Take a fresh look at your lifestyle.

బ్లాక్ ఫంగస్ కట్టడికి పక్కా ప్రణాళిక

బెడ్ల సంఖ్యను పెంచాలి ..:సీఎం కేసీఆర్

బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్నదని,  హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ వ్యాధి గ్రస్థులకు  చికిత్స అందించాలంటే, రద్దీని తట్టుకోవాలంటే  ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే వున్నవి కాకుండా ఇంకా ఏయే దవాఖానాల్లో బెడ్లను పెంచాలనే విషయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించారు. సరోజినీ దేవి హాస్పిటల్ లో 200 బెడ్లు, గాంధీ హాస్పిటల్ లో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. హైద్రాబాద్ లో  బెడ్లు కనీసం 1100 వరకు, జిల్లాల్లో 400 వరకు మొత్తం 1500 బెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. బెడ్ల సంఖ్యను పెంచడంతో పాటు, బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత సంఖ్యలో అవసరమున్నదో అంచనా వేసి దానిమేరకు  బ్యాక్ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలని సిఎం తెలిపారు. అందుబాటులో వున్న ‘‘పోసకోనజోల్’’ మందు స్టాక్  తక్షణమే పెంచాలని, అందుకు తగు చర్యలు చేపట్టాలని సిఎం సూచించారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలని సిఎం అన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి అటు కొరోనా ఇటు బ్లాక్ ఫంగస్  చికిత్స కోసం తరలి వస్తున్నారు.  రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు వాస్తవమే. అయితే.. కొరోనా చికిత్స విషయంలో నాలుగు కోట్లుగా కాకుండా అది పది కోట్లుగా అంచనా వేసుకోవాలె. మనకు  ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వాళ్ళకు కూడా చికిత్సను అందజేయంది తప్పేటట్టు లేదు..’’ అని సిఎం అన్నారు.  కొరోనా కంట్రోల్ చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందని, అవసరమైతే అప్పు తెచ్చయినా కొరోనా కట్టడికి సిద్దంగా వుంది’’.. అని అధికారులకు సిఎం స్పష్టం చేశారు.   ‘‘ అటు కొరోనా ఇటు బ్లాక్ ఫంగస్ తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో వున్నది.   ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply