Take a fresh look at your lifestyle.

కవితాక్షర ఉప్పెన

పురిటి నొప్పుల్ని భరిస్తేనే..
పసిగుడ్డు తొలి కేక వినిపించేది
మట్టిని హలంతో మదిస్తేనే..
విత్తు వికసించి పంట పండేది
కవి మది మడిని దున్నితేనే..
సద్భావనల కవితా విత్తులు మ్నెలిచేది !

గుండె గాయాల పాలైనపుడు..
బతుకు వెతలు కలిచి వేసినపుడు..
సంక్షోభంలో కన్నీళ్ల ధార కారినపుడు..
బలహీనుడు నిస్సహాయుడైనపుడు..
అరాచకం రాజ్యమేలినపుడే కదా
ధిక్కార కవితా మంటలు ఎసిగేది !

ఆనందం మత్తడి దూకినపుడు..
ప్రకృతి మనసుతో తాళమేసినపుడు..
ప్రేమ పరిమళాలు పులకించినపుడు..
రసజగత్తులో మది తేలియాడినపుడు..
పండు వెన్నెలతో ఊసులాడినపుడే కదా
కమ్మని కవితా పాల ధార పొంగి పొర్లేది !

అక్షరానికి అక్షరాన్ని అతికించినపుడు..
పదానికి పదాన్ని జోడించినపుడు..
వాక్యం వాక్యంతో ప్రేమించినపుడు..
భావం భావంతో వియ్యమందినపుడు..
కవి కవితకు ప్రాణం పోసినపుడే కదా
చల్లని సత్కవిత్వ నురగ ఏరులై పారేది !

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply