Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవ ఎన్నిక లాంచనమే

  • అధికారికంగా ప్రకటించనున్న ఇసి
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఆరు నామినేషన్ల తిరస్కరణ..
  • రెండు సీట్లకు రంగంలో నలుగురు అభ్యర్థులు
  • నల్గొండ జిల్లాలో మూడు నామినేషన్లు తిరస్కరణ..8 ఆమోదం

ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంఛనం కానుంది. ఆమెకు పోటీగా ఎవరూ లేకుండా పోయారు. నామినేషన్‌ ‌దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ ‌నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అయితే ఆయన నామినేషన్‌ ‌పైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నామినేషన్‌ ‌దాఖలుకు ప్రపోజల్‌ ‌జాబితాలో జత చేసిన స్థానిక సంస్థల వోటర్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా మంగళవారం రాత్రి నుంచి ఆరోపణలు వచ్చాయి. బుధవారం సంబంధిత వ్యక్తులు కలెక్టర్‌ ‌నారాయణరెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్‌ ‌నగరానికి చెందిన 31వ డివిజన్‌ ‌కార్పొరేటర్‌ ‌గజియా సుల్తానా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిపై వొచ్చిన ఫిర్యాదులను ఎన్నికల నియమావళి ప్రకారం పరిశీలన చేస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు సాయంత్రం వరకు ఫిర్యాదులపై తుది నిర్ణయం వెల్లడి కానుండగా అనూహ్యంగా ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో కవిత ఒక్కరే ఉండడంతో గెలుపు లాంఛనమే కానుంది. ఇసి దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఆరు నామినేషన్ల తిరస్కరణ..రెండు సీట్లకు రంగంలో నలుగురు అభ్యర్థులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.‌వెంకట్రావు వెల్లడించారు. బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఇ. శ్రీధర్‌, ‌పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌, ‌జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. ‌వెంకట్రావు నామినేషన్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మహబూబ్‌ ‌నగర్‌ ‌స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల (2) పదవుల ఎన్నికకు గాను మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 4 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన 6గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్‌ ‌తెలిపారు. ఆమోదించిన నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌లతోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులవి ఉన్నట్లు తెలిపారు.

నల్గొండ జిల్లాలో మూడు నామినేషన్లు తిరస్కరణ..8 ఆమోదం
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 8 నామినేషన్లు ఆమోదం పొందగా మూడు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి నామినేషన్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా నల్లగొండ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఒక స్థానం ఎన్నికకు గాను మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 8 నామినేషన్లు ఆమోదించగా.. తక్కిన ముగ్గురి నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు తెలిపారు. ఆమోదించిన నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఎం.కోటి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, రాం సింగ్‌ ‌కొర్రా, బెజ్జం సైదులు, తందు సైదులు, అరుపుల శ్రీశైలం, డా.కె నగేష్‌, ‌వంగూరి లక్ష్మయ్య నామినేషన్లు ఆమోదించారు.

Leave a Reply