. తెలంగాణ సరిహద్దులో ఎపి అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్‌ ‌పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌ ‌లెటర్‌, ‌కోవిడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అంబులెన్స్‌లు వెళ్లడానికి తెలంగాణ పోలీసులు అనుమతినిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్‌ 19 ‌వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని హాస్పిటల్‌ ‌ల్లో చికిత్స పొందడానికి ఎవరైనా రావాలంటే సదరు హాస్పిటల్‌ అం‌గీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా హాస్పిటల్‌ ‌తో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్‌ ‌రూం కు వివరాలు సమర్పించి రశీదు తీసుకోవాలని తెలంగాణ సర్కార్‌ ‌సూచించింది. దీంతో అంబులెన్స్‌ల రాకకు అవకావం లేకుండా పోయింది.

రంజాన్‌ ‌పండుగ అయినా తాను మానవత్వంతో ఆలోచించి అంబులెన్స్‌లను నడుపుతున్నానని ఓ ముస్లిం సోదరుడు చెప్పాడు.  కొరోనా బాధితులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అంబులెన్స్‌లను పోలీసులు తిరిగి వెనక్కి పంపించడం సరికాదని ఆయన అన్నారు. కొరోనా నేపథ్యంలో బాద్యతగా తాను ఈ సేవ చేస్తున్నానని, పోలీసులకు కనికరం లేకుండా అంబులెన్స్‌లను తిరిగి పంపుతున్నారని అతను విజయవాడ రోడ్డు వద్ద  ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌ ‌నుంచి తెలంగాణకు చికిత్స కోసం వస్తున్న కోవిడ్‌ ‌పేషెంట్లను అడ్డుకోవడంపై ఏపీ బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్‌ ‌రెడ్డి స్పందించారు. చికిత్స కోసం వస్తున్న కోవిడ్‌ ‌పేషెంట్లను అడ్డగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి, వారి సమస్య పరిష్కరించి ప్రాణాలు కాపాడండి అని కోరారు. కర్నూలు బార్డర్‌ ‌లో రోగుల ఆక్రందనలు వినాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. తెలంగాణ పోలీసులు సాధారణ ప్రయాణికులను 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతించి, అంబులెన్స్ ‌లను మాత్రం వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. ఇంతకంటే ఘోరం, సిగ్గుచేటు మరొకటి లేదన్నారు.

సాధారణ ప్రజలు తెలంగాణలోని పోలీసు కంట్రోల్‌ ‌రూమ్‌లో అనుమతులును తీసుకోవడం, అది అంబులెన్సు ఉన్న రోగికి వారి బందువులకు సాధ్యమా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ పాస్‌ ‌ను సైతం తెలంగాణ పోలీసులు లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొరోనా రోగులు, ఇతర బాధితులు అత్యవసర సేవల కోసం ఆంధప్రదేశ్‌ ‌నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉందని విష్ణువర్ధన్‌ ‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ‌దాఖలైంది. మాజీ ఐఆర్‌ఎస్‌ ‌గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్‌ ‌దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై స్పందించి పోలీసులపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ మళ్లీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా? అంటూ హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తెలంగాణ-ఏపీ బోర్డర్లన్నింటి వద్ద నేడు పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ‌ప్లాజా వద్ద విషాదం చోటు చేసుకుంది. అంబులెన్సులను అడ్డుకోవడంతో  సకాలంలో వైద్యం అందక ఒక రోగి మృతి చెందాడు. హైకోర్టు ఆదేశాలతో రెండు రోజులుగా ఏపీ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. అయితే గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారు.

Leave a Reply