- సెకండ్ వేవ్ రాకుండా చూసుకోవాలి
- కట్టుదిట్టమైన చర్యలను అవలంబించాలి
- ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలి
- టెస్టుల సంఖ్యను పెంచాలి
- అవసరమైన చోట్ల మైక్రో కంటెయిన్మెంట్ల ఏర్పాటు
- సిఎంలతో సమావేశంలో ప్రధాని మోడీ మార్గదర్శకాలు
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనికోస నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు. దేశంలో కొవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగేల్ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…. అందరూ అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యం లో అవసరమున్న చోట్ల ’మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుం దామని, అంతేగానీ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొరోనా టెస్టులు ఎందుకు తక్కువగా చేస్తున్నారో అర్థం కావడం లేదని, సుపరిపాలన అందించడానికి ఇదే సరైన సమయం అని తెలిపారు. ఆత్మ విశ్వాసంతోనే ముందు కెళ్దామని, అలాగని అతి ఆత్మవిశ్వాసం కూడదని హెచ్చరించారు. దేశంలో రెండోదశ కొరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, త్వరిత గతిన అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంలకు సూచించారు. ఇప్పటి వరకూ సురక్షితంగా ఉన్న జిల్లాల్లోనే తిరిగి కొరోనా• పెరుగుదల కనిపిస్తోందని, 70 జిల్లాల్లో కొరోనా తీవ్రత గతంలో కంటే అధికంగా కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. దీనిని కరికట్టకపోతే మరోసారి కొరోనా విలయ తాండవం చేసే అవకాశం ఉందని, అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసు కోవాలని స్పష్టం చేశారు.
కొరోనాతో ప్రభావితమైన చాలా దేశాలు రెండో వేవ్‌ను చవిచూస్తున్నాయని, మన దేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోదీ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొరోనా కేసులు అమాంతం పెరిగి పోయాయని, ఈ విషయంపై ముఖ్యమంత్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.కొరోనా నుంచి చాలా మంది కోలుకుంటున్నారని, మరణాల రేటు తక్కువగా ఉన్న జాబితాలోకి ఇండియా చేరిందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో కొరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి వక్కానించారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఇక కొరోనా కు చెక్ పెట్టడానికి మాస్క్‌లు తప్పనిసరి చేయాలని, భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్రం సూచించింది. జనం గుమిగూడే అవకాశం ఉన్న ఈవెంట్లలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగాలని సూచించింది.
ఇక ఇండియాలో ఇప్పటి వరకూ 96 శాతం మంది కోలుకున్నారని, చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులను అలా ఆందోళనకరంగా చేయాల్సిన పని లేదు. కొన్ని ముందు జాగ్రత్తలు, చర్యల ద్వారా ప్రజల కష్టాలను దూరం చేయాలి అని మోదీ సూచించారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య తగ్గడాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎందుకు టెస్టుల సంఖ్య తగ్గిందని ప్రశ్నించారు. మన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారకూడదు అని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ వృథాపై కూడా ప్రధాని మాట్లాడారు. తెలంగాణ, ఆంధప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని మోదీ చెప్పారు. ఆ రాష్ట్రాలు వ్యాక్సిన్ వృథాను సవి•క్షించాలని సూచించారు. అసలు ఎందుకు వృథా అవుతోందో ప్రతి రోజూ పర్యవేక్షించాలని, అసలు వృథా లేకుండా చూడాలని స్పష్టం చేశారు.