– పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
– మూగజీవాలను చంపడం అమానుషం
– బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం
– కుక్కల సమస్య వుంటే అధికార్లకు తెలపండి
– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి సీతక్క బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సంఘటనలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమన్నారు. మూగజీవాలను విషం పెట్టి చంపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమే. అయితే ఆ సమస్యకు పరిష్కారం అనేది చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయమైన మార్గాల్లోనే చేయాలి తప్ప అతి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. వీధి కుక్కల వల్ల సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకో కూడదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



