Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు

– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు

భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న విషయం గూడ వాస్తవం. ఉర్దూ భాష అన్ని మతాలవారికి సమ్మతమైన ప్రజా భాషగా రూపొందిన విషయం గూడ వాస్తవం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి, ఆంగ్లేయులు భారత ప్రభుత్వాన్ని వదిలిన తరువాత, నిజాం హైదరాబాద్‌ ‌సంస్థ నాన్ని ‘స్వతంత్ర దేశం’గా ప్రకటించుకున్నాడు. నిజామ్‌ ‌రాజుకు సలహాదారులైన కొందరు మతతత్వవాదులు చేసిన కుట్ర ఇది. ఆయన పై అనేక రకాల వత్తిడులను తెచ్చి, ఖాసిమ్‌ ‌రజ్వీ అను వ్యక్తి రజాకార సంస్థను స్థాపించి, మత దురహంకారంతో ముస్లిమేతరులపై దౌర్జన్యాలను, అమానుష హింసాకాండను సాగించినాడు. ప్రజలకు సంస్థానంలో శాంతి భద్రతలు కరువైపోయినవి. నిజామ్‌ ‌రాజును లెక్కచేయక సంస్థానంలో బీభత్సాన్ని సృష్టించినాడు ఖాసిమ్‌ ‌రజ్వీ. రజాకార్లు జరిపే మారణ హోమం నుండి సంస్థాన ప్రజలను రక్షించుటకు భారత ప్రభుత్వం పోలీసు చర్యను జరుపక తప్పలేదు. ఇక్కడ ఇంక కొన్ని విషయాలను గూడ విస్మరించలేము. భారతదేశంలోని సంస్థానాలను అన్నింటిని, ఐక్యపరచి, ఒకే ఐక్య భారతంగా రూపొందించవలెనన్న ఉద్దేశంతో గూడ పోలీసు చర్య అవసరమైంది.

అన్నిటికన్న ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం అనేక సంవత్సరాలుగ, రాజరికంలో మ్రగ్గి, దేశముఖ్‌లు భూస్వాముల దౌర్జన్యాలతో విసిగి పోయిన ప్రజలు, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపినారు. కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభ, రైతు సంఘం నాయకత్వంలో ప్రజలు రజాకార్లను, వారికి అండగా నిలిచిన దేశముఖ్‌లను, భూస్వాములను గ్రామాల నుండి తరిమి కొట్టినారు. తెలంగాణ ప్రాంతంలోని కొన్ని వేల ఎకరాల భూమిని రైతులు పంచుకొని స్వేచ్ఛా జీవితం గడిపినారు. రజాకార్ల దౌర్జన్యాల నెదుర్కొని అనేక గ్రామాలను స్వతంత్ర గ్రామాలుగ ప్రకటించినారు. తెలంగాణ రైతులు జరిపిన ఈ సాయుధ పోరాటం ప్రపంచ దేశాల అధినేతలకు చర్చనీయాంశమై ప్రజల ప్రశంసలను పొందింది. తెలంగాణ ప్రజల ధైర్య సాహసాలకు, చైతన్యానికి ప్రపంచ ప్రజలు జేజేలు కొట్టక తప్పలేదు. ఈ అంశం గూడ భారత ప్రభుత్వానికి భయాన్ని కలిగించింది. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం, దేశమంతట వ్యాప్తి జెందుతుందేమోనన్న భయం గూడ, పోలీసు చర్యకు కారణభూతమైంది. స్వతంత్ర సంస్థానంగా రూపొందదలచిన నిజామ్‌ ‌నవాబు, సైనిక బలాన్ని, ఆయుధాలను పెంపొందించుకోవటానికి, బ్రిటన్‌లోని సిడ్నీ కార్టక్‌తో ఒప్పందం కుదుర్చుకొని, ఆయుధాలను విమానాలలో దిగుమతి చేసుకోవటం ప్రారంభించినాడు. వరంగల్‌ ‌పట్టణానికి సమీపంలో ఉన్న మామునూర్‌ ‌విమానాశ్రయంలో ఈ ఆయుధాల విమానాలు దిగుతుండేవి. ఆయుధాలను దిగుమతి చేసుకున్నారేగాని, వాటిని సమయానికి ఉపయోగించడం, రజాకార్లకు రాకపోయేది. వాని ఉపయోగం కొరకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం.

ఎ. రామారావు వరంగల్‌ ‌పట్టణానికి చెందిన యువకుడు. ఆయుధాల ఉపయోగంలో, గుర్తింపులో శిక్షణను పొందిన అనుభవశాలి. కుస్తీపట్లలో, కట్టెసాములో నేర్పుగలిగిన ఉత్సాహవంతుడు. ఇతడు మామునూరు విమానాశ్రయానికి సిడ్ని కార్టక్‌ ‌విమానాలు – వచ్చే సమయానికి, చుట్టుపట్ల రహస్యంగ ఉండి, కార్టక్‌ ‌పంపుతున్న ఆయుధాల రకాలను, ప్రమాణాలను గ్రహించి, భారత ప్రభుత్వానికి రహస్యంగా సమాచారాన్ని అందజేస్తుండేవాడు. ఈ విషయాన్ని గురించి, యం. వీరభద్రరావుగారు రచించిన పుస్తకం, ‘హైదరాబాదు పై పోలీసు చర్య’ లో వివరంగా రాసినారు. పోలీసు చర్య ఒక పద్ధతిలో, పథకం ప్రకారం చాలా విజయవంతంగ జరిగిందని చెప్పవచ్చును. మిలటరీ బలగాలను పంపేముందు, భారత వైమానికులు హైదరాబాదులోని విమానాశ్రయాలను, ప్రత్యేకంగా మామునూరు విమానా శ్రయాన్ని ధ్వంసంజేసి, కార్టర్‌ ‌విమానాలు దిగకుండ చేసినారు. 1948 సెప్టెంబర్‌ ‌మొదటి వారంలోనే, భారత విమానాలు, సరిగ పది గంటలకు రెండుసార్లు విమానాశ్రయంపై బాంబులను విసిరేవారు. ఈ బాంబులు విమానాశ్రయాన్ని ధ్వంసం జేసినప్పుడు, విమానాశ్రయంలో బావులు పడి అవి నీటి బావులుగా ఏర్పడినవి. ఈ విధంగా పది గంటల నుండి, మధ్యాహ్నం ఒంటిగంట వరకు నాలుగుసార్లు, రెండు విమానాలు, విమానాశ్రయం పైకి వాలి, బాంబులను కురిపించి, లేచి పోయేవి. ఒక వారం రోజులపాటు, మామునూరు చుట్టు పక్కల గ్రామవాసులందరికి ఇది ఒక వినోదంగా ఉండేది. సరిగ్గా విమానాలు వచ్చే సమయానికి, గ్రామస్థులు ఇండ్ల బయటికి వచ్చి వినోదాన్ని చూస్తుండేవారు.

మొదటి రెండు రోజులు మాత్రం, ఈ దాడులు తమకేమైన హాని కలిగించుతవోనని, గ్రామస్థులు భయపడిన విషయం వాస్తవం. మూడవరోజున ఈ విమానాలు విస్తృతంగా కరపత్రాలను కురిపించినవి. ‘‘మేము మీకు మిత్రులం, ఇది మీ పైన దాడిగాదు, కేవలం విమానాశ్రయాన్ని దగ్ధం చేయడానికి మాత్రమే’’ అన్న ఆ కరపత్రాలు, ప్రజలకు, ధైర్యాన్ని ఇవ్వటమేగాక, ద్విగుణీకృతమైన ఉత్సహాన్ని కలిగించినవి. ఇక్కడొక విషాదం యేమిటంటే…? విమానాలను కూల్చి వేయగల ఆయుధాలను కార్టర్‌ ‌రజాకార్లకు సరఫరా చేసినాడట, కాని వాటిని పట్టుకోవటం గాని, ఉపయోగించడం గాని వారికి చేతగా లేదు. ఎటువంటి శిక్షణ, నేర్పులేక, కేవలం మతోన్మాదుతో ఉద్రిక్తులై పోరాటానికి సిద్ధమై, మామునూరు విమానాశ్రయంలో నియమించబడిన రజాకార్లు చావుభయంతో చతికిల బడి, దీనంగ, చెలకలలో పని చేసుకుంటున్న, మంచెల మీద ఉన్న రైతుల వద్దకు వచ్చి,కొద్దిగ మంచినీళ్లు తాగించమని, కొన్ని రొట్టె ముక్కలియ్యమని, బ్రతిమిలాడుకున్న సంఘటనలను, ప్రజలు చెప్పుకొని నవ్వుకునేవారు. హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత సైన్యం చాల సులభంగ, సునాయాసంగ వశపరచుకున్నది. ఈ సైన్యానికి సేనానిగ వచ్చిన జనరల్‌ ‌చౌదరి, హైదరాబాదు ప్రవేశంచిన వెంటనే, నిజామ్‌ ‌నవాబు, హైదరాబాద్‌ ‌రేడియో స్టేషన్‌ ‌నుండి , ఆయనకు స్వాగతం పలికినాడు. ఈ ఆక్రమణ తరువాత, హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలోని రాష్ట్రంగా రూపొందింది. భారత సైన్యాలు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు తరలి, స్థావరాలనేర్ప రచుకున్నది. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించవలెనన్న ప్రయత్నంతో, ఇక్కడ సైన్యాలను, విపరీతమైన సంఖ్యలో మోహరింపజేసింది. హైదరాబాద్‌లోని అన్ని పట్టణాలలోను కర్ఫ్యూ విధించటం జరిగింది. హైదరాబాద్‌ ‌నగరంలో కర్ఫ్యూ విధించి, ‘‘హైదరాబాద్‌ ‌మె.. దప్లీ క కర్ఫ్యూ చల్‌ ‌రహా హై, దేఖో’’, అని జనరల్‌ ‌చౌదరి, తన సహచరులతో, అధికారులతో, ఎంతో సంతోషంగా, ఆవేశంతో అన్నారట. రాత్రులందు కర్ఫ్యూలో సైన్యాలు చీమను కదలనివ్వలేదు.

అది 1948, 17వ సెప్టెంబర్‌ ‌తరువాత, ఇదే నెలలోని ఒక రోజు. హైదరాబాద్‌ అం‌త ఒక విధంగా అల్లకల్లోలంగాను, మరొక విధంగా ప్రశాంతంగాను, ఉన్న విషయం అందరికి తెలుసు. వరంగల్‌ ‌నుండి, హైదరాబాద్‌ ‌పాసింజర్‌ ‌రైలులో బయలు దేరి సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో దిగినాము. సమయం దారాపు ఎనిమిది గంటలైంది రాత్రి. ఆరోజు రైలు బహుశః ఆలస్యం అయి ఉండవచ్చును. లేకపోతే సాధారణంగ, వరంగల్‌లో పగలు 12-30కు బయలు దేరిన పాసింజర్‌ ‌రైలు, సాయంత్రం 6-30 లేక, 7 గంటలకు మాత్రమే సికింద్రాబాద్‌ ‌చేరుతుంది. సికింద్రాబాద్లో దిగి, లోకల్‌ ‌రైలులో ఎక్కి, కాచీగూడ స్టేషన్లో దిగినాము. నేను మా బంధువు అబ్బాయి మరొకరు. అతను నా కన్న వయసులో పెద్ద. కాచీగూడ స్టేషన్‌ ‌లో దిగేవరకు దాదాపు రాత్రి తొమ్మిదయింది. స్టేషన్‌ ‌సైనికులతో నిండి ఉన్నది. సాధారణ జనులెవ్వరు కన బడటం లేదు ఎక్కువగా. మేము ఈ స్టేషన్లోనుండి మా గదికి పోవలెను. ఈ రోజులలో కాచీగూడలోని వెంకటరమణ సినిమా హాలు పక్క సందులో మా గది. స్టేషన్లోనే ఉండి పోదామా అని కొద్దిసేపు ఆలోచించినాము. అందులో కొంత సమయం పోయింది. సమీపంలోనేగదా మెల్లగా వెళుదామన్నాడు, నా కంటె పెద్దవాడు. సరెననుకొని, స్టేషన్‌ ‌బయటికి వచ్చి నడువసాగినాము నిదానంగ. పది అడుగులు నడిచేసరికి, ‘భాగో, భాగో’ అంటు ధ్వనులు వినబడినవి. వారు సైనికులే. మేము ఇద్దరం, సైనికులు నలుగురు. ‘‘భాగో, భాగో’’ అన్న పదాలను వారు విడువటం లేదు. మేము ఉరుకుతుంటే, మా వెనక, వీపుపైన, మెడల కింద, తుపాకి గొట్టాలనుంచి, అదే, ‘‘భాగో, భాగో’’, అంటూ తరమటం మొదలు పెట్టినారు. భయానికి ఉరకలేక పోతున్నాం. ఎప్పుడో, మధ్యలోనే వీరు కాల్చివేయక తప్పదనుకున్నాం. నా కన్న పెద్దవాడు మెల్లగ ధైర్యం చెప్పుతున్నాడు. ‘‘త్వరగా పరుగెత్తు త్వరగా పరుగెత్త’’ మని. రోడ్డును ఆనుకొని ఉన్న ఆ సందులో ప్రవేశించి, ఉరుకుతు, తలుపులు గడియవేసుకునేదాక, వారు మమ్ములను వెంటాడినారు. గదిలో దమ్ము తీసుకొని, బ్రతికి పోయినాం, అనుకున్నాం.

శాంతి భద్రతలు అన్న తరువాత మంచి, చెడ్డ విచక్షణ ఉండదుగద. అప్పుడు వారి విద్యుక్తధర్మం, మనిషి కనపడితే కాల్చివేయటం మాత్రమే! అప్పటికి, సైనిక దుస్తులలో లేని ప్రతివాడు, సైనికులకు, రజాకార్‌గానో, కమ్యూనిస్టుగానో, మాత్రమే కనిపించినాడు. ఇది దిల్ల్లీ కర్ఫ్యూ! శాంతి భద్రతల ‘సంరక్షణ’ పేరిట జరిగే దురాగతాలు గూడ, అనేకం ఉంటవి, దానిని విస్మరించలేము. వరంగల్‌ ‌పట్టణానికి పది కిలో మీటర్ల దూరంలో మామునూరు గ్రామం. ఆ గ్రామానికి సంబంధించిన చెల్కలనానుకొని విమానాశ్రయం. విమానాశ్రయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మా గ్రామం, బొల్లికుంట. బొల్లికుంట గ్రామానికి రజాకార్ల కాలానికి పూర్వంనుండే ఒక పేరున్నది. ‘‘వస్తే బొల్లికుంట, పోతే మొత్తుకుంట’’ అని. ఆ గ్రామ ప్రజల ధైర్యసాహసాలు అటువంటివి. వారిలోని ఐకమత్యమే ఆ గ్రామానికి జీవం. పోలీసు చర్య ముగిసిన తరువాత, మిలటరీ రాజ్యంలోనే, ఒకనాడు రాత్రి. సెలవులైనందువలన నేను గ్రామంలో ఉన్నాను. ప్రశాంతమైన రాత్రి. రైతులు, వ్యవసాయ కూలీలు, దినమంత కష్టించి, కష్టసుఖాలను అన్నింటిని మరచి, ప్రశాంతంగా గురకలు వేస్తున్న రాత్రి. దాదాపు పన్నెండు, ఒంటి గంట అయి ఉంటుంది. గ్రామం మొదట్లోనే ఉన్న మూడు బాటల కూడలి. ఆ కూడలికి ఒక పక్కన మా ఇల్లు. ఆ రాత్రి ఒక జీపు వేగంగ పరుగెత్తుకొచ్చిన ధ్వని వినపడి, నాకు మేల్క వచ్చింది. లేచి, కిటికీలో నుంచి బయటికి చూసిన. అప్పటికి జీపు వచ్చి కూడలిలో ఆగింది. నేను చూస్తున్నాను. ఒక పోలీసు ఇన్‌ ‌స్పెక్టర్‌, ‌నలుగురు జవాన్లు, పూర్తి ఆయుధాలతో దిగినారు. నాకు బయటికి పోవాలనిపించింది. తలుపు తీసి బయటికి పోయిన. అందరిచేతులలో కట్టె, భుజాన తుపాకులు. ఇన్‌ ‌స్పెక్టర్‌ ‌గారు కర్రతో సైగ చేస్తు, నన్ను రమ్మన్నారు. సమీపానికి పోయినాను.

కర్ర ఊగుతూనే ఉంది చేతిలో. నీవు ఈ గ్రామంలో మేం చేస్తావు? అన్నారు. నేను విద్యార్థిని, ఈ గ్రామస్థుడను, సెలవులలో వచ్చినాను’ అని చెప్పినాను. వింతగా, ఈ గ్రామం పేరేమిటి? అని అడిగినాడు. గ్రామం మొదట్లోనే ఉన్న పెద్ద బోర్డు, ఇన్‌ ‌స్పెక్టర్‌గారు బహుశ చూసి ఉండరు. సరె, అనుకొని, ‘‘ఈ గ్రామం పేరు బొల్లికుంట’’ని చెప్పినాను. ఇక్కడ కమ్యూనిస్టులెవరైనా ఉన్నారా? అని అడిగినాడు. మా గ్రామంలో అటువంటిదేది లేదని చెప్పినాను. రైతులెవ్వరు బైటకిరాలేదు. గాఢనిద్రలో ఉన్నారు. ఒక్క వ్యక్తి బయటికి వచ్చిన, అప్పుడు రంగం వేరే విధంగ ఉండేది. ఇన్‌ ‌స్పెక్టర్‌ ‌గారు నిశ్శబ్దంగా జవాన్లను ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఇది ఆ గ్రామం పేరులో ఉన్న ప్రభావం. ఈ విధంగా అనేక సంఘటనలు, సంతోషకరమైనవి, దుఃఖపూరితమైనవి, బాధాకరమయినవి ఆ రోజులలో జరిగినవి. ఔను, ఆ రోజులలో హింసాకాండ జరిగింది, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలు జరిగినవి. ప్రజలకు శాంతి భద్రతలు, కరువై పోయినవి. స్వాతంత్య్రం వచ్చి యాభై సంవత్సరాలు గడిచిన తరువాత ఈనాడు, ఇవన్ని లేకుండ, ప్రజల జీవితాలు, సుఖ సంతోషాలతో, శాంతి భద్రతల మధ్య గడుస్తున్నవా? అందరు ఆలోచించుకోవలసిన విషయం.
– ‘ప్రజాతంత్ర’ ,1998 సెప్టెంబర్‌ 20

Leave a Reply