Take a fresh look at your lifestyle.

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా ఆ సమయంలో మొక్కలకు నీరు పెట్టక పోతే లేదా అందకపోతే పంట నష్టం జరిగే అవకాశం ఉంది.

మన పూర్వీకులు మెట్ట పంటలను వర్షాధారంగాను, బావులనీటితోను పండిస్తున్నారు.  నాడు పర్యావరణం దెబ్బతినకుండా, వాతావరణం పరిస్థితులు అనుకూలించి సమయానుకూలంగా వర్షాలు కురవడం వలన ఉన్ననీటితో పంటలను సమృధ్ధిగా పండించేవారు.  కానీ నేడు పర్యావరణం దెబ్బతిని  సకాలంలో వర్షాలు కురువక వర్షాభావ పరిస్థితులు పంటల సాగుకు కష్టమవుతుంది.  రైతులకు వేసవిలో సాగు నీటివాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మిగతా కాలాల్లో నీటిని అవసరానికి మించి వాడినందువల్ల లాభమేమి లేక అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాక మంచి భూములు క్రమంగా  చౌడు భూములుగా  మారుతాయి.  ఏ పైరు నుంచి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే, ఆ పంట ఏ దశలోనూ బెట్టకు గురికాకూడదు.  వేసవిలో పైరు అవసరాన్ని బట్టి ఎక్కువ తడులు ఇవ్వాలి.

ముఖ్యంగా పంట కీలక దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి.   ఏపంటకు ఎన్ని తడులు ఇవ్వాలి.   తడులు మధ్య ఎంత కాల వ్యవది ఉండాలి అనేది ముఖ్యంగా నేల స్వభావం, పంట గుణగణాలు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.  సాధారణంగా వేసవిలో నీరు పెట్టినప్పుడు, మొక్కలో నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది.  కాబట్టి నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50 శాతం కంటే తగ్గిపోకముందే పైరుకు/ పంటకు నీరు పెట్టాలి.  పంటల దిగుబడి ముఖ్యంగా ఆ ప్రాంతంలోని వాతావరణ  పరిస్థితులు, ఎన్నుకున్న పంటరకం, నేల స్వభావం, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటి వసతులు, రైతులు చేపట్టే యాజమాన్య పద్దతులపై ఆధారపడి ఉంటుంది.  కాబట్టి  వేసవిలో పండించే పంటను, నీటి లభ్యతను బట్టి కొన్ని రకాల నీటి పారుదల పద్దతులను అవలంబించడం వలన అధిక దిగుబడులతో పాటు లాభాలను పొందవచ్చు.

వేసవిలో వివిధ పంటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌/‌బిందు  సేద్యం అవలంబించటం :
పంటకు కావలసిన నీటిని లేటరల్‌  ‌పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా ప్రతి మొక్కకు నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్పపరిమాణంలో అందించే విధానాని ‘’డ్రిప్‌ ‌పద్దతి’’ లేదా ‘’బిందు సేద్యం’’ అంటారు.  మొక్కలు భూమి నుండి పోషక పదార్దాలు కలిగిన నీటిని పీల్చుకుని బాష్ఫోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీరు ఆవిరిగా మారడం ఎండాకాలంలో ఎక్కువగానే ఉంటుంది. అందువలన బిందు పద్దతిని, ఎండాకాలంలో పంటకు సరిపడా నీరు అందించే విధంగా ఉపయోగించాలి.  ఈ బిందు సేద్య పద్దతిని మిరప, టమాటో, ద్రాక్ష, ఆపిల్‌, ‌నిమ్మ, జామ, మామిడి, బఠానీ, దోసా, కాలిప్లవర్‌  ‌తదితర పంటలలో ఉపయోగిస్తారు.  ఈ డ్రిప్‌ ఇరిగేషన్‌ ‌పద్దతిలో నీటిని పాలిథిన్‌ ‌గొట్టం ద్వారా పొలంలోకి తీసుకెళ్లిపోయి అక్కడి నుండి చిన్న చిన్న నాజిల్‌ ‌లేదా ఎనిటర్ల ద్వారా నేలపైన పడేటట్లు లేదా నేల పొరలలో నీరు వదిలేస్తారు. నాజిల్స్ను పైరు వరుసల మద్యగాని, పండ్ల తోటలలో మొక్కకాండం దగ్గరగాని ఉంచుతారు. ఈ విధంగా చేయడం వలన నీరు వృధా కాకుండా మొక్కలకు త్వరగా అంది ఆవిరి అవ్వడాన్ని అరికడుతుంది.

 వేసవిలో ప్లాస్టిక్‌ ‌మల్చింగ్‌ :

మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40 % వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్దతితో కలిపి వాడితే అదనంగా 20 శాతం నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాలలో పంటలకి ఇది ఎంతో మేలుచేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడంవల్ల కిరణజన్యసంయోగ క్రియ జరగక సుమారు 85 శాతం వరకు నివారణ అవుతుంది.  దీనివల్ల నేల ఉష్ణోగ్రత పెరిగి సోలరైజేషన్‌ ‌జరుగుతుంది. ఈ పద్దతి వల్ల నీరు ఆవిరికాకుండా ఉండి మొక్కలకు లభ్యమవుతూ అధిక దిగుబడికి దోహదపడుతుంది.  కావున మల్చింగ్‌ ఆరుతడి పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది.  మల్చింగుకు  వేరుశనిగ గాని, వరిపొత్తు గానీ లేదా ఇతర పదార్దాలను వేసవి ఆవిరిఅవ్వడం తగ్గించి నీటిని సంరక్షించుకోవచ్చు.   మన చేనులో కురిసిన ప్రతివానబొట్టును వృదా పోకుండా నీటి గుంతలను నిర్మించుకోవాలి. ఉదాహరణకు ప్లాస్టిక్‌ ‌కవరు పరచబడిన నీటి గుంతలను ఏర్పరచుకొని నీటిని ఆదా చేసుకుంటే వేసవిలో నీటి కొరత సమయంలో ఈ నీటిని ఉపయోగించి అధిక దిగుబడులను సాధించవచ్చు.
 – ఎల్‌.‌వెంకట్రామిరెడ్డి, ఉద్యాన సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం.

Leave a Reply