- గానగంధర్వుడు బాలు మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
- దశాబ్దాలుగా బాలు స్వరం ఇంటింటా మోగిందన్న మోడీ
- దేశం గర్వించదగ్గ గాయకుడని శ్లాఘించిన వెంకయ్య
- బాలు స్వరం నిత్యనూతనం అంటూ రాహుల్ ట్వీట్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత సంగీతం ఓ గొప్ప స్వరాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి అన్నారు. పాటల చంద్రుడిగా ఎస్పీ బాలు అనేక పురస్కారాలు అందుకున్నారని కోవింద్ పేర్కొన్నారు. మన సాంస్కృతిక ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటు అని మోదీ పేర్కొన్నారు. బాలు స్వరం దశాబ్దాలుగా దేశంలో ఇంటింటా అలరించింది అని ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా బాలసుబ్రహ్మణ్యం పేరు తెలియని ఇల్లు లేదని, ఇంటింటా ఆయన పేరు మారుమోగుతుండేదని ప్రధాని తన సంతాప సందేశంలో గుర్తుచేసుకున్నారు. ఆయన గాత్ర మాధుర్యం, సంగీతం దశాబ్దాలుగా ప్రజలను ఉర్రూతలూ గిస్తూనే ఉందని అన్నారు. ఎస్పీబీ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను ఎంత ఆవేదనకు గురిచేస్తుందో తలుచుకుంటే ఆవేదన కలుగుతోందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు గుండె నిబ్బరం చేసుకోవాలని, బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
భారత దేశం గర్వించదగ్గ గాయకుడిగా పేరు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడిగా ఐదున్నర దశాబ్దాల పాటు తన అద్భుత గానంతో ప్రజలను అలరింప చేశారని ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం తనకు దిగ్బ్రాతిని కలిగించిందన్నారు. బాలు కొరోనా బారినపడి ఎంజీఎం ఆసుసత్రిలో చేరారని తెలిసినప్పటి నుంచి వైద్యులతో రోజూ మాట్లాడి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూవచ్చానన్నారు. ఆయన కుమారుడితో మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ వైద్యులకు సూచనలు చేస్తుండే వాడినన్నారు. బాలు కోలుకున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరమన్నారు. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ గళాల్ని వెలుగులోకి తీసుకు వచ్చారని అన్నారు. గాన గంధర్వుడైన ఎస్పీబాలు మా ఊరివాడైనందుకు చిన్పప్పటి నుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని రోజూ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు , అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాన గాంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఎస్పీ బాలు కుటుంబీకులకు, స్నేహితులకు నా హృదయ పూర్వక సంతాపం ప్రకటిస్తున్నాను. అతని పాటలు అనేక భాషలలో మిలియన్ల హృదయాలను తాకాయి. అతని స్వరం మాత్రం మార్మోగుతూనే ఉంటుందని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా అన్నారు.