Take a fresh look at your lifestyle.

విష నగరి

  • ఫార్మా సిటీల పేరుతో విషం చిమ్ముతున్న పరిశ్రమలు
  • అభివృద్ధ్ది మాటున ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న పాలకులు
  • సిరీస్‌ ‌కంపెనీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లయినా ఇంకా వీడని జ్ఞాపకాలు
  • గత ఏడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 30 మందికి పైగా మృతి

తెలంగాణలో ఫార్మా సిటీల అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫార్మా సిటీల ఏర్పాటు మంచిదే అయినప్పటికీ వాటి నుంచి వెలువడే వ్యర్థాల బారిన పడకుండా ప్రజలను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకో•• పోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో హైదరాబాద్‌ ‌నగర శివార్లలోని కాలుష్య కారక పరిశ్రమలతో
ప్రజలు ఎదుర్కొంటున్న భయంకర సమస్యలకు పరిష్కారం చూపకుండానే కొత్త పరిశ్రమల ఏర్పాటు ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది. ఫార్మా సిటీ ఏర్పాటు కోవిడ్‌ ‌మహమ్మారి వ్యాధి నేపథ్యంలో అత్యంత అవసరమని ఆర్భాటంగా ప్రకటించి అసలు దానిపైనే చర్చించకపోవడం ఏమిటని సమీప ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగర శివార్లలోని పటాన్‌ ‌చెరు, జీడిమెట్ల, చౌటుప్పల్‌, ‌కొత్తూరు సరూర్‌నగర్‌ ‌వంటి ప్రాంతాలలో వందల సంఖ్యలో ఫార్మా పరిశ్రమలు వెలిశాయి. ఈ పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థ నీరు, గాలితో పాటు అత్యంత ఘన వ్యర్థాల కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ గతంలోనూ ఎన్నో ఆందోళనలు జరిగాయి. దాదాపు 30 ఏళ్ల నుంచి పటాన్‌ ‌చెరువు ప్రాంతంలో ప్రజలు పరిశ్రమల బారి నుంచి తమ ప్రాణాలను కాపాడాలని చేసిన పోరాటాలు వృధా ప్రయాసగానే మిగిలాయి. ఫార్మా పరిశ్రమల యజమానులు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలు శూన్యం. ఆయా ప్రాంతాలలో స్థానికులు రకరకాల కాలుష్యంతో అత్యంత ప్రమాదకర రసాయనాల బారిన పడి ఆనారోగ్యం పాలై వైద్యానికి ఖర్చులతో ఉన్న ఆస్తులు కరిగిపోయి బికారులు అవుతున్న ఘటనలు కోకొల్లలు.

పరిశ్రమల అవసరాల కోసం వేసే పవర్‌ ‌బోర్ల కారణంగా స్థానిక భూగర్భ జలాలు అడుగంటి పోవడం, భూగర్భంలో కలిసిన వ్యర్థాల కారణంగా బోర్లలో నీరు విషమయంగా మారడం ఈ ప్రాంతాలలో సర్వసాధారణం. అంతేకాకుండా అభం శుభం తెలియని పశువులు విషపు నీరు తాగి మరణిస్తున్నాయి. దీంతో వ్యవసాయం ఆధారంగా జీవించే ప్రజలు తమ ఉపాధిని కోల్పోతున్నారు. హైదరాబాద్‌ ‌శివార్లలోని సరూర్‌నగర్‌ ‌ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం సిరీస్‌ ‌కంపెనీ నుంచి విడుదలైన కాలుష్యం వల్ల ఇప్పటికీ ఆ ప్రాంతంలోని ప్రజలకు బోర్లలో విషపూరితమైన నీరు రావడం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నివసించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. జీరో డిశ్చార్జి అంటూ స్థానిక భూగర్బ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలను నియంత్రించకుండా వాటిని మూసివేయక పోవడంతో పాటు ప్రభుత్వ అధికారులు వాటిని మూసివేయాలని ఆందోళన నిర్వహించిన స్థానిక ప్రజలపైనే తప్పుడు కేసులు బనాయించిన సంఘటనలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుతో విడుదలయ్యే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించక పోగా, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుమతులు సులభతరం చేశామని ప్రకటనలు గుప్పించడం నగర శివారు ప్రాంతాల ప్రజలను వణికిస్తున్నది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హరితహారం అంటూ లక్షలాది మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో విడుదలయ్యే వ్యర్థాల కారణంగా పర్యావరణానికి కలిగే ముప్పుపై దృష్టి సారించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కాలుష్య కారక పరిశ్రమలను ప్రోత్సహించడం ఏమేరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply