Take a fresh look at your lifestyle.

పోలవరం పంచాయతీ

“గతంలో రాష్ట్రం ఒప్పుకున్న మొత్తానికి మించి రూపాయి విదిలించేది లేదని తేల్చిచెప్పటంతోనే ఇప్పుడు ఖంగు తినింది. ఈ తిరకాసులు ఎలా ఉన్నా…విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత వంద శాతం కేంద్రానిదే. నిర్మాణం అంటే భూసేకరణ, నిర్వాసితుల సమస్య కూడా కలిపి. ఏ కారణంతో అయినా ఇప్పుడు కేంద్రం మాట మార్చటం, ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా …రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం సమర్థనీయం కాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.”

pendrive rehana senior journalistఆంధ్రప్రదేశ్‌ ‌లో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు 2014 నాటి అంచనాల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని తాజాగా కేంద్రం తేల్చి చెప్పటంతో పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఈ అంచనాలకే అంగీకరిస్తూ రాసిన లేఖను కూడా రాష్ట్రం ముందు పెట్టింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన కొన్ని  కోణాలు మన ముందు ఉన్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని పక్కన పెట్టి కేంద్రం చేయి ఎందుకు ఇస్తోంది…అసలు పాపం అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీదా లేక ఇప్పుటి అధికార వైసీపీదా

పోలవరం-ప్రాధాన్యత
ఈ పంచాయతీలోకి వెళ్లే ముందు పోలవరం ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి. పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం దగ్గర నిర్మిస్తున్నారు. ఇది  బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించటం, విశాఖ పట్టణ తాగునీటి అవసరాలు, చుట్టుపక్కల ఉన్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చటం కూడా దీనిలో భాగమే. ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు ఎక్కువగా ఉన్న గోదావరి నుంచి నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణలోకి నీటిని మళ్ళించే నదుల అనుసంధాన పథకం ఇది.   అందుకే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ‌కు జీవనాడియే కాదు అటు రాజకీయ పార్టీలకు కూడా ఇజ్జత్‌ ‌కా సవాల్‌ ‌లాంటిది. 2009లో వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టుగా పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం కూడా ఒక అస్త్రంగా వాడుకుంది అనే చెప్పాలి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ‌కు ఊరట ఇచ్చే క్రమంలో పోలవరానికి జాతీయ హోదా ఇస్తామని నాటి యూపీఏ సర్కార్‌ ‌చెప్పింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల అంశం ఇలా మొత్తంగా వంద శాతం వ్యయం కేంద్రమే భరిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం సెక్షన్‌ 90‌లో స్పష్టంగా పేర్కొంది. ఇంత కీలకమైన ప్రాజెక్టును 2019 జూన్‌ ‌నాటికి పూర్తి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం ప్రజలకు హామి ఇస్తే…గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్‌ 2021 ‌డిసెంబర్‌ ‌నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాట ఇచ్చారు.

అసలేం జరిగింది
2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిది. అంటే నిధులు ఇవ్వటమే కాకుండా నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఢిల్లీ పెద్దలదే. అప్పుడు పోలవరం అంచనా వ్యయం సుమారు 20వేల కోట్లు. వైఎస్‌ ‌ప్రతిపాదన చేసేటప్పుడు అంటే 2009 నాటికి అంచనా వ్యయం 16, 716 కోట్లు ఉండేది.  విభజన జరగటం, ఇతర అనేక సమస్య నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు కొద్ది కాలం నత్త నడకన సాగాయి. అయికే 2016లో నిర్మాణ బాధ్యతను కేంద్రం నుంచి నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అంగీకరించటం, మీరు నిధులు ఇవ్వండి ప్రాజెక్టు మేమే కట్టుకుంటాం అని చెప్పిన క్రమంలో 2013-14 నాటి అంచనాల ప్రకారం నిధులు ఇస్తే చాలనే అంగీకారానికి వచ్చారు. సెప్టెంబర్‌ 30, 2016‌న  సెంట్రల్‌ ‌మినిస్ట్రీ ఆఫ్‌ ‌ఫైనాన్స్ ‌రిలీజ్‌ ‌చేసిన మెమోలో 2013-14 వరకు పోలవరం ప్రాజెక్ట్ ‌నిర్మాణంలో ఇరిగేషన్‌ ‌కాంపోనెంట్‌ ‌కు ఎంత వ్యయం అవుతుందో, దానిని మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు నోట్‌ ‌విడుదల అయ్యింది. అంతే కాకుండా 2017లో నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ ‌సమావేశంలోనూ 2014 తరువాత జరిగే అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని, 2010-14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని తీర్మానించారు. అంటే దాని కంటే వయ్యం పెరిగితే కేంద్రంకు సంబంధం ఉండదన్నమాట. ఈ తీర్మానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించినట్లే. ఎందుకంటే అప్పుడు బీజేపీతో కేంద్రంలో టీడీపీ అధికార భాగస్వామి. సుజనా చౌదరి, అశోక గజపతి రాజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయినా అప్పుడు ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు అన్నది తేలని అంశం. అంతేకాకుండా చంద్రబాబు కూడా 2016 ఫైనాన్స్ ‌నోట్‌ ‌ప్రకారం కేంద్రం పేర్కొన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధానికి లేఖ రాశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 2018లో చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు  సుమారు 8వేల కోట్లు ఖర్చు చేసినట్లు, ప్రాజెక్టు నిర్మాణం 53 శాతం పూర్తి అయినట్లు పేర్కొన్నారు.

ఒక నిర్ణయం-అనేక ప్రశ్నలు
2018లో ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలు చూసే పోలవరం ప్రాజెక్టు అథారటీ, టెక్నికల్‌ అడ్వయిజరీ బోర్డ్ ‌తుది అంచనా వ్యయం 55,548 కోట్లకు చేరింది. ఈ అంచనాల లెక్కను తేల్చింది మూడు కేంద్ర ప్రభుత్వ విభాగాలే. ప్రాజెక్టు అసలా అంచనా వ్యయం కంటే 20శాతానికి మించి రివైజ్‌ ఎస్టిమేషన్స్ ఉం‌టే కేంద్రం ప్రత్యేక కమిటి వేసి తేల్చమంటుంది. దీనితో రివైజ్డ్ అస్టిమేట్స్ ‌కమిటి 2ను ఏర్పాటు చేశారు. ఈ కమిటి విచారణ చేసి 47,725.74 కోట్లుగా తుది అంచనాలు ఇచ్చింది. ఈ లెక్కలను కేంద్ర జలవనరుల శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ ఫైల్‌ ఆర్ధిక శాఖకు చేరినప్పుడు 2016 నోట్‌, 2017 ‌కేంద్ర క్యాబినెటే తీర్మానం కాగితాలను బయటకు తీసి కొర్రి వేసింది. గతంలో రాష్ట్రం ఒప్పుకున్న మొత్తానికి మించి రూపాయి విదిలించేది లేదని తేల్చిచెప్పటంతోనే ఇప్పుడు ఖంగు తినింది. ఈ తిరకాసులు ఎలా ఉన్నా…విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత వంద శాతం కేంద్రానిదే. నిర్మాణం అంటే భూసేకరణ, నిర్వాసితుల సమస్య కూడా కలిపి. ఏ కారణంతో అయినా ఇప్పుడు కేంద్రం మాట మార్చటం, ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా …రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం సమర్థనీయం కాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Leave a Reply