Take a fresh look at your lifestyle.

పాటను పదునెక్కించిన ప్రజాకవి ‘వంగపండు’

ఆధునిక ఉద్యమాలలో పాటది ప్రత్యేక స్థానం ! అది సాయుధ రైతాంగ పోరాటం అయినా, విప్లవ పోరాటం అయినా లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అయినా అందులో పాటది కీలక పాత్ర అని మన అందరికీ తెలిసిందే.అలాంటి పాటను పదునెక్కించి విప్లవోద్యమానికి దన్నుగా నిలిపిన వాళ్లలో ఆగస్టు మూడున గుండెపోటుతో మరణించిన వంగపండు ప్రసాద రావు ఒకరు.
తెలుగు సమాజానికి విప్లవోద్యమం అందించిన ఆణిముత్యాలలోఆయన ఒకరు.తాను శ్రీకాకుళ ఉద్యమస్ఫూర్తితో  పోరుబాటను ఎంచుకున్నానని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. పాటను ఆయుధంగా చేసుకుని జీవితమంతా ప్రజా సమస్యలపై గళమెత్తారు.ఆయన ఐ టి ఐ వరకే చదువుకున్నారు. కవిత్వ రచనకు ఇతరులు కావాలని అనుకునేటంతటి పెద్ద చదువులు ఆయన చదువుకోలేదు. అకడమిక్‌ ‌భాషలో చెప్పాలంటే ఆయన పండితుడు కాదు. కానీ కొమ్ములు తిరిగిన పండితులు సైతం కొయ్యబారిపోయేటంతటి అద్భుతమైన పాటలు రాశారు. ఆ పాటలతో అటు పండితులను ఇటు పామరులను ఉర్రూతలూగించారు. ఆయన పేరు కన్నా ముందే ఆయన పాట ఆంధ్రదేశంలోని జనాల్లోకి  వెళ్ళిపోయేది. వి.ర.సం ఏర్పాటు తరువాత జరిగిన అనేక సభల్లో గద్దర్‌, ‌వంగపండుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ.యాభై యేళ్ల  సుదీర్ఘ ప్రస్థానంలో 300కు పైగా ఆయన రాసిన పాటలు అత్యధికం ప్రజాదరణకు నోచుకున్నవే. సుత్తి కొడవలి గుర్తుగ ఉన్న /ఎర్రని జెండా ఎగురుతున్నది. యంత్రమెట్ల నడుస్తు ఉందంటే – ఏం పిల్లడో /ఎల్దమొస్తవా – జజ్జనకరి జనారే-‘ ఓడా నువ్వెళ్లి పోకే’ లాంటి పాటలు మచ్చుకు కొన్ని మాత్రమే.  ఆయన పాట ఎత్తుకున్నాడంటే సభ మొత్తం లేచి ఆయనతో పాటుగా చిందేస్తుందేమో అన్నట్టుగా ఉండేది వాతావరణం.

పాటకు ఆయన ఎంచుకున్న వస్తువు, అందులో ఆయన వాడిన భాష లను పరిశీలిస్తే తెలుస్తుంది,వంగపండు బలం ఏమిటో. ప్రజల సమస్యలను అదే ప్రజల భాషలో  పాటలు  కట్టడం ఆయన బలం. హిందుస్థాన్‌ ‌షిప్‌ ‌యార్డ్ ‌లో ఆయన చేసి, వదిలేసింది ఫిట్టర్‌ ఉద్యోగం. ఆయన యంత్రాలకు ఎట్లా అయితే నట్లు బిగించేవాడో ఇక్కడ కూడా ఏ పదాన్ని వేయాలి ?ఎలా వాడాలి? అన్న విషయాలను బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి ఆయన. ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు కారణాలు, వాటికి కారకులు ఎవరో పాటలలో చూపించే తీరు అత్యంత సహజంగా ఉంటుంది. తాను రాసిన మొదటి పాట తోనే తన దృక్పథం ఏమిటో ప్రకటించుకున్నారాయన. ప్రజలు పీడింపబడుతన్నారనీ, వాళ్లను భూస్వాములు దోచుకుంటున్నారనీ, ఇందుకు పరిష్కారంగా ప్రజలు ఏమి చెయ్యాలో ఆ పాటలో ఆయన చేసిన సూచన స్పష్టంగా ఉంది. తదనంతర కాలంలో ఆయన రాసిన ‘భూబాగోతం’ నృత్య రూపకం ఉమ్మడి ఆంధ్ర దేశంలో అనేక ప్రదర్శనలు పొందింది. చాలీ చాలని కమతం/ పరుల పాలాయె ఫలితం /పన్నుల కోసము /  పసుల బేరాలను ఆపలేను/ అంటూ రైతు పడే వేదనను ఈ నృత్య రూపకంలో ఆయన ప్రారంభంలోనే గానం చేశారు. ఇందులోని వస్తువు కూడా సుస్పష్టమే. రైతుల అగచాట్లు,భూస్వాముల దోపిడీని, అధికారుల జులుంను శక్తివంతంగా తెలియజెప్పిన రూపకమిది. సుంకర, వాసిరెడ్డి లు వ్రాసిన ‘మాభూమి’కి వచ్చినంత పేరు వచ్చింది ఈ నృత్య రూపకానికి. తన చుట్టూ ఉన్న జీవితాన్ని ,తాను నమ్మిన సిద్ధాంతం వెలుగులో ఆయన ఎంతో శక్తివంతంగా కవిత్వీకరించారు.తాను రాసిన ఏ పాట ను పరిశీలించినా వంగపండు గేయ రచనా నైపుణ్యాన్ని మనం సులువుగానే గ్రహించవచ్చు. మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు సైతం ఆయన పాటలు విని  ‘నేను కేవలం కవులకు కవిని – కానీ ఈ కుర్రాడు మాత్రం నిజమైన ప్రజాకవి అని ఒక నిండు సభలో అనడమే కాక – అతడిని తాను బస చేసిన లాడ్జ్ ‌కు పిలిపించుకుని పాటలన్నీ పాడించుకున్నాడట. ఈ సందర్భంగా ఒక పాటలో మహాకవి ఒక చిన్న సూచన కూడా చేశాడని వంగపండు స్వయంగా చెప్పుకున్నారు. వత్తున్నాడొత్తున్నాడు/ ఆ బూములున్న  బుగతోడు/అన్న పాటను ఏకాగ్రతతో విని శ్రీశ్రీ వీటి తర్వాత ‘అదిగదిగో అటు చూడు’ అనే వాక్యాన్ని చేర్చమన్నాడట. అది ఆ పాటలో బాగా అమరిందని వంగపండు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వంగపండు పాటలు ప్రజలు తాము పడుతున్న కష్టాలకు  తాము పెడుతున్న కన్నీళ్ళు ఉబికి వచ్చినంత సహజంగా ఉంటాయి. ఇందుకు ప్రజల జీవితాలను ఆయన పరిశీలించిన తీరు కారణం. అందులోని వస్తువు ఏదైనా,అది అత్యంత సహజంగా ఉంటుంది. యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే అనే పాట అన్ని ప్రాంతాల సామాన్య ప్రజల జీవితానుభవంలో ఉన్నదే కానీ ‘ఓడా నువెళ్లిపోకే’అనే పాట మాత్రం సముద్ర తీర ప్రాంత ప్రజలకు ప్రత్యేకం. ఓడను నిర్మించడం అంటే మేడను నిర్మించడం కన్నా సంక్లిష్టమైనది.ఎందుకంటే దానిని ‘నీటిలోన కోట’ లాగా  నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకు ‘కండలన్ని పిండి చేసి/ కార్మికుల ‘ఎముకలొంచి’ కట్టాల్సి ఉంటుంది. ఆ పనిలో భాగమయ్యే కార్మికులు, ఆయా పనులు జరిగే విధానం, వాటిని పాటగా మలచిన తీరు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది.
ఇక ఏం పిల్లడో ఎల్దమొస్తవా అన్న పాట విన్నప్పుడల్లా మనకు చెరబండరాజు రాసిన కత్తి పాట జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే ముంజేతిని ఖండించిన/ నా పిడికిటి కత్తి వదల/ ఉరి తాటికి పాట నేర్పి/ పల్లవినే పాడిస్తా అంటాడందులో. అలాగే ఈ గేయం లో కూడా ‘సిలకలు కత్తులు దులపరించడం / పాముని సంపిన చీమలు’ అనడం ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే భావన. ఒక  అచంచల విశ్వాస ప్రకటన . ఇది పూర్తిగా తమ సిధ్ధాంతాన్ని సాహిత్యీకరించడమే అవుతుంది. పాటల రచయితగా వంగపండు ప్రసాదరావు విజయానికి ఆయన ఎంచుకున్న భాష  బాణీలు ఎంతో కీలకమైనవి. ఆయన పాటలలో ఉత్తరాంధ్ర సామాన్య ప్రజల భాష, వాటి సొగసులు, అత్యంత సహజంగా ఒదిగి పోయాయి. దీనివల్ల ఆ పాటలకు ఎంతో నిండుదనం వచ్చింది. శక్తివంతమైన పాటలు రాసిన వాళ్ళ సంఖ్య ఏ కాలంలో అయినా చాలా తక్కువగానే ఉంది. ఆ తక్కువ మందిలో తళుక్కున మెరిసే తారలాంటి వాడు వంగపండు.  మంచి పాట రాసే విధానం ఎట్లాగో ఇప్పటి యువతరం ఆయన నుంచి  నేర్చుకోవాలి. పాటతో సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన వంగపండు తెలుగు సాహిత్యంలో ధృవతార.
– గుండెబోయిన శ్రీనివాస్‌
   9985194697

Leave a Reply