కవి అంతరంగంలో కమ్ముకుని, అల్లుకుని, విస్తరించి, అంతర్లీనమై విచ్చుకునే సంకీర్ణ సంక్షోభ సృజన ప్రపంచం కవిత్వం. లోన నుండి పైకి లాగితే నూతన నవ్య కాంతి శక్తితో అనుభవధారగా కవిత్వం కురుస్తుంది. దీర్ఘ తపస్సమాధికి వెళ్లి గొప్ప మాంత్రిక శక్తిని కవి కవిత్వానికి ధారపోయక పోతే ఇంతటి అజరామరత్వంతో ఆ భావోద్వేగ సాంద్రత హృదయాల్లో నిక్షిప్తమయ్యేదా అన్పిస్తుంది. నిశ్చలంపైకి అకస్మాత్తుగా తెగిపడిన కల్లోలపు అనుభవం కవిని మాట్లాడించి కవిత్వాన్ని ప్రవహింపజేస్తుంది. అందుకే కవి గీసుకొనే వివర్ణవృత్తం, రాసుకునే కన్నీటి ఉత్తరం, పూయించుకునే అక్షరవనం, వెతుక్కునే జ్ఞానదిశ, తొడుక్కునే వెన్నెల కవచం ఖచ్చితంగా కవిత్వమే. స్వేచ్ఛాగీతం పాడుకునే కవి బంధీ అయ్యేది కవిత్వ చెరసాలలోనే. సమాజంలోని విభిన్న అంశాలను నిశితంగా పరిశీలించి ఉద్వేగంగా, ఉదాత్తంగా తనలోని ఆత్మవేదనను మట్టి పరిమళం పేరిట కవిత్వీకరించి సాహితీ క్షేత్రంలో పేరొందిన దార్శనిక కవి, ఆలోచనాశీలి డాక్టర్ పెద్దివెంకటయ్య. తన చుట్టూరా పరివృతమై ఉన్న సామాజిక సముద్రపు అలలపై కదిలే బతుకు పడవల ఎదలోతుల్ని కడిగి దాహవ్యధల్ని ఆవిష్కరించిన కవిగా వెంకటయ్యను ఆయన కవితా సంపుటి మట్టి పరిమళం నిలిపింది. జడత్వం నుండి జాగృతి వైపు మనిషి నడవాలని బలమైన కవితాకాంక్షను వెల్లడిస్తూ ఇప్పుడు వెంకటయ్య కవితా విశ్వవీణను మ్రోయించారు.
అరుణ కిరణాలతో విశ్వంభరపైకి విచ్చేస్తాడు
వెలుగు కొరడాలతో పుడమిని మేలుకొలుపుతాడు
అని ప్రాచీరేఖ మీద ప్రభవించి కల్లలు, ఎల్లలు ఎరుగని తనంతో జీవకోటికి ప్రాణాధారంగా మారి వైతాళికుడైన యోగిగా, విశ్వవీణావిష్కర్తగా ఆదిత్యుడిని (సూర్యుడు) అభివర్ణించారు. ఒకనాడు ఇలపైన స్వర్గంగా నిలిచిన తన ఊరు మారిన కాలమాన పరిస్థితులలో రూపుమారిన తీరును మా ఊరు కవితలో వేదనాభరిత హృదయంతో చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఒకనాడు భాసించిన ఊరు ప్రపంచీకరణ పదఘట్టనతో అస్తిత్వాన్ని కోల్పోయి నగరీకరణను అద్దుకున్న వికృత వైనాన్ని హృదయదఘ్నంగా చిత్రించారు. బురుజులు కూలిన చోట మిద్దెలు, మేడలు నింగినంటాయని, సిందోళ్ల బాగోతం, గొల్లసుద్దులు, కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, దొరగడీలు, శాదబాయిలు, ఇసుర్రాయిలు, అలనాటి అమరుల త్యాగాల జాడలు, అమ్మ మనస్సున్న అప్పటి మనుషులు పూర్తిగా కనిపించకుండా కనుమరుగైపోగా ఊరుకు వింతపోకడ అంటుకొని అప్పటి గొప్పతనం ఆకాశంలో కలిసిపోయిందని ఎంతగానో కుమిలిపోయారు. అలవోకగా గుర్తుకొచ్చే బాల్యం నాటి ఊరు జ్ఞాపకాలు మళ్లీ తనని పసివాడిని చేస్తున్నాయన్నారు.
అక్షరం అంటేనే అభ్యుదయం , పచ్చదనం అని అనుభవాల వాహినిగా, బతుకుకు వెలుగు రేఖగా అన్వయించి మానసవీణ అన్న కవితలో చెప్పారు. మానవ ప్రకృతిని ముడివేసి మానవీయ రాగ బంధాన్ని ఆవిష్కరించే అనుసంధాన సాధకమే అక్షరమని తెలిపారు. ఆధిపత్య యుద్ధకాంక్షాదాహాన్ని నిరసించారు. అన్యాయంపై గెలవాలన్న యుద్ధ సంకల్పం ఎంతో గొప్పదని భావించారు. బహుజన ఫిరంగిగా, దౌర్జన్యంపై మండిన భాస్వరంగా, ఆదిరుద్రమూర్తిగా, అభినవ చాణిక్యుడుగా, త్యాగాలకే తిలకంగా సర్దార్ సర్వాయిపాపన్నను ధీరోదాత్తునిగా చిత్రించారు. పాపన్న స్ఫూర్తితో పోరాడి తుది విజయాన్ని బహుజనులు పొందాలని పిలుపునిచ్చారు. చెమట చుక్కను మెరుస్తున్న ఆణిముత్యమన్న గొప్ప భావనను మారుకత్తి కవితలో ప్రకటించారు.
ఎవరి మోచేతి నీళ్లు నీకెందుకు ?
ఎవరి బాకా భజంత్రి నీకెందుకు ?
అన్న వాక్యాలలో వెంకటయ్య కవితా దృక్పథం సుస్పష్టంగా వ్యక్తమైంది. నిన్ను నువ్వు తెలుసుకొని, కావలసినంతగా పదును పెట్టుకుని సరికొత్త శ్రేయో రాజ్యాన్ని ఆవిష్కరించమని అనడంలో మార్పును ఆశించే పరిణామశీలత దండిగా కలిగిన మేటి కవిగా ఆయన కన్పించారు. పల్లె పట్నానికి వలసపోతుంటే తెలంగాణ తల్లి గుండె ఎంతో తల్లడిల్లిపోయిందని అన్నారు. పల్లెల బతుకు చిత్రాలను చిధ్రమవకుండా గుండెగూటిలో పెట్టి పదిలంగా కాపాడమని వేడుకోవడంలో గ్రామ సీమలతో కవికి ఉన్న అమూర్తమైన అవ్యాజమైన అనుబంధం వ్యక్తమైంది. స్వాంతన మూర్తిగా, మహాద్భుత శక్తిగా ఆకాశంలో సగం కవితలో స్త్రీ మూర్తిని చిత్రిస్తూ మహిళాభ్యుదయమే దేశ సౌభాగ్యమని వెల్లడించారు. కన్నెర్రజేసిన ఎర్రజొన్న కవిత మట్టిని ముద్దాడిన చెమట చుక్కల పొలికేకల ఆర్తనాదాల్ని అద్భుతంగా వ్యక్తీకరించి ఎర్రగుండెల్లో మండిన నిప్పుకణికల హోరును ప్రత్యక్షంగా చూపింది. మతం గితం వద్దని మానవత్వమే మనిషికి అతిపెద్ద అభిమతమని కవిగా వెంకయ్య హితవు పలికారు. నా హృది పారే ఒక నది అని పాల్కురిని, బమ్మెరపోతన, శ్రీనాథుడు, శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, కాళోజి, దాశరథి, సినారె, శేషేంద్ర, ఆరుద్ర, సోమసుందర్, తిలక్ వంటి నాటి కవులను, నేటి వర్తమాన కవితాప్రపంచపు నిప్పురవ్వలను ఎంతో ఆత్మీయంగా
గుర్తుచేసుకున్నారు. ఎడారి తోడేళ్లను చూసి గుండెలవిసేలా చెట్లు ఏకధాటిగా కన్నీళ్లు పెట్టాయన్నారు. అమెరికాలోని శ్వేతసౌధం జాత్యహంకారాన్ని విడిచి సమతాసదనంగా మారాలని కోరుకున్నారు. దోసిళ్లలో చినుకుల్ని కురిపించే వాళ్ల గుండెగోసను విని తడితనంతో అక్షరమై స్పందించారు. సరికొత్త జీవనరీతిని సృష్టించుకోవాలంటే వెలుగు జెండాలను ఎగరేస్తూ అప్రతిహతంగా ముందుకు సాగిపోవాలని సందేశించారు.
తెలంగాణ రాష్ర్ట స్వాప్నికుడు, కాకతీయ కదనతేజం జనార్థన్‌రావు ఉద్యమ చైతన్య శీలతను ఉద్విగ్నభరితంగా, ఉత్తేజపూరితంగా అక్షరీకరించారు. చెమట చుక్కల చెమ్మ, వెలుతురు పాటల వెలుగమ్మగా అమ్మను అమృతమూర్తిగా అభివర్ణించారు. మత్తుకు అలవాటైతే మాయరోగాన్ని పిలిచినట్టే అన్నారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. కులవృత్తులు ధ్వంసం కాగా ఎంతో వేదనపడ్డారు. స్టేహోం – స్టేసేఫ్ అన్న కవితలో రక్కసి కరోనా భీభత్సాన్ని చెప్పి ఎదుర్కొనే ఆత్మబలాన్ని బలంగా నూరిపోశారు. చీకటి కళ్ళకు కాంతి ఖడ్గం, ఆలోచనలు వెన్నెల మైదానపు సమ్మోహనాస్త్రాలు వంటి ఆలోచనాత్మక పదప్రయోగ వాక్యాలు మైలురాయి కవితలో కనిపించాయి. గబ్బిలాల వాసనల్ని నిప్పుల చుక్కలతో కాల్చేయాలని శషభిషలు ఇంకా ఇంకెన్నాళ్ళని ఆగ్రహించారు. తరాల బానిసత్వాన్ని తరిమేయడానికి ఉరిమే ఉద్యమపథమే సరైన మార్గమని తెలంగాణ ప్రాంత అస్తిత్వ పోరు బలిమిని గుర్తు చేశారు. కరోనా ధాటికి ఉపాధినిచ్చే ఊళ్లు ఏకంగా ఖాళీ కాగా వలస బాటను కాలిబాటను చేసుకున్న మనుషుల వ్యదార్థ యదార్థ గాథల్ని దయార్ద్రంగా చిత్రించారు. విశ్వమంతా వెలుగు చిమ్మిన శాస్త్రవేత్తల ఉన్నతోన్నత జ్ఞానదీపానికి మరీచిక కవితలో నమస్కరించారు. విషాదమైన విశాఖ కవితలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న విషపు గాలి రాక్షసత్వానికి వేదనాభరితుడయ్యారు. అంబేద్కర్, గాంధీజీ, పూలే, వాల్మీకి, పాల్కురికి సోమనాథుడు, రావి నారాయణరెడ్డి, దాశరథి, కాళోజి, సినారె, జయశంకర్, ఆరుట్ల దంపతులు, శ్రీకాంతాచారి, కల్నల్ సంతోష్‌బాబు, సమ్మక్క సారక్కను, బతుకమ్మను, మట్టిని నమ్ముకున్న మనిషిని, తెలంగాణ సబ్బండ జాతిని, విస్ఫులింగంగా ఎగసిన ఉద్యమ స్ఫూర్తిని పలు కవితల్లో కవి గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల చరిత్రలో దగాపడ్డ తెలంగాణను నిశ్శబ్దపు విస్ఫోటనంగా, అస్తిత్వపు పోరుకేకగా పోల్చి చూపారు. కత్తుల వంతెన, అణచబడ్డ మట్టి, గర్జించు పొలికేకలు వంటి పద ప్రయోగాలు తెలంగాణ ఉద్యమ సంఘటనలకు ప్రత్యక్ష దృశ్యీకరణలుగా భాసించాయి.
చైతన్యసారధి, అనలతేజం, సాహితీవిశ్వంభరుడు, జానపదబ్రహ్మ, వీర తెలంగాణ వైభవం వంటి శీర్షికలలో గుణాత్మక విలువలను ప్రభోధిస్తూ సాగి ప్రకాశించిన రత్నాల్లాంటి పద్యాలున్నాయి. పాల్కురికిని సరళ పురాణాల మార్గదర్శిగా, దాశరథి, కాళోజిలను అన్యాయంపై కురిసిన సెగనిప్పులుగా చూపారు. శీల సంపదనే జాతికి అమూల్యమైన సౌందర్య సంపదగా భావించారు. తాను భావిని అని, ఆశావాదినని స్పష్టంగా చెప్పి భవిష్యద్దర్శనం చేశారు. ప్రశ్నించే కాల యవనికపై చరిత్ర వెల్లడించిన నగ్న సత్యాలను నిండారా ఆరబోశారు. ఈ సంపుటిలో చివరన చేర్చిన 48 మట్టి మనిషి పదాలు కవిలోని సునిశిత పరిశీలనా దృష్టి నుండి వెలువడిన విభిన్నతల సంతరింపుగా, పాతక్రొత్తల మేలు కలయికగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కవితను ఎలా మొదలు పెట్టాలి/ ఎలా నడిపించాలి/ ఎలా ముగించాలి అని స్వప్నలోకం శీర్షికతో ఉన్న ఈ సంపుటిలోని కవితలో డాక్టర్ వెంకటయ్య మొదటి మూడు పంక్తులలో తనను తానే ప్రశ్నించుకున్నారు. ఆత్మ సంవేదనల్ని చీల్చుకుని కాంతి ప్రవాహమై ప్రయాణించి కాగితంపై వొలికిన కావ్య సుమాలుగా సర్వ సమగ్ర అంశాలను ప్రత్యేకమైన శైలిని పాటిస్తూ హృదయగతంగా కవితామయం చేయడంలో కవిగా అందుకే వెంకటయ్య కృతకృత్యులయ్యారు. స్థానీయత, దేశీయతతో కూడిన హృదయపు ఆర్తిని కవిగా నిఖార్సైన నిజాయితీతో వెల్లడించారు. ఎంతెంతో లోతైన తాత్వికతతో కూడిన వైవిధ్యపు కవిత్వాన్ని రాసిన లక్ష్యసాధకుడైన కవిగా అట్టడుగు మనుషుల మట్టిపొరల చరిత్రను సుస్థిరమైన కవిత్వంగా మలిచారు. సామాన్యుడి నుండి మాన్యుడి వరకు, మట్టి నుండి మహాకాశం దాకా నిండిన నిత్య జీవన దృశ్యాల శోభ, కవి స్వీయ ముద్రాంకితమైన కవిత్వ వ్యక్తిత్వం వెరసి విశ్వవీణపై వెండి మేఘపు క్రాంతి కవిత్వమై మెరిసింది.
– తిరునగరి శ్రీనివాస్
8466053933