Take a fresh look at your lifestyle.

మొక్కల పండుగొచ్చింది

ఆ కుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగంగా హరితహారం కార్యక్రమానికి మరోసారి భారీ స్థాయిలో ప్రభుత్వం నేటినుండి శ్రీకారం చుట్టబోతోంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో అయిదు విడుతలుగా అమలు చేసిన హరితహారం ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తోంది. గడచిన అయిదేళ్ళ కాలంలో దాదాపుగా 180 కోట్ల మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీచేసింది. అందులో కొన్ని పోగా, ఎక్కువ శాతం వృక్షాలుగా ఎదుగుతున్నాయి. రహదారులు విస్తరించే కార్యక్రమంలో అనేక పద్ద పెద్ద వృక్షాలను నేలరాల్చారు. దానితో పోలిస్తే పెరుగుతున్న చెట్ల సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి. అందుకే చేసింది చాలా తక్కువ, చేయాల్సింది ఎక్కువ కావడంతో ఈసారి మరింత పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్దంచేసింది. ఈసారి కనీసం ముప్పై కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌ఎం‌డిఏలో అయిదు కోట్ల మొక్కలను, జీహెచ్‌ఎం‌సీ పరిధిలో రెండున్నర కోట్లు, అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఒక లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను తయారుచేసింది. వర్షాకాలం ప్రారంభనుండి వానలు జోరందుకోగా, గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటి పూర్తి అవుతూ వివిధ కరువు ప్రాంతాలకు సమృద్ధిగా నీరు చేరుతుండడంతో గత సంవత్సరాలకన్నా పెద్ద సంఖ్యలో ఈసారి మొక్కలను నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే అనుకోని రీతిలో కొరోనా ఈ లక్ష్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. యావత్‌ ‌తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా చేపట్టాలనుకున్న హరితహారం కార్యక్రమాన్ని ఒక విధంగా కొరోనా కట్టడి చేస్తోందనే చెప్పాలె. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మొక్కకు ఒకరికంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని చెబుతోంది. ఈ పరిస్థితిలో ఈసారి అనుకున్న లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందన్నది చెప్పలేని పరిస్థితి. ఆరో విడుతగా చేపడుతున్న ఈ హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెదక్‌ ‌జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జిల్లాలోని నర్సాపూర్‌లో గురువారం నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాగా హరితహారం కోసం తెలంగాణలోని దాదాపు పన్నెండున్నర వేల నర్సరీల్లో వివిధ రకాలైన మొక్కలను సిద్దంచేశారు.

పూలు, పండ్ల మొక్కలతోపాటు టేకు, సరుగుడు, చింత మొక్కలను విస్తారంగా నర్సరీల్లో పెంచారు. అయితే ఈసారి నగరాలు, గ్రామాలకన్నా అటవి ప్రాంతాల్లోనే ఎక్కువ మొక్కలను నాటాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటిసారి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలన్న రాష్ట్ర సిఎం నినాదం విజయవంతం కావాలంటే నిజంగానే అటవి ప్రాంతాల్లో మంచి ఫలసాయాన్నిచ్చే మొక్కలను అత్యధికంగా నాటాల్సిన అవసరముంది. అడవులు క్షీణించడంవల్లే కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి విస్తృతంగా వొస్తున్నాయి. వీటివల్ల వ్యవసాయదారులకు పెద్ద తలనొప్పి తయారైంది. ఏ పంటను బతకనిచ్చే పరిస్థితిలేదు. చివరకు అమ్ముకోవటం సంగతి పక్కకు పెట్టి, కనీసం ఇంటివరకు కూరగాయలను పండించుకునే పరిస్థితి పల్లెల్లో లేకుండాపోయింది. అలాగే అడవులు సన్నగిల్లడంతో తరుచు అడవి జంతువులు గ్రామాల్లోకి చొచ్చుకొచ్చి పశువులను, మనుష్యులపై దాడిచేస్తున్నాయి. ప్రజలంతా నిత్యం భయపడాల్సిన స్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే అటవి ప్రాంతాన్ని వృక్ష సంపదతో పూర్వవైభావాన్ని కల్పించాల్సిఉంది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతంగా పెంచాలన్నది ప్రభుత్వ ద్యేయంకూడా. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో అడవులు, పచ్చదనం శాతం కేవలం 24 శాతమే, దీన్ని 33 శాతానికి పెంచుకునే ప్రయత్నమే ఈ హరితహారం కార్యక్రమం. సరైన పచ్చదనం ఉంటేనే వాతావరణం అదుపులో ఉంటుంది. ప్రధానంగా ప్రతీ ఏటా వేసవిలో ఊష్ణోగ్రత పెరిగిపోతూఉంది. ఈసారి కొన్ని ప్రాంతాల్లో 48 నుంచి 50 డిగ్రీలవరకు చేరుకోవడం చూశాం. అలాంటి వాతావరణం నుండి మనను మనం కాపాడుకోవాలంటే విస్తారంగా మొక్కలను నాటి వృక్షాలయ్యే విధంగా వాటిని పోషించుకోవాల్సిన బాధ్యత మీది, మాది మనందరిదీ. ప్రధానంగా పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు మరింత ఎక్కువగా భాగస్వాములుకావాల్సిఉంది. పరిశ్రమల నుండి వెలువడే వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు వారు ముందుకు రావాల్సిఉంది. కాగా, కొరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలన్నీ మూసివేయడంతో గత సంవత్సరంలోలాగా ఈసారి విద్యార్దులు పెద్ద సంఖ్యలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనే వీలులేకుండా పోయింది. కాగా గ్రామస్థాయిలో నాటిన వాటిని ఈసారి సంరక్షించాల్సిన బాధ్యతను పంచాయితీలకు అప్పగించింది ప్రభుత్వం. నాటినవాటిల్లో కనీసం 85 శాతం బతికేట్లు సర్పంచ్‌లు, పంచాయితీ కార్యదర్శులు చర్యలు చేపట్టకపోతే వారిని సస్పెండ్‌ ‌చేసేవిధంగా పంచాయితీరాజ్‌ ‌చట్టంలో మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో పచ్చదనాన్ని పరిడవిల్లజేయడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందుంటున్నదని ఇప్పటికే పలు ప్రశంసలందాయి. ఈసారికూడా అదే దీక్షతో చేపడితే పచ్చదనంలో దేశంలోనే నెంబర్‌ ఒన్‌ ‌రాష్ట్రంగా నిలిచే అవకాశాలున్నాయి.

Leave a Reply