Take a fresh look at your lifestyle.

పీయూష్‌ ‌గోయల్‌ ‌వైఖరి అహంకారపూరితం..

  • ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దుర్మార్గం…దురదృష్టకరం
  • వారిది రైతుల, పేదల ప్రభుత్వం కాదు..కార్పొరేట్‌ ‌ప్రభుత్వం
  • 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు…
  • కనీసం పండించిన పంట కొనక పోవడం సిగ్గుచేటు
  • దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : కేంద్రం తీరు దురదృష్టకరమని, వ్యవసాయ ప్రధాన దేశంలో ఒక రాష్ట్రం పట్ల కేంద్రం అహంకార పూరితంగా వవహరించటం అవాంఛనీయమని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు అన్నారు. పాడిందే పాట పాసుపండ్ల దాసు అన్నట్లు కేంద్రం, నరేంద్ర మోడీ వైఖరి ఉందని వారు మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌దుర్మార్గ పూరితంగా మాట్లాడారని..తమకంటే ముందే పీయూష్‌ ‌గోయల్‌ ‌మీడియా వద్దకు ఆతృతగా వొచ్చి తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదని, కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని, ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియటంలేదని ఎద్దేవా చేసారు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని, వడ్లను వడ్ల లాగా సేకరించాలని, గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా అని, బీజేపీకే తెలివి ఉందని ఇతరులకు లేదని వారు అనుకుంటున్నారని మండిపడ్డారు. దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైన సిగ్గులేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. సాగు చట్టాల విషయంలో చేసిందంతా చేసి చివరకు కేంద్రం రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పిందని ఎద్దేవా చేసారు.

తెలంగాణ బీజేపీ సన్నాసులు మేం కొనిపిస్తాం మీరు వరి వేయండని రైతులను రెచ్చగొట్టారని, తెలంగాణ రైతులకు తాము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామని వారు తెలిపారు. కేంద్రంలో ఉన్నది రైతు, పేదల ప్రభుత్వం కాదని, మోడీ నడిపే ప్రభుత్వం పొద్దున, మాపున లెక్కలు చూసుకునే కార్పొరేట్‌ ‌ప్రభుత్వమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి , రైతుబంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిందని, ఇన్ని చేసినందుకు తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమా అని వారు ప్రశ్నించారు. పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గమని, రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసిందని, తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వొస్తుందని మీడియా సమావేశంలో తెలంగాణ ఎంపీలు, మంత్రులు ప్రకటించారు.

మోడీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారని, ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తికి మోడీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ కొడుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశ జీడీపీ పెంచటంలో కేంద్రం విఫలమయిందని, దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయిందని వారు అన్నారు. ఇన్నేళ్లలో మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సూచన మేరకు ఈ విషయంలో ముందుకువెళ్తామని వారు స్పష్టం చేశారు. పశుపక్షాదులకు నీళ్లు లేని చోట ఎండాకాలంలో చెరువుల అలుగులు కెసిఆర్‌ ‌ప్రభుత్వం బాగుచేస్తున్నదని, తెలంగాణ రైతులను ఆదుకున్నది కేసీఆర్‌ ‌కదా అని, ఈ కేంద్రంలోని బీజేపీ మొనగాళ్లా ఆదుకున్నదని వారు ప్రశ్నిచారు. తమకు అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు పెడుతున్నదని, అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వొచ్చిందని, వారి మేనిఫెస్టోను చూస్తేనే ఈ విషయం అర్ధం అవుతున్నదని అన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో సమావేశం అనంతరం దిల్లీ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, హాజరైన మంత్రులు గంగుల కమలాకర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ‌రాజ్యసభ సభ్యులు కేశవరావు, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply