మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వార్డులను అత్యవసర సమయంలో ఆదివాసీ గిరిజనులకు వైద్య పరీక్షలకు, గర్భిణీ స్త్రీలకు ప్రసవం చేయడానికి ఉపయోగించవలసిన వార్డులను సిబ్బంది వాడుకోవడంపై భద్రాచలం ఐటిడిఏ పిఓ గౌతమ్ వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. డెలివరీ గదులలో, ఆస్పత్రి పక్కన ఉన్న వార్డులలో సిబ్బంది సామాగ్రిని చూసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ ఇలాగేనా ఉండేదని మండిపడ్డారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని వార్డులను, మందుల స్టోర్ రూమ్ లను పరిశీలించి ఆసుపత్రికి వచ్చే రోగులకు సక్రమంగా వైద్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా వడగాలులు ఎక్కువ అయినందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎక్కువ మోతాదులో అందుబాటులో ఉంచుకోవాలని, ఓ పి కి వచ్చే రోగులకు తప్పకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. మారుమూల గ్రామాలలోని ఆదివాసి కుటుంబాలకు వడగాలుల నుండి ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించాలని అన్నారు. వడదెబ్బ తగిలి ఎవరైనా ఆరోగ్య కేంద్రానికి వస్తే వెంటనే అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని, వారికి సీరియస్ గా ఉంటే పై అధికారులకు తెలియపరిచి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.అదేవిధంగా కరోనా వైరస్ సంబంధించిన జాగ్రత్తలు ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. వైద్య సిబ్బంది అందరూ స్థానికంగా ఉండేలా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పి ఓ సి సి గణేష్, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.